ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో కెల్లా మొట్టమొదటి పూర్తి స్థాయి అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ కేరళ లో ప్రారంభమైన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
14 FEB 2021 6:24PM by PIB Hyderabad
కేరళ గవర్నరు శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్, మంత్రిమండలి లో నా సహచరుడు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సహాయ మంత్రి శ్రీ మురళీధరన్ గారు, వేదిక కు ముందున్నటువంటి ప్రముఖులు,
మిత్రులారా,
నమస్కారం కొచ్చి. నమస్కారం కేరళ. అరేబియా సముద్ర రాణి ఎప్పటి లాగానే అద్భుతంగా ఉంది. మీ అందరి మధ్యకు రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ రోజున అభివృద్ధి ని వేడుక గా జరుపుకోవడం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇది కేరళ అభివృద్ధి; భారతదేశం వికాసం కూడాను. ఈ రోజున ప్రారంభించుకొంటున్న పనులు వివిధ రంగాల కు చెందినవి. అవి భారతదేశం వృద్ధి గతి కి శక్తి ని అందిస్తాయి.
మిత్రులారా,
రెండేళ్ళ కిందట నేను కొచ్చి రిఫైనరీ కి వెళ్ళాను. ఇది భారతదేశం లో గల అత్యాధునిక రిఫైనరీల లో ఒకటి. ఈ రోజున,మరొక్క సారి కొచ్చి నుంచి, మనం దేశ ప్రజల కు కొచ్చి రిఫైనరీ కి చెందిన ‘ప్రొపిలీన్ డిరివటివ్స్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు కాంప్లెక్సు’ ను అంకితం చేసుకొంటున్నాం. ఈ ఒక్క ప్రాజెక్టు ‘ఆత్మనిర్భరత’ వైపు మన ప్రస్థానాన్ని బలోపేతం చేయడం లో సహాయకారి అవుతుంది. ఈ కాంప్లెక్స్ కారణం గా, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడం సాధ్యపడుతుంది; అనేక పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి; ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతాయి.
మిత్రులారా,
కొచ్చి వ్యాపార, వాణిజ్యాల నగరం గా ఉంటోంది. ఈ నగర ప్రజలు కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొంటారు. సరైన సంధానానికి ఎంతటి ప్రాముఖ్యం ఉంది అనే విషయాన్ని కూడా వారు ఎంతో బాగా ఎరుగుదురు. ఈ కారణం గానే రో-రో వెసల్స్ ను దేశానికి అంకితం చేయడం ప్రత్యేకత కలిగినటువంటిది. రోడ్డు మార్గం లో దాదాపు గా 30 కిలో మీటర్ల దూరం కాస్తా జల మార్గం లో వెళ్తే గనుక మూడున్నర కిలో మీటర్లు అయిపోతుంది. దీనికి అర్థం: సౌకర్యం పెరుగుతుంది, వాణిజ్యమూ పెరుగుతుంది, సామర్ధ్యం కూడా పెరుగుతుంది. రాకపోక ల తాలూకు రద్దీ తగ్గుతుంది, కాలుష్యమూ తగ్గుతుంది, రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి అన్నమాట.
మిత్రులారా,
యాత్రికులు కొచ్చి కి వచ్చారు అంటే, కేరళ లోని ఇతర ప్రాంతాల కు వెళ్ళాడానికి ఇది ఒక మజిలీ గానే కాక ఇక్కడి సంస్కృతి, ఆహారం, సముద్ర తీర ప్రాంతాలు, బజారు లు, చారిత్రక స్థలాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎంతో ప్రసిద్ధిచెందినవి కూడా. ఇక్కడ పర్యాటక రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తున్నది. కొచ్చి లో ఇంటర్ నేశనల్ క్రూజ్ టర్మినల్ ‘సాగరిక’ ప్రారంభ కార్యక్రమమే ఈ దిశ లో ఓ ఉదాహరణ గా ఉంది. ‘సాగరిక’ క్రూజ్ టర్మినల్ సముద్ర యాత్రికుల కు అటు సౌకర్యవంతం గా ఉండటమే కాకుండా, ఇటు హాయి ని కూడా అందిస్తుంది. ఇది లక్ష కు పైగా సముద్ర యాత్రికుల కు సేవలను అందిస్తుంది.
