ఆర్థిక మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ఆదాయపు పన్నుశాఖ తనిఖీ
Posted On:
18 FEB 2021 6:44PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు కేంద్రంగాగల ఒక వ్యాపార సముదాయ సంస్థకు చెందిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలోని 21 వేర్వేరు ప్రాంతాల్లో 28.01.2021న ఆదాయపు పన్ను అధికారులు తనిఖీ, స్వాధీనం చర్యలు చేపట్టారు. ఈ సంస్థలో భాగంగా ఉన్న ఇతర విభాగాలు సినిమా నిర్మాణానికి ఆర్థిక సహాయం, చలనచిత్ర పంపిణీ, చేపలు-రొయ్యల పెంపకం, స్థిరాస్తి, వడ్డీ వ్యాపారం వగైరాలను నిర్వహిస్తుంటాయి.
తనిఖీ సందర్భంగా రహస్య నగదు లావాదేవీలను నమోదు చేసిన చేతిరాత పుస్తకాలు, ఒప్పందాలు, విడి కాగితాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సముదాయ సంస్థ భారీస్థాయిలో నగదు అప్పుగా ఇస్తూ, నగదు రూపంలోనే వడ్డీ వసూలు చేస్తూంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి లెక్కలూ లేవు. అలాగే రూ.13 కోట్లదాకా సొమ్ము సంబంధిత వివరాలను తనిఖీకి ముందే కంప్యూటర్ ‘క్లౌడ్’ డేటానుంచి తొలగించినప్పటికీ, అధికారులు వాటిని రాబట్టగలిగారు. చలనచిత్ర పంపిణీ, సినిమా హాళ్ల నిర్వహణ ద్వారా పెద్దమొత్తంలో వచ్చే ఆదాయానికి సంబంధించిన రహస్య వివరాలను కూడా అధికారులు గమనించారు. మరోవైపు ప్లాట్ల అమ్మకంలో రిజిస్ట్రేషన్ విలువకు మించిన ధరను నగదు రూపంలో ఈ సంస్థ స్వీకరించినట్లు తేలింది.
మొత్తంమీద నగదుసహా రూ.17.68 కోట్ల ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు రూ.14.26 కోట్లు కాగా, మరో రూ.3.42 కోట్ల మేర స్వర్ణాభరణాలు, బంగారం, వెండి ఉన్నాయి. ఏలూరు, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఈ తనిఖీ సందర్భంగా రహస్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. ఈ మేరకు రెండు పక్షాల నడుమ 2016-17 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల మధ్య పన్ను పరిధిలోకి వచ్చే రూ.161 కోట్ల విలువైన రహస్య ఆర్థిక లావాదేవీలు సాగినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
***
(Release ID: 1699307)
Visitor Counter : 121