ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పథకం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
13 రంగాల లో పిఎల్ఐ స్కీము ప్రభుత్వ వచన బద్ధత ను చాటుతున్నది : ప్రధాన మంత్రి
పిఎల్ఐ స్కీము ఆ రంగం తో సంబంధం ఉన్న యావత్తు ఇకోసిస్టమ్ కు ప్రయోజనకరంగా ఉంటుంది: ప్రధాన మంత్రి
తయారీ ని ప్రోత్సహించాలంటే వేగాన్ని, రాశి ని అధికం చేయవలసి ఉంది: ప్రధాన మంత్రి
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫార్ ద వరల్డ్ : ప్రధాన మంత్రి
భారతదేశం ప్రపంచవ్యాప్తం గా ఒక పెద్ద వ్యాపార చిహ్నం గా మారింది, కొత్త గా ఏర్పడ్డ ఈ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వ్యూహాల ను రూపొందించండి: ప్రధాన మంత్రి
Posted On:
05 MAR 2021 12:19PM by PIB Hyderabad
ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (ప్రొడక్టివిటీ లింక్ డ్ ఇన్ సెంటివ్స్.. పిఎల్ఐ) పై నీతి ఆయోగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ లు ఏర్పాటు చేసిన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఈ సంవత్సరం లో కేంద్ర బడ్జెటు లో వ్యాపారానికి, పరిశ్రమ కు ఊతం అందించడం కోసం తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, గడచిన 6-7 సంవత్సరాలు గా ‘మేక్ ఇన్ ఇండియా’ ను వివిధ స్థాయిల లో ప్రోత్సహించడానికి అనేకమైనటువంటి సఫల ప్రయత్నాలు జరిగాయి అన్నారు. ఒక పెద్ద చొరవ ను తీసుకొని, తయారీ ని ప్రోత్సహించడం కోసం వేగాన్ని, ఉత్పత్తి రాశి ని అధికం చేయాలంటూ ఆయన నొక్కిచెప్పారు. ప్రపంచవ్యాప్తం గా పలు దేశాలు వాటి తయారీ సామర్ధ్యాల ను అధికం చేసుకోవడం ద్వారా అభివృద్ధి ని వేగవంతం చేసుకొన్న ఉదాహరణల ను గురించి ఆయన ప్రస్తావించారు. తయారీ సామర్ధ్యాల ను అధికం చేసుకోవడం వల్ల దేశం లో ఉద్యోగ కల్పన కూడా అదే దామాషా లో పెరుగుతుంది అని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఆలోచన విధానం స్పష్టం గా ఉందని, అదే ‘కనీస స్థాయి ప్రభుత్వం, గరిష్ఠ స్థాయి పాలన’ అని , ‘జీరో ఇఫెక్ట్, జీరో డిఫెక్ట్’ కూడా అని ప్రధాన మంత్రి తెలిపారు. పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్క స్థాయి లో ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్తూ, వ్యాపారం చేయడం లో సౌలభ్యం, నియమాల పాలన తాలూకు భారాన్ని తగ్గించడం, లాజిస్టిక్స్ వ్యయాల ను తగ్గించడానికి బహుళ విధ మౌలిక సదుపాయాల కల్పన, జిల్లా స్థాయి ఎగుమతి కేంద్రాల నిర్మాణం వంటి చర్యల ను ఆయన ప్రస్తావించారు. ప్రతి విషయం లో ప్రభుత్వం ప్రమేయం ఉంటే అది పరిష్కారాల కన్నా మరిన్ని సమస్యల ను సృష్టించడానికే దారితీస్తుందని ప్రభుత్వం నమ్ముతోందని ఆయన అన్నారు. ఈ కారణం గా స్వీయ క్రమబద్ధీకరణ, స్వీయ ధ్రువీకరణ, స్వీయ ధ్రువ పత్రాల రూపకల్పనల పై శ్రద్ధ వహించడం జరుగుతోందన్నారు. భారతదేశ కంపెనీల ను, భారతదేశం లో సాగుతున్న తయారీ ప్రక్రియల ను ప్రపంచం అంతటా పోటీ పడగలిగేటట్లుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది, అలాగే మన నిర్మాణ వ్యయానికి, ఉత్పత్తుల కు, నాణ్యత కు, దక్షతకు ప్రపంచ గుర్తింపు ను ఏర్పరచుకోవలసిన అవసరం కూడా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మనం మన సిసలైన సత్తా కు సంబంధించినటువంటి రంగాల లోకి అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడి ని ఆకర్షించుకోవలసివుంది’’ అని ఆయన అన్నారు.
