ఉక్కు మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ సాధనలో లోహాలకు, గనుల తవ్వకానికి ప్రముఖ పాత్ర
తయారీ రంగంలో నూతన వాతావరణం రూపకల్పనకు
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు
Posted On:
24 FEB 2021 2:43PM by PIB Hyderabad
దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్.గా స్వావలంబనతో తీర్చిదిద్దడంలో లోహాలు, గనుల తవ్వకం రంగం ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ రోజు 58వ జాతీయ లోహ శోధనా శాస్త్ర దినోత్సవం సందర్భంగా, భారతీయ లోహశాస్త్ర అధ్యయన సంస్థ (ఐ.ఐ.ఎం.) 74వ వార్షిక సాంకేతిక సదస్సులో కేంద్రమంత్రి మాట్లాడుతూ, లోహాలు గనుల తవ్వకం అనేది శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న రంగమని అన్నారు. విస్తృతంగా అభివృద్ధి చెందే సామర్థ్యం ఈ రంగానికి ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థనే ఇది ప్రభావితం చేయగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశం ఒంటరిగా మారడం కాదని, గొప్ప, శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం ఆత్మనిర్భరత నినాద లక్ష్యమని ప్రధాన్ అన్నారు. దేశం అవసరాలను తీర్చడమే కాక, ప్రపంచ సమాజం అంచనాలకు తగినట్టుగా, వసుధైక కుటుంబకం కోసం సిససైన స్ఫూర్తితో పనిచేయడమే ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయమని అన్నారు. భారతీయ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సంపదను సృష్టించేవారి ప్రాముఖ్యతను గురించి వివరించారన్నారు. "మన సమాజం మెరుగుదలకోసం, దేశంకోసం పారిశ్రామిక రంగం, ప్రభుత్వం, విద్యాసంస్థలు మన సమాజం కలసికట్టుగా పనిచేసిన పక్షంలో, మనం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలం." అని కేంద్రమంత్రి అన్నారు.
ప్రత్యేకరకమైన ఉక్కుకోసం ఉత్పాదకతతో ముడివడిన పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని, స్వదేశీ ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ రంగంలో తీసుకువచ్చిన అతి ముఖ్యమైన సంస్కరణ ఇదేనని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాన్ని పారిశ్రామిక రంగం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో కొత్త తరహా తయారీరంగం రూపకల్పనకు మరింత కృషి జరగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఖనిజ నిక్షేపాల విషయంలో మన దేశం ఎంతో సుసంపన్నమైనదని, దేశ సహజవనరులు దేశ పౌరులకే చెందుతాయని ప్రభుత్వం స్పష్టంగా అభిప్రాయపడుతోందని ఆయన అన్నారు. “సహజవనరుల కేటాయింపు విషయంలో పారదర్శకమైన, జవాబ్దారీతనంతో కూడిన యంత్రాంగాన్ని మేం చేపట్టాం” అన్నారు. కోవిడ్-19 వ్యాప్తితో తలెత్తిన సంక్షోభంనుంచి మనం ఇపుడిపుడే బయటపడుతున్నామని, క్రమ క్రమంగా మంచిరోజులవైపుగా పురోగమిస్తున్నామని ఆయన అన్నారు. సమష్టి కృషితో దేశం ఏమి చేయగలదో నిగ్గు తేల్చుకునేందుకు గత సంవత్సర కాలం మనదేశానికి ఓ పరీక్షా సమయమని, ఒకవైపు వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధిస్తూనే, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేసిందని, ఇదే సందర్భంలోనే స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ప్రధానమంత్రి పిలుపునిచ్చారని కేంద్రమంత్రి ప్రధాన్ అన్నారు.
2021వ సంవత్సరపు బడ్జెట్ ప్రగతి స్ఫోరకమైని, అభివృద్ధి కారకమైనదని, భావికాలంకోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా బడ్దెట్ తన దృష్టిని కేంద్రీకరించిందని ప్రధాన్ అన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం కారణంగా ఉక్కుకు తప్పకుండా గిరాకీ పెరుగుతుందని, రైల్వేలు, రహదారులు, పెట్రోలియం, సహజవాయువు వంటి మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. దీనితో లోహాలకు విపరీతమైన గిరాకీ పెరుగుతుందని ఆయన అన్నారు.
అధునాతన ఉక్కు రంగం, మిశ్రమలోహాలు, ఇతర సంబంధిత రంగాల్లో మేధో హక్కులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతో ఉందని, అప్పుడే కీలకమైన అవసరాలు స్వదేశీ తయారీ ద్వారానే తీరుతాయని, ఎగుమతి రంగం కూడా విస్తరిస్తుందని అన్నారు. మేధో హక్కులు, సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనలో పరిశోధనా, అభివృద్ధి విభాగాలు, విద్యా సంస్థల పాత్ర కీలకమైనదని అన్నారు. “లోహ శోధనకు సంబంధించిన ఇంజినీరింగ్ అధ్యయనానికి, ఉక్కు రంగంకోసం మానవ వనరుల కల్పనకు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా మేం ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతిష్టాత్మకమైన ఐ.ఐ.టి.లలో ఇందుకోసం ప్రతిభా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. ఇనుము, ఉక్కు రంగంలో జాతీయ ప్రాముఖ్యం కలిగిన పరిశోధనను ప్రోత్సహించేందుకు భారతీయ ఉక్కు పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన పథకాన్ని ఏర్పాటు చేశాం.” అని ఆయన అన్నారు.
భారతీయ లోహశాస్త్ర అధ్యయన సంస్థ (ఐ.ఐ.ఎం.) ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవం సందర్భంగా కేంద్రమంత్రి ఆ సంస్థకు అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడో 1946లో స్వాతంత్య్రానికి ముందే ఏర్పాటైన ఒక అధ్యయన సంస్థ ఇప్పటికీ చక్కగా పురోగమిస్తూ, దేశాభివృద్ధికోసం కావలసిన సేవలందించడం ప్రశంసనీయమని అన్నారు. పారిశ్రామిక రంగం, విద్యాసంస్థలు, పరిశోధనా అభివృద్ధి రంగాల మధ్య సహకారాన్ని, భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా లోహశోధన అధ్యయనంలో ఈ సంస్థ ఎంతో కీలకపాత్ర పోషించిందని, జాతి నిర్మాణంకోసం విస్తృత స్థాయిలో కృషిచేసిందని ప్రధాన్ అన్నారు. ఉక్కు రంగానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాన్ని రూపొందించడంలో, సృజనాత్మకతలో, నైపుణ్యం కలిగిన మానవవనరుల తయారీలో కూడా ఈ సంస్థ కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యంగా స్వదేశీ తయారీ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రస్తుత వ్యూహాన్ని మరింత విస్తృతం చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు.
******
(Release ID: 1700447)
Visitor Counter : 123