ప్రధాన మంత్రి కార్యాలయం

రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల ప్రభావవంతమైన అమలు అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 22 FEB 2021 2:47PM by PIB Hyderabad

అందరికీ నమస్కారం,

బడ్జెట్ అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ రంగాల వారితో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ.. బడ్జెట్‌ కేటాయింపులను వీలైనంత త్వరగా ఎలా అమలుచేయబోతున్నది, ఏ విధంగా ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని తీసుకోనుంది, పరస్పర సమన్వయంతో బడ్జెట్ అమలుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై చర్చలు జరుపుతున్న సంగతి మీకు తెలిసిందే. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వెబినార్‌లో పాల్గొంటున్న భాగస్వామ్యపక్షాలను కలవడం చాలా సంతోషంగా ఉంది. నా తరఫున మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
రక్షణ రంగంలో భారతదేశం ఏవిధంగా ఆత్మనిర్భరతను సాధించే అంశం నాకు చాలా కీలమైనది. బడ్జెట్ అనంతరం రక్షణ రంగంలో పెరిగిన కొత్త అవకాశాలేంటి? మనముందున్న కొత్త దిశ ఏమిటి? ఈ రెండు అంశాల్లో విషయాలను తెలుసుకోవడం, చర్చించడం చాలా అవసరం. మన శూరులు, వీరులైన సైనికులు శిక్షణ పొందే చోట ‘శాంతి సమయంలో చిందించే స్వేదం, యుద్ధకాలంలో రక్తం ఏరులై పారకుండా కాపాడుతుంది’ అని రాసి ఉంటుంది. అంటే శాంతికి పూర్వరంగ లక్షణం వీరత్వం, వీరత్వానికి పూర్వరంగ లక్షణం సామర్థ్యం, సామర్థ్యానికి పూర్వరంగ లక్షణం ముందుగానే అన్ని రకాలుగా సంసిద్థతతో ఉండటం. ఆ తర్వాతే మిగిలిన అంశాలు వస్తాయి. ‘బలంతో కూడిన దర్పం ఉన్నప్పడే సహనశీలత, క్షమ, దయాగుణం వంటి వాటికి సరైన గౌరవం ఉంటుంది’ అని మన శాస్త్రాల్లో చెప్పారు.
మిత్రులారా,
ఆయుధాలు, మిలటరీ సామాగ్రిని రూపొందించడంలో భారత్‌కు వేల సంవత్సరాల అనుభవం ఉంది. స్వాతంత్ర్యానికి ముందు మన వద్ద వేల సంఖ్యలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఆయుధ కర్మాగారాలు) ఉండేవి. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ భారతదేశంలోనే భారీగా ఆయుధాలను రూపొందించి పంపిచేవారు. కానీ స్వాతంత్ర్యానంతరం ఆ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో వెనుకబడ్డాం. ఈ రంగంలో ఎంతమేర కృషి జరగాల్సి ఉందో అంతగా జరగలేదు. దీని ఫలితంగా చిన్నపాటి ఆయుధాల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటిగా ఉంది. ఇది మనం గర్వించాల్సిన విషయమేమీ కాదు. భారత ప్రజల్లో నైపుణ్యం, కుశలత లేదని దీని అర్థం కాదు.
మీరే చూడండి, కరోనా ప్రారంభంలో భారతదేశంలో ఒక్క వెంటిలేటర్ కూడా తయారుకాలేదు. నేడు భారతదేశ వేల సంఖ్యలో వెంటిలేటర్లు రూపొందిస్తోంది. అంగారకుడిపైకి వెళ్లే సామర్థ్యం ఉన్న భారతదేశానికి ఆధునిక ఆయుధాలను రూపొందించే సత్తా కూడా ఉంది. కానీ బయటనుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం చాలా సులభం అయిపోయింది. సరళంగా, తక్కువ ధరకే దొరుకుతున్న వస్తువువైపు దృష్టిసారించడం మానవనైజం. మీరు ఇంటికెళ్లాక ఓసారి గమనిస్తే.. తెలిసో, తెలియకో ఎన్ని విదేశీ వస్తువులను సంవత్సరాలుగా వినియోగిస్తున్నామో అర్థమవుతుంది. రక్షణ రంగంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ ఈ పరిస్థితిని మార్చేందుక భారతదేశం కష్టించి పనిచేస్తోంది.
