నౌకారవాణా మంత్రిత్వ శాఖ

‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

స‌ముద్ర రంగాన్ని అభివృద్ధి చేయ‌డం ప‌ట్ల, అలాగే ప్ర‌పంచం లో నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రం గా ముందంజ లో ఉన్న దేశాల లో ఒక దేశం గా నిల‌వ‌డం ప‌ట్ల భార‌త‌దేశం ఎంతో ఆస‌క్తి తో ఉంది: ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశం 2030వ సంవ‌త్స‌రానిక‌ల్లా 23 జ‌ల‌మార్గాల ను ప‌ని చేయించాల‌ని ధ్యేయంగా పెట్టుకొంది: ప్ర‌ధాన మంత్రి

రేవులు, శిప్పింగ్‌, జ‌ల‌మార్గాల మంత్రిత్వ శాఖ 2.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి కి అవ‌కాశం ఉన్న 400 ప్రాజెక్టుల జాబితా ను త‌యారు చేసింది: ప్ర‌ధాన ‌మంత్రి

ఇంత‌కుముందు ఎన్న‌డూ లేని విధంగా జ‌ల మార్గాల లో ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు పెడుతోంది: ప్ర‌ధాన మంత్రి

Posted On: 02 MAR 2021 1:41PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని మంగ‌ళ‌వారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మం లో డెన్‌మార్క్ ర‌వాణా మంత్రి శ్రీ‌‌ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజ‌రాత్, ఆంధ్ర ప్ర‌దేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీ‌యుతులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, మ‌న్‌సుఖ్ మాండ‌వీయ లు కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, భార‌త‌దేశాని కి విచ్చేసి, భార‌త‌దేశ వృద్ధి యాత్ర లో ఒక భాగం కావలసిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం ప‌లికారు.  స‌ముద్ర సంబంధిత రంగం లో వృద్ధి చెందాల‌ని, ప్ర‌పంచం లో బ్లూ ఇకాన‌మి ప‌రంగా అగ్ర‌గాములు గా ఉన్న దేశాల లో ఒక దేశం గా పేరు తెచ్చుకోవాల‌ని భార‌త‌దేశం ఎంతో ఆస‌క్తి తో ఉంద‌ని ఆయ‌న అన్నారు.  ప్రాధాన్య రంగాలలో ఒకటైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగాన్ని ఉన్న‌తీక‌రించ‌డం, సంస్క‌ర‌ణ‌ల ను మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డం ద్వారా ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ను ఆవిష్క‌రించాల‌న్న దార్శనికత ను పటిష్టపర్చుకోవాల‌న్న‌ది భార‌త‌దేశం ధ్యేయం గా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

అర‌కొర చ‌ర్య‌ల పై దృష్టి ని సారించే బ‌దులు యావ‌త్తు రంగం పై శ్రద్ధ  తీసుకొంటున్నట్లు ఆయ‌న చెప్పారు.  ప్ర‌ధానమైన నౌకాశ్ర‌యాల సామ‌ర్ధ్యాన్ని 2014వ సంవ‌త్స‌రం లో 870 మిలియ‌న్ ట‌న్నులు గా ఉన్నది కాస్తా ప్ర‌స్తుతం 1550 మిలియ‌న్ ట‌న్నుల‌ కు పెంచ‌డ‌మైంద‌ని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశం లోని నౌకాశ్ర‌యాలు ప్ర‌స్తుతం నేరు గా నౌకాశ్ర‌యం లోకి ప్ర‌వేశించ‌డం, నౌకాశ్ర‌యం నుంచి నేరు గా స‌ర‌కు అప్ప‌గింత‌, స‌మాచారం సుల‌భం గా చేరేందుకు ఉన్న‌తీక‌రించిన పోర్ట్ క‌మ్యూనిటీ సిస్ట‌మ్ (పిసిఎస్‌) వంటి ఏర్పాటులు కలిగివున్నాయన్నారు.  మ‌న నౌకాశ్ర‌యాలు ఇన్ బౌండ్ కార్గో, అవు‌ట్ బౌండ్ కార్గో ల‌కు వేచి ఉండే కాలాన్ని త‌గ్గించాయ‌ని ఆయ‌న వివ‌రించారు.  వ‌ధావ‌న్‌, పారాదీప్ ల‌తో పాటు కాండ్‌లా లోని దీన్‌ద‌యాళ్ నౌకాశ్ర‌యాల ను ప్ర‌పంచ‌ శ్రేణి మౌలిక స‌దుపాయాలను క‌లిగి ఉండే మెగా పోర్టు ల వలె అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.