ఇదివరకటి పథకాల కు, ప్రస్తుత ప్రభుత్వ పథకాల కు మధ్య ఉన్న తేడా ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఇంతకు ముందు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఓపెన్ ఎన్‌డెడ్ ఇన్‌పుట్ బేస్‌డ్ సబ్సిడీ స్ రూపం లో ఉన్నాయని, ప్రస్తుతం వాటిని నిర్ధిష్ట లక్ష్యాల తో జతపడినవిగాను, స్పర్ధాత్మక ప్రక్రియ ద్వారా ప్రదర్శన ప్రధానమైనవిగాను మార్చడం అయింది అని వివరించారు. మొట్టమొదటిసారి గా 13 రంగాల ను ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పరిధి లోకి తీసుకురావడమైందని ప్రధాన మంత్రి అన్నారు. పిఎల్ఐ ప్రయోజనాలు ఆ రంగం తో సంబంధం కలిగినటువంటి యావత్తు ఇకోసిస్టమ్ కు ప్రయోజనాల ను అందిస్తుందన్నారు. ఆటో రంగం లో, ఔషధ నిర్మాణ రంగం లో పిఎల్ఐ ప్రవేశం తో ఆటో పార్టు లు, వైద్య చికిత్స సామగ్రి, మందులకు అవసరపడే ముడిపదార్థాల విషయం లో విదేశాల పైన ఆధారపడటం చాలా వరకు తగ్గిపోతుందన్నారు. అడ్వాన్స్‌డ్ సెల్ బ్యాటరీస్, సోలర్ పివి మాడ్యూల్స్ కు తోడు స్పెశాలిటీ స్టీల్ అండదండల తో శక్తి రంగాన్ని ఆధునీకరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా, వస్త్ర రంగాని కి, ఫూడ్ ప్రోసెసింగ్ రంగాని కి పిఎల్ఐ ని ప్రకటించడం యావత్తు వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందని చెప్పారు.
భారతదేశం ప్రతిపాదించిన దరిమిలా 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం గా ఐక్య రాజ్య సమితి ప్రకటించడం ఒక గర్వకారణమైన అంశమని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. డెబ్భై కి పైగా దేశాలు భారతదేశ ప్రతిపాదన ను సమర్ధించడానికి ముందుకు వచ్చాయని, ఈ ప్రతిపాదన ను ఐక్య రాజ్య సమితి సాధారణ సభ లో ఏకగ్రీవం గా ఆమోదించడమైందని ఆయన చెప్పారు. ఇది మన రైతుల కు కూడా ఒక పెద్ద అవకాశం అని ఆయన అన్నారు. ప్రజలు జబ్బు ల బారిన పడకుండా చిరు ధాన్యాల కు, లేదా ముతక ధాన్యాల కు గల పోషణ సామర్ధ్యాన్ని చాటిచెప్పే విధం గా 2023వ సంవత్సరం లో ఒక ప్రచార ఉద్యమాన్ని ప్రపంచం అంతటా మొదలుపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం గా జరుపుకోవాలని ఐరాస ప్రకటించడం తో దేశ, విదేశాల లో చిరు ధాన్యాల కు గిరాకీ శరవేగం గా పెరగనుందని, ఇది మన రైతుల కు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని వ్యవసాయ రంగం తో పాటు ఫూడ్ ప్రోసెసింగ్ రంగం కూడా పూర్తి గా సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సంవత్సరం బడ్జెటు లో, పిఎల్ఐ స్కీము కు సంబంధించిన పథకాల కోసం దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల ను సర్దుబాటు చేయడమైందని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఉత్పత్తి లో సగటు న 5 శాతాన్ని ప్రోత్సాహకం గా ఇవ్వడమైందన్నారు. దీని అర్థం పిఎల్ఐ పథకాలు రాబోయే అయిదు సంవత్సరాల లో భారతదేశం లో 520 బిలియన్ డాలర్ విలువైన ఉత్పత్తి కి దారితీస్తాయి అంటూ ఆయన వివరించారు. పిఎల్ఐ స్కీము ను ఉద్దేశించిన రంగాల లో శ్రామికుల సంఖ్య రెండింతలు కావచ్చన్న అంచనా కూడా ఉందని ఆయన అన్నారు.
