ఆర్థిక మంత్రిత్వ శాఖ
నాగాలాండ్ లో విద్యా ప్రమాణాల మెరుగుదల ప్రాజెక్ట్ పై సంతకాలు చేసిన భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్
Posted On:
23 FEB 2021 11:30AM by PIB Hyderabad
నాగాలాండ్ లో ఎంపిక చేసిన పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాలు బోధనా ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందిన ప్రాజెక్ట్ అమలుకు 68 మిలియన్ అమెరికా డాలర్ల రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకులు ఈ రోజు సంతకాలు చేశాయి.
బోధనా పద్దతులను మెరుగుపరచడానికి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి, ఆన్ లైన్ విధాన పద్దతిలో విద్యను నేర్చుకోవడానికి, విద్యా బోధన అవకాశాలను కల్పించడంతో పాటు పథకాలు విధానాలు, కోవిడ్-19 లాంటి సవాళ్ళను ఎదుర్కొనే అంశంపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో “నాగాలాండ్: విద్యా బోధన, వనరుల మెరుగుదల ప్రాజెక్టు" కు రూపకల్పన చేశారు. రాష్ట్రవ్యాపితంగా అమలు చేయనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో 150,000 మంది విద్యార్థులు, 20,000 ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుంది.
అభివృద్ధి వ్యూహంలో మానవ వనరుల అభివృద్ధి కీలకంగా ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం ఈ దశలో చర్యలను అమలు చేస్తూ విద్యారంగంలో సమూల మార్పులను తీసుకుని రావడానికి చర్యలను అమలు చేస్తున్నాడని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆర్ధిక వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ. సి.ఎస్.మహాపాత్ర అన్నారు. విద్యాపరంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ సహకరించి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన వివరించారు.
ఒప్పదంపై భారత ప్రభుత్వం తరఫున శ్రీ మహాపాత్ర, నాగాలాండ్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య డైరెక్టర్ శ్రీ. శానవాస్ సి, ప్రపంచబ్యాంక్ తరఫున బ్యాంక్ భారత దేశ డైరెక్టర్ శ్రీ జునైద్ అహ్మద్ సంతకాలు చేశారు.
ప్రస్తుతం నాగాలాండ్ విద్యారంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నది. మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు, బోధనలో నైపుణ్యాలను మెరుగుపరచుకునే అంశంలో ఉపాద్యాయులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు విద్యావ్యవస్థలో సామాజిక భాగస్వామ్యం కొరవడింది. కోవిడ్-19 తో ఈ సమస్యలు మరింత జటిలం కావడంతో విద్యావ్యవస్థ ఒత్తిడికి గురై గాడి తప్పింది.
భారతదేశంలో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా మెరుగుపడిందని శ్రీ. శానవాస్ సి తెలిపారు. భవిష్యత్ అవసరాలు, ఉపాధిరంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రమాణాలను మెరుగుపరచవలసి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్నిమెరుగుపరచడానికి నాగాలాండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి ఈ ప్రాజెక్ట్ అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు.
నాగాలాండ్ లో విద్యారంగ నిర్వహణ సమాచార వ్యవస్థను ( ఈఎంఐఎస్) బలోపేతం చేయడం వల్ల విద్యా వనరులు మరింత ఎక్కువగా అందుబాటులోకి రాడానికి, ఉపాధ్యాయులు విద్యా యాజమాన్యాల పనితీరు సమీక్షకు అవకాశం కలిగి విద్యారంగాన్ని మరింత సమర్ధంగా నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది.
విద్యారంగ ప్రక్షాళన, విద్యా రంగాన్ని పటిష్టం చేయడానికి నాగాలాండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు మరింత సమర్ధంగా అమలు కావడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని విద్యా నిపుణుడు, ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రపంచ బ్యాంక్ నియమించిన బృంద నాయకుడు శ్రీ కుమార్ వివేక్ అన్నారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని బోధనా విధానాలను ఆధునిక విధానాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును రూపొందించామని వివరించారు.
ప్రాజెక్టులో భాగంగా నాగాలాండ్ లో వున్న 44 హయ్యర్ సెకండరీ పాఠశాలలను అన్ని సౌకర్యాలతో బోధనకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు.
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్ స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్ (ఐబిఆర్డి) మంజూరు చేసిన 68 మిలియన్ అమెరికా డాలర్ల రుణ కాలపరిమితి అయిదు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ తో సహా 14.5సంవత్సరాలుగా ఉంటుంది.
***
(Release ID: 1700165)
Visitor Counter : 151