‘‘మా ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌న‌టువంటి విధం గా జ‌ల మార్గాల అభివృద్ధి పై పెట్టుబ‌డి పెడుతోంది.  దేశీయ జ‌ల‌మార్గాలు స‌ర‌కు ర‌వాణా కు సంబంధించినంత వ‌ర‌కు త‌క్కువ ఖ‌ర్చు తోను, ప‌ర్యావ‌ర‌ణ ప‌రం గా చూసిన‌ప్పుడు మిత్ర‌పూర్వ‌క‌మైన విధం గాను ప‌ని చేస్తాయ‌ని గ‌మ‌నించ‌డ‌మైంది.   మేము 2030వ సంవ‌త్స‌రానిక‌ల్లా 23 జ‌ల‌మార్గాల‌ లో కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ జ‌రిగేట‌ట్లు చూడాల‌ని ధ్యేయంగా పెట్టుకొన్నాం’’ అని ప్ర‌ధాన ‌మంత్రి స్ప‌ష్టం చేశారు.  భార‌త‌దేశం లో సువిశాల‌ కోస్తా తీర ప్రాంతం వెంబ‌డి 189 లైట్ హౌసులు ఉన్నాయి అని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.  ‘‘78 లైట్ హౌసుల‌ ను ఆనుకొని ఉన్న ప్రాంతం లో ప‌ర్య‌ట‌న స‌దుపాయాల ను అభివృద్ధి ప‌ర‌చేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని మేము సిద్ధం చేశాం.  ఈ కార్య‌క్ర‌మం కీల‌క ఉద్దేశ్య‌మ‌ల్లా ఇప్ప‌టికే మ‌నుగ‌డ‌ లో ఉన్న లైట్ హౌసుల‌ ను మ‌రింత అభివృద్ధి చేయ‌డంతో పాటు వాటి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ ను విశిష్ట‌మైన‌టువంటి స‌ముద్ర సంబంధిత ప‌ర్య‌ట‌న స్థలాలు గా తీర్చిదిద్ద‌నున్నాం’’ అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  కోచి, ముంబ‌యి, గుజ‌రాత్‌, గోవా వంటి కీల‌క‌ న‌గ‌రాల లో, కీలక రాష్ట్రాల లో ప‌ట్ట‌ణ జ‌ల ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల ను ప్ర‌వేశ‌పెట్టేందుకు త‌గిన చ‌ర్య‌ల ను తీసుకోవ‌డం జ‌రుగుతోంది అని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వం ఇటీవ‌ల శిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు ను పోర్ట్స్,  శిప్పింగ్ ఎండ్ వాట‌ర్ వేస్ గా మార్చి స‌ముద్ర రంగ ప‌రిధి ని విస్త‌రించింద‌ని, ఒక సంపూర్ణ‌మైన ప‌ద్ధ‌తి లో ప‌నులు జ‌రిగేట‌ట్లు చూడ‌ట‌మే దీనిలోని ప్ర‌ధాన ఉద్దేశ్య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త ప్ర‌భుత్వం దేశీయం గా నౌక‌ల నిర్మాణం పై, నౌక‌ల మ‌ర‌మ్మ‌తు బ‌జారు ల‌పై సైతం శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.  దేశీయం గా నౌకా నిర్మాణాన్ని ప్రోత్స‌హించ‌డానికి శిప్పింగ్ బిల్డింగ్ ఫైనాన్శియ‌ల్ అసిస్టెన్స్ పాలిసీ ఫార్ ఇండియ‌న్ శిప్ యార్డ్స్ కు ఆమోదాన్ని ఇవ్వ‌డ‌మైంద‌ని ఆయ‌న తెలిపారు.

పెట్టుబ‌డి పెట్ట‌డానికి అనువైన 400 ప్రాజెక్టుల జాబితా ను పోర్ట్స్ శిప్పింగ్ ఎండ్ వాట‌ర్‌వేస్ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  ఈ ప్రాజెక్టుల‌ కు 31 బిలియ‌న్ డాల‌ర్లు లేదా 2.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి కి అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.  మేరిటైమ్ ఇండియా విజ‌న్ 2030 ని గురించి ప్ర‌ధాన మంత్రి చెప్తూ, ఇది ప్ర‌భుత్వ ప్రాధాన్యాల ను తెలియ‌జేస్తుంద‌న్నారు.  

మంగ‌ళ‌వారం నాడు ‘ద సాగ‌ర్-మంథ‌న్:  మర్కెంటైల్ మ‌రీన్ డ‌మేన్ అవేర్‌నెస్ సెంట‌ర్’ ను కూడా ప్రారంభించ‌డం జ‌రిగింది.  ఇది స‌ముద్ర సంబంధిత భ‌ద్ర‌త‌, వెతుకులాట‌, స‌హాయ‌క సామ‌ర్ధ్యాలు, ర‌క్ష‌ణ‌, స‌ముద్ర ప‌ర్యావరణ ప‌రిర‌క్ష‌ణ ల‌కు ఉద్దేశించిన ఒక స‌మాచార వ్య‌వ‌స్థ‌.