ప్రస్తుత భారతం శక్తిసామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా నిమగ్నమై ఉంది. మన ఫైటర్ జెట్ తేజస్‌ను ఫైళ్లకే పరిమితం చేసిన సమయం చూశాం. కానీ మా ప్రభుత్వం మన ఇంజనీయర్లు, శాస్త్రవేత్తలతోపాటు మన తేజస్ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాం.  ఈ దిశగా పని ప్రారంభించాం. ఇప్పుడు తేజస్ గర్వంగా గగనవీధుల్లో విహారం చేస్తోంది. కొన్ని వారాల క్రితమే తేజస్ కోసం రూ.48వేల కోట్ల ఆర్డర్ ఇచ్చాం. ఇందులో ఎన్ని ఎమ్ఎస్ఎమ్ఈ సంస్థలు ఈ మిషన్‌లో భాగస్వాములవుతాయో? ఎంత పెద్ద వ్యవహారమో మీరే అర్థం చేసుకోండి. మన సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం కూడా దీర్ఘకాలంగా ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ నేడు మన సైనికులకోసం మన దేశంలోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించి, వినియోగించడంతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం.
మిత్రులారా,
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టిచడం ద్వారా ఆయుధాల సేకరణ, వాటిని పరీక్షించడం, ధ్రువీకరించుకోవడం, వాటిని సైన్యానికి అప్పగించడంతోపాటు ఇతర సేవల ప్రక్రియలో ఏకరూపత తీసుకురావడం మరింత సులభతరం అయింది. భద్రత బలగాల్లోని అన్ని విభాగాలతోపాటు తొలిసారి రక్షణ రంగంలో ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యాన్ని పెంచడంపై మరింత దృష్టిని కేంద్రీకరించాం. ప్రైవేటు సెక్టార్ ను ముందుకు తీసుకురావడం, వారు పనిచేసే పరిస్థితులను మరింత సరళీకరించడం, వారి సులభరత వాణిజ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మిత్రులారా,
రక్షణ రంగంలో వస్తున్న ప్రైవేటు భాగస్వామ్యానికున్న ఓ సమస్యను కూడా అర్థం చేసుకోగలను. ఆర్థిక వ్యవస్థలోని భిన్న రంగాలతో పోలిస్తే రక్షణ రంగంపై ప్రభుత్వ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఒక్కటే కొనుగోలుదారుగా ఉండటంతోపాటు ప్రభుత్వం కూడా తయారీదారుగా ఉంది. దీంతోపాటు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎగుమతి చేయడం సాధ్యం కాదు. ఈ రంగం జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నందున ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం స్వాభావికమే. కానీ ప్రైవేటు రంగం సహకారం లేకుండా 21వ శతాబ్దంలో రక్షణ రంగతయారీ అనుకూల వ్యవస్థను నిర్మించడం సాధ్యం కాదు. ఈ విషయం కూడా నాకు చాలా బాగా తెలుసు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే 2014 తర్వాత పారదర్శకత, భవిష్యత్తును చూసే దృష్టికోణం, వ్యాపారానుకూలతను పెంచేందుకు నిరంతరం సంస్కరణలు తీసుకొస్తున్న విషయం కూడా మీకు తెలిసిందే. డీ-లైసెన్సింగ్, డీ-రెగ్యులేషన్, ఎగుమతుల ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడుల స్వేచ్ఛ వంటి ఎన్నో సంస్కరణలను తీసుకొస్తున్నాం. ఈ విషయంలో మేం చేస్తున్న ప్రయత్నాలకు, తీసుకుంటున్న నిర్ణయాలకు.. భద్రతాబలగాల నాయకత్వం నుంచి అందరికంటే ఎక్కువ మద్దతు లభిస్తోంది. వారు మేం చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు.
మిత్రులారా,
భద్రతాబలగాల గణవేష (యూనిఫామ్)ను ధరిచించిన వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకసారి గణవేష ధరిస్తే అది వారికి జీవన్మరణ సమస్యే అయినా.. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ దేశాన్ని రక్షించే వ్యక్తి ఆత్మనిర్భర భారతం కోసం భద్రతాబలగాలు ముందుకు రావడం సానుకూలమైన, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మార్పును మీరు కూడా గమనించే ఉంటారు. భారతదేశం 100 మహత్వపూర్ణమైన రక్షణ రంగ అనుబంధిత వస్తువుల జాబితాను రూపొందించిన విషయం కూడా మీకు తెలుసు. ఈ నెగటివ్ లిస్టులోని ఆయుధాలు, అనుబంధిత వస్తువులను మన స్థానిక పరిశ్రమల సహాయంతోనే రూపొందించవచ్చు. ఈ దిశగా మన స్థానిక పరిశ్రమలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగానే టైమ్ లైన్‌ను నిర్దేశించడం జరిగింది.