మిత్రులారా,
గడచిన కొన్ని నెలల్లో నేను ఒక విషయాన్ని గమనిస్తూ వచ్చాను. చాలా మంది వారు స్థానికం గా చేసిన ప్రయాణాల ను గురించి నాకు లేఖల రూపం లో తెలియ జేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాలలో కొన్ని చిత్రాల ను కూడా వారు జత చేస్తున్నారు. ప్రపంచ మహమ్మారి అంతర్జాతీయ ప్రయాణాల ను ప్రభావితం చేసినప్పటి నుంచి ప్రజలు సమీప ప్రదేశాల కు వెళ్తూ వస్తున్నారు. ఇది మనకు లభించిన ఒక గొప్ప అవకాశం. ఒక పక్క దీనితో స్థానిక పర్యటన పరిశ్రమ కు చెందిన వారికి అదనపు బ్రతుకు తెరువు లభించినట్లు అవుతోంది. మరో పక్క ఇది మన యువత కు, మన సంస్కృతి కి మధ్య గల బంధాన్ని దృఢతరం చేస్తున్నది. సందర్శించడానికి, నేర్చుకోవడానికి, కొత్త విషయాల ను కనుగొనడానికి మన చుట్టుపక్కల ప్రాంతాల లో ఎంతో ఉంది. పర్యటక రంగానికి సంబంధించి కొత్త కొత్త ఉత్పత్తుల ను వి కనుగొనే దిశ లో ఆలోచన లు చేయవలసిందిగా మన యువ స్టార్ట్-అప్ మిత్రుల ను నేను కోరుతున్నాను. ఈ కాలాన్ని వినియోగించుకొని మీ సమీప ప్రాంతాల ను వీలైనన్ని దర్శించవలసిందని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశం లో పర్యటక రంగం గత అయిదేళ్ళు గా చక్క గా వృద్ధి చెందుతోందని తెలిసినప్పుడు మీరు సంతోషిస్తారు. వరల్డ్ టూరిజమ్ ఇండెక్స్ స్థానాల లో భారతదేశం 65వ స్థానం నుంచి 34వ స్థానానికి ఎగబాకింది. అయితే, సాధించవలసింది ఇంకా ఎంతో ఉంది. మనం మరింత మెరుగుపడతామని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
ఆర్థిక అభివృద్ధి ని అందించే ముఖ్యమైన అంశాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటో అంశం సామర్ధ్యాన్ని పెంచుకోవడం. రెండో అంశం రాబోయే కాలం అవసరాల కు సరిపడేటటువంటి ఆధునిక మౌలిక సదుపాయాల ను అందుబాటు లోకి తెచ్చుకోవడం. తదుపరి దశ లో చేపట్టే అభివృద్ధి కార్యాలు ఈ రెండు ఇతివృత్తాల కు సంబంధించినవి అయి ఉంటాయి. కొచ్చిన్ షిప్ యార్డు లో ‘విజ్ఞాన్ సాగర్’ పేరు తో ఒక నూతన నాలెడ్జ్ కేంపస్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా మనం మన మానవ వనరుల వికాస రాజధాని ని విస్తరించుకోబోతున్నాం. నైపుణ్యాల అభివృద్ధి తాలూకు ప్రాముఖ్యాన్ని ఈ కేంపస్ ప్రతిబింబిస్తుంది. ఇది ప్రత్యేకించి సముద్ర సంబంధిత ఇంజినీరింగ్ ను అధ్యయనం చేయగోరే వారికి సహాయకారి గా ఉంటుంది. రాబోయే కాలాల్లో ఈ రంగం ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొంటుందని నేను అనుకొంటున్నాను. ఈ రంగం లో జ్ఞానాన్ని ఆర్జించిన యువజనుల ముగింట కు అనేక అవకాశాలు వచ్చి వాలతాయి. నేను ముందే చెప్పినట్లుగా, ఆర్థిక వృద్ధి చోటు చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఉన్న సామర్ధ్యాల ను పెంపొందించుకోవలసి ఉంటుంది. ఇక్కడ మనం సౌత్ పోల్ బెర్త్ పునర్ నిర్మాణాని కి శంకుస్థాపన చేసుకొంటున్నాం. ఇది లాజిస్టిక్స్ వ్యయాల ను తగ్గిస్తుంది. సరకు రవాణా సామర్ధ్యాల ను మెరుగుపరుస్తుంది. వ్యాపారం పెంపొందాలి అంటే మరి ఈ రెండంశాలూ కీలకం.
