ఆర్థిక మంత్రిత్వ శాఖ
పూణెలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
22 FEB 2021 4:01PM by PIB Hyderabad
మహారాష్ట్ర రాష్ట్రంలోని ఫూణెలోని సంగమనేర్‌కు చెందిన ఒక వ్యాపార సంస్థకు చెందిన 34 భిన్న ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ 17.02.2021లో సోదాలు నిర్వహించింది. ఈ గ్రూపుకు చెందిన సంస్థలు పొగాకు తత్సంబంధిత ఉత్పత్తుల ప్యాకేజింగ్, అమ్మకాలు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ఎఫ్ ఎంసీజీల అమ్మకాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి.
సోదాల సందర్భంగా, చేత్తో రాసిన, కంప్యూటర్‌లో ఎక్సెల్ షీట్లలో నిర్వహిస్తున్న రూ. 243 కోట్ల నగదుకు సంబంధించి నమోదు చేయని పొగాకు అమ్మకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు అదనంగా, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన కొందరు డీలర్లపై చర్య తీసుకున్న క్రమంలో దాదాపు రూ. 40 కోట్ల విలువైన నమోదుకాని అమ్మకాల వ్యవహారం బహిర్గతమైంది.
ఈ గ్రూపు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో రిజిస్ట్రేషన్ విలువకు ఎక్కువగా నగదు చెల్లింపులను అంగీకరిస్తోంది. దాదాపుగా రూ. 18 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఈ క్రమంలో బయిటపడ్డాయి. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 50 సికి సంబంధించి రూ. 23 కోట్ల మేరకు ఉల్లంఘనలు జరిగినట్టు కనుగొన్నారు.
సోదాల క్రమంలో, రియల్ ఎస్టేట్ అమ్మకాలలో నమోదు చేయని లావాదేవీల ద్వారా రూ. 09 కోట్ల మేరకు లాభాలను ఆర్జించినట్టు పన్ను చెల్లింపుదారు అంగీకరించారు. సోదాల నేపథ్యంలో సుమారు 01 కోటి రూపాయల మేరకు లెక్కల్లోకి రాని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు, బహిర్గతం చేయని రూ. 335 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు.
తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
****
(Release ID: 1699977)