ఆర్థిక మంత్రిత్వ శాఖ
జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్
Posted On:
26 FEB 2021 7:55PM by PIB Hyderabad
వర్చువల్ పద్ధతిలో సాగిన, జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) తొలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పాల్గొన్నారు. ఇటలీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమాజంలో సమాన మార్పులు, పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన విధాన చర్యలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక దృక్పథం, ఆర్థిక రంగ సమస్యలు, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు.
కొవిడ్‌కు విరుగుడుగా భారత్ తీసుకొచ్చిన విధానాల గురించి ఈ సమావేశంలో శ్రీమతి సీతారామన్ వివరించారు. రుణ భరోసా, ప్రత్యక్ష నగదు బదిలీ, ఆహార భద్రత, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, నిర్మాణాత్మక సంస్కరణల వేగవంతం వంటి చర్యల ద్వారా ప్రజల అభివృద్ధికి దోహదపడేలా భారత ప్రభుత్వ విధానాలు ఆధారపడి ఉంటాయని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ టీకాల కార్యక్రమం గురించి కూడా శ్రీమతి సీతారామన్ చెప్పారు. అనేక దేశాలకు టీకాలను అందిస్తున్నట్లు జీ20 దేశాలకు వెల్లడించారు.
ప్రపంచాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి సవాలుగా మారిన వాతావరణ మార్పుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పన్నులపై క్రమబద్ధమైన విధాన చర్చలు జరగాలన్న అధ్యక్ష దేశ ప్రతిపాదనపై భారత ఆర్థిక మంత్రి స్పందించారు. ఆ చర్చలు పారిస్ ఒప్పంద లక్ష్యానికి లోబడి ఉండాలన్నారు. సంయుక్తంగా ఉండే విభిన్న బాధ్యత, సంబంధిత సామర్ధ్యం, నిబద్ధతల స్వచ్ఛంద స్వభావ సూత్రాలపై ఆధారపడి చర్చలు జరగాలన్నారు. హరిత సాంకేతికతల బదలాయింపు, పర్యావరణ ఆర్థికత ప్రాధాన్యత గురించి కూడా శ్రీమతి సీతారామన్ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు.
***
(Release ID: 1701256)
Visitor Counter : 145