పిఎల్ఐ కు సంబంధించిన ప్రకటనలను శీఘ్ర గతి న అమలుపరచడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. పిఎల్ఐ స్కీముల ను ఇటీవల ఆమోదించిన ఐటి, హార్డ్‌వేర్, టెలికం సామగ్రి తయారీ రంగాల లో తత్ఫలితంగా ఉత్పత్తి, దేశీయం గా విలువ ను జోడించడం పెద్ద ఎత్తున జోరు అందుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఐటి, హార్డ్ వేర్ రంగం 4 సంవత్సరాల కాలం లో 3 ట్రిలియన్ రూపాయల విలువైన ఉత్పత్తి ని సాధించవచ్చని అంచనా వేయడమైంది. మరి అలాగే 5 సంవత్సరాల కాలం లో దేశీయం గా విలువ జోడింపు ప్రస్తుతం ఉన్న 5-10 శాతం నుంచి 20-25 శాతానికి పెరగవచ్చన్న అంచనా కూడా ఉంది అని ఆయన అన్నారు. అదే విధంగా టెలికం సామగ్రి తయారీ రాబోయే 5 సంవత్సరాల లో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల మేరకు పెంపుదల ను నమోదు చేయగలదన్నారు. మనం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతుల ను చేయగల స్థితికి చేరుకొంటాం అని ప్రధాన మంత్రి అన్నారు.
పిఎల్ఐ కారణం గా ఔషధ నిర్మాణ రంగం లో రాబోయే 5-6 సంవత్సరాల లో 15 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తరలి రావచ్చని, అదే జరిగినపుడు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ఫార్మా విక్రయాల తో పాటు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు ఎగుమతుల లో పెరుగుదల కూడా నమోదు కావచ్చన్నారు.
భారతదేశం ప్రస్తుతం మానవ జాతి కి సేవలు అందించే తీరు ను గమనిస్తే, ప్రపంచం అంతటా భారతదేశం ఒక పెద్ద బ్రాండు గా మారింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం విశ్వసనీయత, భారతదేశం గుర్తింపు నిరంతరం కొత్త శిఖరాల ను అందుకొంటున్నాయన్నారు. భారతదేశం బ్రాండు అదే పని గా కొత్త శిఖరాల కు చేరుకొంటోంది అని ఆయన అన్నారు. మన మందులు, మన వైద్య వృత్తి నిపుణులు, మన వైద్య సామగ్రి అంటే ప్రపంచవ్యాప్తం గా విశ్వాసం అధికం అయింది అని ఆయన అన్నారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం దీని తాలూకు ప్రయోజనాన్ని పొందడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడం కోసం కృషి చేయాలని ఔషధ నిర్మాణ రంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్ ల, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ ని ప్రోత్సహించడానికి కిందటి సంవత్సరం లో పిఎల్ఐ స్కీము ను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. కరోనా కాలం లో సైతం ఈ రంగం కిందటి ఏడాది లో 35,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులను తయారు చేసింది. ఈ రంగం లోకి దాదాపుగా 1300 కోట్ల రూపాయల మేరకు సరికొత్త పెట్టుబడి వచ్చింది. ఈ రంగం లో వేలకొద్దీ కొత్త ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి.
పిఎల్ఐ స్కీము ప్రతి రంగం లో యాంకర్ యూనిట్ లను నెలకొల్పడం ద్వారా దేశం లోని ఎమ్ఎస్ఎమ్ఇ ల ఇకోసిస్టమ్ పై ఒక ప్రధాన ప్రభావాన్ని కలుగజేయనుంది, ఆ విధంగా ఏర్పాటయ్యే యూనిట్ లకు యావత్తు వేల్యూ చైన్ లో ఒక కొత్త సరఫరా పునాది అంటూ అవసరమవుతుంది అని ప్రధాన మంత్రి వివరించారు. పిఎల్ఐ స్కీము లో చేరి, దానికి సంబంధించిన ప్రయోజనాన్ని పొందవలసిందిగా పరిశ్రమ రంగాన్ని ఆయన కోరారు. పరిశ్రమ శ్రద్ధ అంతా కూడాను దేశం కోసం, ప్రపంచం కోసం ఉత్తమమైన నాణ్యత కలిగిన వస్తువుల ను తయారు చేయడం పైనే ఉండాలి అని ఆయన అన్నారు. త్వరిత గతి న మార్పుల కు లోనవుతున్న ప్రపంచం అవసరాలకు తగినట్లుగా నూతన ఆవిష్కరణల ను తీసుకు రావాలని, పరిశోధన- అభివృద్ధి (ఆర్ & డి) ప్రక్రియల లో మన ప్రాతినిధ్యాన్ని పెంచాలని, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ ఉండాలని,మానవ శక్తి తాలూకు నైపుణ్యాల ను ఉన్నతీకరించాలని పరిశ్రమ రంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1702664)
Visitor Counter : 262
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam