ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళ నాడు లో చమురు- గ్యాస్‌ రంగం తాలూకు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 17 FEB 2021 6:19PM by PIB Hyderabad

వణక్కం! (నమస్కారం)

     తమిళ నాడు గవర్నర్‌ శ్రీ బన్ వారీలాల్‌ పురోహిత్‌ గారు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామి గారు, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పన్నీర్‌ సెల్వమ్ గారు, నా మంత్రిమండలి లో సహచరుడు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ గారు,  ప్రముఖులారా, మహిళలు సజ్జనులారా,

వణక్కమ్.

   ఈ రోజు న ఇక్కడుండటం నాకు దక్కిన అపార గౌరవం గా భావిస్తున్నాను.  ముఖ్యమైన చమురు- గ్యాస్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడం కోసం మనమంతా ఇక్కడకు చేరాం.  ఇవి ఒక్క తమిళ నాడు కు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి మహత్వపూర్ణమైనటువంటివి.
 
మిత్రులారా,

   మీలో ఆలోచన ను రేకెత్తించే రెండు వాస్తవాలను మీ దృష్టి కి తీసుకురావడం ద్వారా నా ప్రసంగాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నాను.  భారతదేశం 2019-20 లో దేశానికి అవసరమైన చమురు లో 85 శాతం, గ్యాస్‌లో 53 శాతం వంతు న దిగుమతి చేసుకుంది.  వైవిధ్యభరితమైన, ప్రతిభా సమృద్ధమైన మన దేశం ఇంధన దిగుమతుల పై ఇంతగా ఆధారపడాలా?  ఈ విషయం లో ఎవరినీ నేను విమర్శించాలని భావించడం లేదు.. కానీ, ఒక సంగతి ని గురించి చెప్పదలచుకొన్నాను: ఈ అంశాలపై మనం ఎంతో ముందుగానే దృష్టి సారించి ఉంటే, మన మధ్యతరగతి ప్రజానీకంపైన భారం పడేది కాదు.

   నేడు పరిశుభ్రమైన ఇంధనం, హరిత ఇంధనం తాలూకు వనరుల కోసం సమష్టి గా కృషి చేయడం, తద్వారా ఇంధనం కోసం దిగుమతుల పై ఆధారపడటాన్ని తగ్గించడమే మన ముందున్న కర్తవ్యం.  మా ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల ఆందోళనల విషయం లో సునిశితం గా ఉంటుంది. అందుకే భారతదేశం నేడు రైతులకు, వినియోగదారులకు సహాయపడటం కోసం ఎథెనాల్‌ పై మరింతగా దృష్టి సారించింది. అలాగే సౌర శక్తి రంగంలో అగ్రభాగాన నిలిచే దిశ గా వినియోగాన్ని పెంచుతోంది.  ప్రజల జీవితాల్లో మరింత ఉత్పాదకత, సౌలభ్యం పెంచేందుకు ప్రజా రవాణాను ప్రోత్సహిస్తోంది.  మధ్యతరగతి కుటుంబాలకు భారీ పొదుపు లక్ష్యం గా ఎల్‌ఇడి బల్బు ల వంటి ప్రత్యామ్నాయ వనరులవైపు అడుగులు వేస్తున్నాం.  

మరో వైపు దేశంలోని లక్షలాది ప్రజలకు సహాయపడేలా భారతదేశం నేడు ‘తుక్కు’ విధానాన్ని తీసుకొచ్చింది.  మునుపటి కన్నా అధికం గా భారతదేశం లోని మరిన్ని నగరాలకు మెట్రో రైలు సదుపాయం చేరువైంది.  సోలర్‌ పంపుల కు ఆదరణ పెరుగుతోంది. అవి రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి.  ప్రజల తోడ్పాటు లేనిదే ఇవన్నీ సాధ్యం కావు.  దేశం లో పెరుగుతున్న శక్తి అవసరాలను తీర్చడం కోసం భారతదేశం నిరంతరం కృషి చేస్తోంది.  ఆ మేరకు దిగుమతులపై ఆధారపడటాన్ని క్రమం గా తగ్గిస్తోంది.  అదే కాలం లో మన దిగుమతి వనరులను వివిధత్వాన్ని కూడా తీసుకు వస్తున్నాం.

మిత్రులారా,

   మనం దీనిని ఎలాగ చేస్తున్నాం?  సామర్థ్య నిర్మాణ అనే మాధ్యమం ద్వారానే.  చమురు శుద్ధి సామర్థ్యం రీత్యా 2019-20 లో మనది ప్రపంచం లో 4వ స్థానం.  సుమారు 65.2 మిలియన్‌ టన్నుల పెట్రోలియమ్ ఉత్పత్తులను ఎగుమతి చేయడమైంది.  ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనాలు చెబుతున్నాయి.  మన కంపెనీ లు విదేశాల లో నాణ్యమైన చమురు, గ్యాస్‌ ఆస్తులను కొనుగోలు చేయడంలో ముందంజ వేశాయి.  దీనికి అనుగుణం గా ప్రస్తుతం భారతదేశ చమురు-గ్యాస్‌ కంపెనీలు దాదాపు 2.70 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల తో 27 దేశాలలో ఉనికి ని చాటుకొంటున్నాయి.