అభివృద్ధి ప్ర‌క్రియ‌ లో నౌకాశ్ర‌యాల ది ప్ర‌ధాన పాత్ర అన్న సంగతి ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ‘సాగ‌ర్ మాల’ ప్రాజెక్టు ను 2016వ సంవ‌త్స‌రం లో ప్ర‌క‌టించింది.  ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా 574కు పైగా ప్రాజెక్టు లను 82 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్లు లేదా 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల తో 2015 మొద‌లుకొని 2035వ సంవ‌త్స‌రం లోప‌ల అమ‌లు చేయాల‌ని గుర్తించ‌డ‌మైంది.  రెండు కోస్తా తీరాల వెంబ‌డి 2022వ సంవ‌త్స‌రానిక‌ల్లా నౌక‌ల మ‌ర‌మ్మ‌తు క్ల‌స్ట‌ర్ స్ ను అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతుంది.  ‘చెత్త నుంచి సంప‌ద’ ను సృష్టించ‌డానికి గాను దేశీయ శిప్ రీసైకిలింగ్ ఇండ‌స్ట్రీ ని కూడా ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంది.  భార‌త‌దేశం రీసైకిలింగ్ ఆఫ్ శిప్స్ యాక్ట్‌, 2019 కి శాస‌న రూపాన్ని ఇచ్చి, హాంగ్ కాంగ్ ఇంట‌ర్ నేశ‌న‌ల్ క‌న్వెన్శ‌న్ కు స‌మ్మ‌తి ని తెలిపింది.

మ‌న అత్యుత్త‌మ అభ్యాసాల‌ ను ప్ర‌పంచ దేశాల కు వెల్ల‌డి చేయ‌డంతో పాటు ప్ర‌పంచ‌ స్థాయి లో ఉత్త‌మ‌మైన అభ్యాసాల నుంచి నేర్చుకోవ‌డానికి కూడా సిద్ధ‌ప‌డాలి అనే అభిలాష ‌ను ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.  బిఐఎమ్ఎస్ టిఇసి స‌భ్య‌త్వ దేశాల తో ఐఒఆర్ స‌భ్య‌త్వ దేశాల‌ తో వ్యాపార‌ ప‌ర‌మైన‌, ఆర్థిక ప‌ర‌మైన సంబంధాల ను క‌లిగివుండ‌టం పై భార‌త‌దేశం శ్ర‌ద్ధ తీసుకొంటూనే ఉంటుంద‌ని, 2026వ సంవ‌త్స‌రానిక‌ల్లా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పై పెట్టుబ‌డి ని పెంచుకోవ‌డంతో పాటు ప‌ర‌స్ప‌ర ఒప్పందాల‌ కు మాత్ర‌మే సుగ‌మం చేసుకోవాల‌ని కూడా సంక‌ల్పిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

దీవుల‌ లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తో పాటు, అక్క‌డి ఇకోసిస్ట‌మ్ ను సంపూర్ణం గా అభివృద్ధి ప‌ర‌చే ప్ర‌క్రియ ను ప్ర‌భుత్వం మొద‌లుపెట్టింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  స‌ముద్ర రంగం లో న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వం ఆస‌క్తి తో ఉంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.  దేశం లో అన్ని పెద్ద నౌకాశ్ర‌యాల వ‌ద్ద సౌర విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తు ఆధారిత వ్య‌వ‌స్థ‌ల ను నెల‌కొల్పే ప‌ని లో ప్ర‌భుత్వం నిమ‌గ్నం అయింద‌ని, భార‌త‌దేశ నౌకాశ్ర‌యాల లో మూడు ద‌శ‌ల లో 2030వ సంవ‌త్స‌రానిక‌ల్లా మొత్తం శ‌క్తి లో 60 శాతానికి పైగా న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ని వినియోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం ధ్యేయం గా పెట్టుకొంద‌ని ఆయ‌న అన్నారు.

‘‘భార‌త‌దేశం లోని సుదీర్ఘ‌మైన కోస్తా తీర ప్రాంతం మీ కోసం వేచి ఉంది.  భార‌త‌దేశం లోని క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ప్ర‌జ‌లు మీ కోసం నిరీక్షిస్తున్నారు.  మా నౌకాశ్ర‌యాల లో పెట్టుబ‌డి పెట్టండి.  మా ప్ర‌జ‌ల‌ పై పెట్టుబ‌డి పెట్టండి.  భార‌త‌దేశాన్ని మీ అభిమాన‌ పాత్రమైన వ్యాపార గ‌మ్య‌స్థానం కానివ్వండి.  మీ వ్యాపారాని కి, వాణిజ్యాని కి భార‌త‌దేశ నౌకాశ్ర‌యాలు అండ‌దండ‌లను అందించ‌నివ్వండి’’ అంటూ ప్ర‌పంచ ఇన్వెస్ట‌ర్ లకు సూచిస్తూ ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.
 

***(Release ID: 1701974) Visitor Counter : 151