ఆయుష్

సీనియర్‌ స్థాయి పదోన్నతులతో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకానికి చెందిన ఆయుష్‌ యూనిట్లకు మరింత ప్రోత్సాహం


Posted On: 05 MAR 2021 3:35PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకానికి (సీజీహెచ్‌ఎస్‌)కు చెందిన ఆయుష్‌ యూనిట్ల పనితీరును మెరుగుపరిచే ప్రధాన చర్యలో భాగంగా, 78 మంది ఆయుష్‌ వైద్యుల బృందానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌లో ముఖ్య వైద్యాధికారులుగా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పదోన్నతి కల్పించింది. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్య విభాగాలకు చెందిన వైద్యులు పదోన్నతి పొందినవారిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా 39 మంది హోమియోపతి వైద్యులు ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో సీజీహెచ్‌సీ ఆయుష్‌ యూనిట్లు ముఖ్య పాత్రను పోషిస్తూ, ఏడాదికి దాదాపు ఆరు లక్షల మందికి వైద్యం అందిస్తున్నాయి. రోగ చికిత్సలతోపాటు సాధారణ వైద్యం కోసం ఈ విభాగాలకు వచ్చేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. సీనియర్ స్థాయిలో తక్షణ పదోన్నతుల ద్వారా లభించే ఉద్యోగ ఉన్నతి, సీజీహెచ్‌ఎస్‌ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

2018 జూన్‌లో ప్రకటించిన నియామక నిబంధనలకు డీఏసీపీ పథకం కొత్త నిబంధనలను కలపడం ద్వారా ప్రస్తుత పదోన్నతులు సాధ్యమయ్యాయి. ఇప్పుడు పదోన్నతులు పొందినవారు చాలా ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. గత నెల 2న, ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేష్‌ కోటేచ అధ్యక్షతన జరిగిన డీసీపీలో ఈ 78 మంది పేర్లను పదోన్నతులకు ఖరారు చేశారు.

"యోగ్యతను గుర్తించి బహుమతి అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ; ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానానికి చేరడాన్ని సర్వసాధారణంగా భావించకూడదు. కష్టపడి, మంచి ప్రవర్తనతో, ఫలితాన్ని సాధించే పనితీరుతో దానిని సంపాదించాలి" అన్న కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం మార్గదర్శకాల ఆధారంగా ఈ కమిటీ పదోన్నతి అర్హతలను నిర్ధరించింది.

కొన్నేళ్లుగా, సీజీహెచ్‌ఎస్‌ ఆయుష్‌ యూనిట్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల కనిపిస్తోంది. క్లౌడ్ ఆధారిత ఆయుష్‌ ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థను (ఎ-హెచ్‌ఎంఐఎస్‌) ఈ యూనిట్లలో అమలు చేయాలన్న ప్రణాళికలు కూడా ఉన్నాయి. దీనివల్ల వీటి సమర్థత, ప్రభావం పెరుగుతుంది. ఆధునీకరణ ప్రణాళికల నేపథ్యంలో, వ్యవస్థ పనితీరును మెరుగు పరిచేందుకు హెచ్‌ఆర్‌ చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రస్తుత పదోన్నతులు కల్పించారు.

****



(Release ID: 1702853) Visitor Counter : 183