మిత్రులారా,

   ‘ఒకే దేశం – ఒకే గ్యాస్‌ గ్రిడ్‌’ లక్ష్యాన్ని సాధించే దిశ లో మేము ప్రస్తుతం గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్కు ను అభివృద్ధి చేస్తున్నాం.  చమురు, గ్యాస్‌ రంగం లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అయిదు సంవత్సరాలలో 7.50 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించే  ప్రణాళిక ను మేము రూపొందించాం.  దేశం లోని 407 జిల్లాలకు అందుబాటు దిశ గా నగర గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్కు ల విస్తరణ కు ప్రాధాన్యమిస్తున్నాం.

మిత్రులారా,

   మా వినియోగదారు లక్షిత ‘పహల్‌’ (పిఎహెచ్‌ఎఎల్‌), ‘పిఎం ఉజ్వల్‌ యోజన’ పథకాలు ప్రతి భారతీయ కుటుంబానికీ గ్యాస్‌ లభ్యతలో తోడ్పడుతున్నాయి. తమిళ నాడు లోని వంటగ్యాస్‌ వినియోగదారుల లో 95 శాతం ‘పహల్‌’ పథకం లో చేరారు. అలాగే 90 శాతానికిపైగా వినియోగదారులు ప్రత్యక్ష బదిలీ ద్వారా రాయితీ ని పొందుతున్నారు.  అలాగే తమిళ నాడు లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 32 లక్షలకు పైగా కుటుంబాలు ‘ఉజ్వల్‌’ పథకం లో భాగం గా కొత్త కనెక్షన్ లను పొందారు.  మరో 31.6 లక్షల కు పైగా కుటుంబాలు పిఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన లో భాగంగా ఉచిత వంటగ్యాస్ సిలిండర్ లతో లబ్ధి ని పొందుతున్నారు.

మిత్రులారా,

   తమిళ నాడు లోని రామనాథపురం నుంచి ట్యుటికోరిన్‌ దాకా 143 కిలోమీటర్ల పొడవైన ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఇవాళ ప్రారంభం కానుంది. దీనివల్ల ‘ఓఎన్‌జీసీ’ గ్యాస్‌ క్షేత్రాల నుంచి ధనార్జన మొదలవుతుంది.  ఇది 4,500 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి చేస్తున్న ఓ పెద్ద సహజవాయువు పైప్‌లైన్‌ ఇదొక భాగం.
 
దీనివల్ల: ఎన్నూర్‌, తిరువళ్లూరు, బెంగళూరు, పుదుచ్చేరి, నాగపట్టినమ్, మదురై, టుటికోరిన్‌లకు ప్రయోజనం కలుగుతుంది.  ఈ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులతో తమిళ నాడు లోని 10 జిల్లాల లో 5,000 కోట్ల రూపాయలతో రూపొందుతున్న నగర గ్యాస్‌ ప్రాజెక్టుల అభివృద్ధికీ వీలు కలుగుతుంది.  

ఈ ప్రాజెక్టుల ద్వారా ఇంటింటికీ ‘పిఎన్‌జి’ రూపం లో పరిశుభ్ర వంట ఇంధనం, ‘సిఎన్‌జి’ రూపంలో వాహనాలకు, స్థానిక పరిశ్రమలకు ప్రత్యామ్నాయ రవాణా ఇంధనం అందుబాటు లోకి వస్తాయి.

   ఓఎన్‌జీసీ క్షేత్రం నుంచి ఇప్పుడు ట్యుటికోరిన్‌ లోని సదరన్‌ పెట్రోకెమికల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ ((ఎస్‌పిఐసి-స్పిక్‌) లిమిటెడ్‌ కు గ్యాస్‌ సరఫరా అవుతుంది. ఎరువుల తయారీ కోసం స్పిక్‌ కర్మాగారానికి ఈ గొట్టపుమార్గం ద్వారా తక్కువ ఖర్చు తో సహజ వాయువు ముడిపదార్థం గా ప్రత్యక్ష సరఫరా అవుతుంది.

 దీనివల్ల నిల్వ అవసరం లేకుండా ముడిపదార్థం ఇప్పుడు నిరంతరం అందుబాటు లో ఉంటుంది. తద్వారా ఉత్పత్తి వ్యయంలో ఏటా 70 కోట్ల రూపాయల నుంచి 95 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుంది. దీనితో పాటు ఎరువుల ఉత్పత్తి పై తుది ఖర్చు కూడా తగ్గుతుంది.  మన ఇంధన పొది లో గ్యాస్ వాటా ను ప్రస్తుతం 6.3 శాతం నుంచి 15 శాతానికి పెంచడం పై మేమెంతో ఆసక్తి చూపుతున్నాం.