ప్రభుత్వ భాషలో నెగటివ్ లిస్టే కానీ.. ప్రప్రంచం నెగటివ్ లిస్ట్ గా పేర్కొనే దీన్ని నేను వేరుగా చూస్తాను. ఆత్మనిర్భరత సాధించేందుకు నా దృష్టిలో ఇది పాజిటివ్ లిస్ట్ మాత్రమే. ఈ లిస్టు ఆధారంగానే మన స్వదేశీ తయారీ సామర్థ్యం పెరగనుంది. ఈ లిస్టే భారతదేశంలో ఉపాధికల్పనకు మరింత బలాన్నిస్తుంది. ఈ లిస్టే.. రక్షణ రంగ అవసరాలకోసం విదేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ లిస్టే.. మన దేశంలో తయారైన ఉత్పత్తులను మన దేశంలోనే విక్రయించే భరోసాను ఇస్తుంది. ఈ వస్తువులు మన అవసరాలకు అనుగుణంగా, మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, మన ప్రజల స్వభావానికి అనుగుణంగా.. నిరంతరం అన్వేషణ చేస్తూ ఎప్పటికప్పుడు సరైన మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తాయి.
మన సైన్యమైనా, మన ఆర్థిక భవిష్యత్తు అయినా.. మాకు ఓ రకంగా పాజిటివ్ లిస్టు వంటివే. మీకోసం మరింత పాజిటివ్ లిస్ట్ కూడా ఇదే. రక్షణ రంగంతో అనుసంధానమైన ప్రతి వస్తువు డిజైనింగ్ అయినా, రూపకల్పన అయినా దేశంలోని ఏ ప్రైవేటు కంపెనీలో తయారయినా.. దానికి ప్రాధాన్యత కల్పిస్తాం. బయటనుంచి తెచ్చుకునే విధానాన్ని పూర్తిగా పక్కనపెడతామని ఈ సమావేశం సందర్భంగా మీ అందరికీ నా వంతుగా భరోసా కల్పిస్తున్నాను. రక్షణ రంగ మూలనిధి బడ్జెట్‌లో స్వదేశీ సేకరణ కోసం ప్రత్యేకంగా నిధిని కేటాయించిన విషయం మీకు తెలిసిందే. ఇది కూడా మా సరికొత్త నిర్ణయం. ఇక్కడే తయారీతోపాటు డిజైనింగ్, అభివృద్ధి చేయడం వంటివి విషయాల్లోనూ ముందడుగేయాలని ప్రైవేటు రంగాన్ని కోరుతున్నాను. ప్రపంచ యవనికపై భారతదేశ పతాకాన్ని రెపరెపలాడిద్దాం. ఇదొక సువర్ణావకాశం. దీన్ని వదులుకోవద్దు. స్వదేశీ డిజైనింగ్, అభివృద్ధి విషయంలో డీఆర్డీవో అనుభవాన్ని ప్రైవేటు రంగం తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సంస్కరణలు తీసుకొచ్చేందుకు డీఆర్డీవో కృషిచేస్తోంది. ఇకపై ప్రాజెక్టుల ప్రారంభంలోనే ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది.
మిత్రులారా,
ప్రపంచంలోని చాలా చిన్న చిన్న దేశాలు గతంలో ఎప్పుడు కూడా తమ భద్రత గురించి ఇంతగా ఆందోళన చెందేవి కావు. కానీ మారుతున్న ప్రాపంచిక పరిస్థితుల కారణంగా, ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల కారణంగా ఈ దేశాలు ఆలోచనలో పడ్డాయి. దేశ రక్షణ ఆయాదేశాలకు ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఈ ప్రయత్నంలో తమ అవసరాలకోసం భారత్ వైపు ఆ దేశాలు చూడటం స్వాభావికమే. ఎందుకంటే మన వద్ద తక్కువ ఖర్చుతో తయారీచేసే సామర్థ్యం ఉంది. అదే సమయంలో నాణ్యత విషయంలోనూ రాజీ ఉండదు. ఈ దేశాలకు సహాయం అందించడంలో భారతదేశం కీలక భూమిక పోషించాల్సిన అవసరముంది. విస్తరిస్తున్న భారత రక్షణ రంగం కూడా ఈ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరముంది. ఇదొక గొప్ప అవకాశం కూడా. ఇవాళ భారతదేశం 40కి పైగా దేశాలకు రక్షణకు సంబంధించిన వస్తువులను ఎగుమతి చేస్తోంది. దిగుమతులపైనే ఆధారపడే దేశం.. ఇప్పుడు ‘డిఫెన్స్ ఎక్స్‌పోర్టర్‌’గా కూడా తన గుర్తింపును చాటుకుంటోంది. మీతో కలిసి ఈ గుర్తింపును మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుంటుంది.