మిత్రులారా,

   అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు అనేక ప్రయోజనాలు కూడా అందుబాటులోకి వస్తాయి.  ఆ మేరకు  నాగపట్టణంలో సిపిసిఎల్‌ కొత్త చమురు శుద్ధి కర్మాగారానికి కావలసిన ముడిపదార్థాలు, సేవలలో 80 శాతం దేశీయంగానే లభిస్తాయని అంచనా వేస్తోంది.  ఈ కర్మాగారం వల్ల ఈ ప్రాంతం లో రవాణా సదుపాయాలు, దిగువ స్థాయి పెట్రోరసాయన పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.  ఈ కొత్త చమురు శుద్ధి కర్మాగారం ‘బిఎస్‌-VI’ ప్రామాణిక అవసరాలకు తగిన పెట్రోలు (మోటర్‌ స్పిరిట్- ఎంఎస్‌), డీజిల్‌ తో పాటు విలువ జోడించిన పాలీప్రొపైలీన్‌ ను కూడా తయారుచేస్తుంది.

మిత్రులారా,

   భారతదేశం ప్రస్తుతం ఇంధన ఉత్పాదన లో నవీకరణయోగ్య వనరుల వాటా ను పెంచుతోంది.  ఈ క్రమం లో 2030 కల్లా మొత్తం ఉత్పాదన లో 40 శాతం హరిత ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి కానుంది.  ఇక హరిత భవిష్యత్తు దిశ గా కృషి లో భాగంగా ‘సిపిసిఎల్‌’ ఇవాళ మనలి లోని చమురు శుద్ధి కర్మాగారం లో కొత్త ‘గ్యాసోలిన్‌ డీ-సల్ఫ్యూరైజేషన్‌’ విభాగాన్ని ప్రారంభించింది.  ఈ కర్మాగారం ఇక మీదట తక్కువ గంధకం ఉండే ‘బిఎస్‌-VI’ ప్రామాణిక పర్యావరణ హిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనుంది.

మిత్రులారా,

   చమురు-గ్యాస్‌ రంగం లో అన్వేషణ, ఉత్పత్తి, సహజ వాయువు, మార్కెటింగ్‌, పంపిణీ లకు సంబంధించి 2014 నుంచి మేం వివిధ సంస్కరణలను తీసుకువచ్చాం.  అలాగే పెట్టుబడిదారు సన్నిహిత చర్యల ద్వారా జాతీయ పెట్టబడులను, అంతర్జాతీయ పెట్టబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాం.  సహజ వాయువు పై వివిధ రాష్ట్రాల మధ్య పన్నుల పర్యవసానంగా పడే భారాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం.  దేశవ్యాప్తం గా ఒకే విధమైన పన్నువిధింపు వల్ల సహజ వాయువు పై వ్యయం తగ్గి, పరిశ్రమలలో సహజ వాయువు వినియోగం పెరుగుతుంది.  ఆ మేరకు సహజ వాయువు ను జిఎస్‌ టి వ్యవస్థ లోకి తీసుకుపోయేందుకు కట్టుబడి ఉన్నాం.

“రండి... భారత ఇంధన రంగం లో పెట్టుబడులు పెట్టండి” అని ప్రపంచానికి పిలుపునిస్తున్నాను.

మిత్రులారా,

   తమిళ నాడు లో గడచిన ఆరేళ్లు గా 50,000 కోట్ల రూపాయల విలువైన చమురు-గ్యాస్‌ ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వడమైంది.  ఇక 2014 కంటే క్రితం మంజూరైన 9,100 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు కూడా ఈ ఆరేళ్ల వ్యవధిలోనే పూర్తి అయ్యాయి.  దీనికి తోడు, 4,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు రాబోతున్నాయి.  తమిళ నాడు లో గల ఈ ప్రాజెక్టులన్నీ భారతదేశం లో సుస్థిర వృద్ధి దిశ లో మా నిరంతర విధానాలు, చర్యల పరమైన సంయుక్త కృషి ఫలితమే.

   తమిళ నాడు లో ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశ గా కృషి లో పాలు పంచుకుంటున్న భాగస్వాములు అందరికీ నా అభినందన లు.   మనమంతా మన ప్రయత్నాలలో నిరంతరం సఫలం అవుతూ ఉంటామనే విషయం లో నాకు ఎలాంటి అనుమానమూ లేదు.

మీకు ఇవే ధన్యవాదాలు.

వణక్కమ్.



***



(Release ID: 1698966) Visitor Counter : 169