ఆరోగ్యకరమైన రక్షణరంగ తయారీ వ్యవస్థలో పెద్ద పెద్ద పరిశ్రమలు, సంస్థలతోపాటు చిన్న, మధ్యతరగతి తయారీ యూనిట్ల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన స్టార్టప్ కంపెనీలు కూడా సృజనాత్మకంగా ముందుకెళ్తున్నాయి. మన రక్షణ ఉత్పత్తుల తయారీని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఈ వ్యవస్థను తయారీ రంగానికి వెన్నుముక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి ఎక్కువ మేలు జరుగుతోంది. వాటిని మరింత విస్తరించేందుకు అవసరమైన ప్రోత్సాహం లభిస్తోంది.
ఎమ్ఎస్ఎమ్ఈలు పెద్ద తయారీ పరిశ్రమలకు సహకారాన్ని అందిస్తాయి. అవి మొత్తం వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ సరికొత్త ఆలోచన, సరికొత్త విధానం మన దేశ యువతకోసం కూడా చాలా కీలకం. iDEX వేదిక.. మన స్టార్టప్ కంపనీలు, మన యువ పారిశ్రామికవేత్తలకు ఈ దిశగా ప్రోత్సాహం అందిస్తోంది. దేశంలో నిర్మిస్తున్న రక్షణరంగ కారిడార్ల కారణంగా స్థానిక కార్మికులు, స్థానిక తయారీరంగానికి లబ్ధిచేకూరుస్తుంది. అంటే.. మన రక్షణ రంగంలో ఆత్మనిర్భరత ‘జవాన్ భీ, నౌజవాన్ భీ’ (జవాన్లకు, యువతకు) సశక్తీకరణ చేసే శక్తిగా చూడాల్సిన అవసరముంది.
మిత్రులారా,
ఒకప్పుడు దేశ రక్షణ అంటే భూ, జల, వాయు మార్గాలకు సంబంధించినదిగానే ఉండేది. కానీ ఇప్పుడు జీవనగమనంలోని ప్రతి రంగంలోనూ రక్షణ అవసరం కనిపిస్తోంది. దీనికి కారణం ఉగ్రవాదం ముఖ్యమైన కారణం. సైబర్ దాడుల కారణంగా రక్షణకు సంబంధించిన నియమాలన్నీ మారిపోయాయి. ఒకానొక సమయంలో దేశ రక్షణ కోసం భారీ ఆయుధాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు ఒక చిన్న గదిలో కంప్యూటర్ పెట్టుకుని దేశ రక్షణను నిర్దేశించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన సంప్రదాయ ఆయుధాలతోపాటు 21వశతాబ్దలపు సాంకేతికత ఆధారిత అవసరాలను చూస్తూ.. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి పెట్టేందుకు కూడా ఇది సరైన సమయం.
దీనికి తగ్గట్లుగా మన ఉన్నతవిద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు.. విద్యాప్రపంచంలో రక్షణ రంగానికి, రక్షణ నైపుణ్యానికి సంబంధించిన కోర్సులపై నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టికేంద్రీకరించాల్సిన అవసరం చాలా ఉంది. పరిశోధన, సృజనాత్మకతపైనే ఎక్కువ దృష్టిపెట్టాలి. ఈ కోర్సులను భారతదేశ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయాల్సిన అవసరముంది. సంప్రదాయ రక్షణ కోసం గణవేషలో ఉండే సైనికులు ఉన్నట్లే.. విద్యాప్రపంచంలోని పరిశోధకులు, రక్షణ రంగ నిపుణులు, సాంకేతిక నిపుణుల అవసరం కూడా చాలా ఉంది. ఈ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఈ దిశగా ఆలోచిస్తారనే విశ్వాసం నాకుంది.
మిత్రులారా,
నేటి ఈ చర్చకు అనుగుణంగా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పక్కా కార్యాచరణ ప్రణాళికను, రోడ్ మ్యాప్‌ను వీలైనంత త్వరగా రూపొందించాలని.. రక్షణ మంత్రిత్వ శాఖతోపాటు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో అమలయ్యేలా ప్రణాళికను రూపొందించండి. మీరు చేసే చర్చ, మీరిచ్చే సూచనలు.. దేశ రక్షణను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఉన్నతమైన ఆలోచనలతో.. భారత రక్షణ రంగాన్ని ఆత్మనిర్భరం చేసే సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు అందరికా అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదములు!

 
*****


(Release ID: 1700113) Visitor Counter : 214