మిత్రులారా,
ప్రస్తుత కాలం లో మౌలిక సదుపాయాల కల్పన తాలూకు నిర్వచనం, పరిధి మారాయి. మంచి రహదారులే కాక అభివృద్ధి పనులు, కొన్ని పట్టణ కేంద్రాల మధ్య సంధానం.. వీటికి మించినవి చోటు చేసుకోవాలి. రాబోయే తరాల కోసం అగ్రగామి నాణ్యత తో కూడిన మౌలిక సదుపాయాల కల్పన ను పెద్ద ఎత్తున సమకూర్చాలని మేము భావిస్తున్నాం. నేశనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్షల కొద్దీ కోట్ల రూపాయల పెట్టుబడి ని పెట్టడం జరుగుతోంది. అందులోను, కోస్తా తీర ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, పర్వత ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతున్నది. ప్రస్తుతం భారతదేశం ప్రతి ఒక్క పల్లె కు బ్రాడ్-బ్యాండ్ సంధానం అనే ఒక మహత్వాకాంక్ష తో కూడినటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. అదే మాదిరి గా, భారతదేశం మన బ్లూ ఇకానమి ని అభివృద్ధి చేయడానికి అత్యున్నత ప్రాముఖ్యాన్ని కట్టబెడుతున్నది. ఈ రంగం లో మనం అనుసరిస్తున్న దార్శనికత, మనం చేస్తున్న కార్యాలు మరిన్ని నౌకాశ్రయాల నిర్మాణానికి తోడుగా ఇప్పటికే ఉన్నటువంటి నౌకాశ్రయాల లో మౌలిక సదుపాయాల కు మెరుగులు దిద్దడం భాగం గా ఉన్నాయి. అదే మాదిరిగా, సముద్ర తీరానికి ఆవల శక్తి అన్వేషణ, నిలకడతనం తో కూడినటువంటి కోస్తా తీర ప్రాంత అభివృద్ధి, కోస్తా తీర ప్రాంతాల కు సంధాన సౌకర్యాన్ని కల్పించడం వంటివి కూడా దీనిలో భాగం గా ఉన్నాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ఒక ప్రత్యేకమైన పథకం. ఈ పథకం చేపలు పట్టే వ్యక్తుల సముదాయాల విభిన్న అవసరాల ను తీరుస్తుంది. దీని లో మరింత పరపతి కి పూచీ పడే ఏర్పాటు లు ఉన్నాయి. మత్స్యకారుల ను కిసాన్ క్రెడిట్ కార్డుల తో జత పరచడం జరిగింది. అలాగే, భారతదేశాన్ని సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతి కి ఒక కేంద్రం గా మలచే దిశ లో పనులు సాగుతున్నాయి. సీవీడ్ ఫార్మింగ్ ప్రజాదరణ కు నోచుకొంటుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మత్య్స పరిశ్రమ ను మరింత హుషారైంది గా మలచేందుకు పరిశోధకులు, నూతన ఆవిష్కర్తలు వారి వారి ఆలోచనల తో ముందుకు రావాలి అంటూ వారికి నేను పిలుపునిస్తున్నాను. ఇది జరిగినప్పుడు కష్టపడి పని చేసే మన మత్స్యకారుల కు ఇది ఒక గొప్ప ప్రశంస కాగలదు.
మిత్రులారా,
ఈ సంవత్సరం లో తీసుకు వచ్చిన బడ్జెటు కేరళ కు ప్రయోజనాన్ని అందించే పథకాల తో పాటు వనరుల కు కూడా చోటు కల్పించింది. వీటిలో కొచ్చి మెట్రో తదుపరి దశ అనేది కూడా ఒకటి గా ఉంది. ఈ మెట్రో నెట్ వర్క్ విజయవంతం గా రూపుదిద్దుకొని, ప్రగతిశీలత కు, వృత్తినైపుణ్యాని కి ఒక మంచి ఉదాహరణ ను అందించింది.
మిత్రులారా,
గడచిన సంవత్సరం లో మానవ జాతి కని విని ఎరుగనటువంటి ఒక సవాలు ను ఎదుర్కొనేటట్టు చేసింది. 130 కోట్ల మంది భారతీయులు అందించిన బలం తో మన దేశం కొవిడ్-19 కి వ్యతిరేకంగా సలిపిన పోరాటం ఎంతో ఉత్సాహభరితం అయినటువంటిది. ప్రవాసి భారతీయుల అవసరాల ను, ప్రత్యేకించి గల్ఫ్ లోని ప్రవాసీ భారతీయుల అవసరాల ను, తీర్చడం లో ప్రభుత్వం సదా ప్రతిస్పందిస్తూ వస్తున్నది. నేను ఇదివరలో సౌదీ అరేబియా, కతర్, యుఎఇ, ఇంకా బహ్రెయిన్ లను సందర్శించిన ప్పుడు వారితో భేటీ అయ్యే గౌరవాన్ని దక్కించుకొన్నాను. వారితో కలసి నేను భోజనం చేశాను. వారితో ముఖాముఖి మాట్లాడాను. ‘వందే భారత్ మిశన్’ లో భాగం గా యాభై లక్షల మంది కి పైగా భారతీయులు వారి మాతృదేశానికి తిరిగి వచ్చారు. వారిలో చాలా మంది కేరళ కు చెందిన వారే. అంతటి ఆపత్కాలం లో వారికి సేవల ను అందించడం మా ప్రభుత్వానికి దక్కిన ఒక సమ్మానం. గత కొన్నేళ్ళ లో గల్ఫ్ ప్రాంత దేశాల ప్రభుత్వాలు సైతం దురదృష్టవశాత్తు అక్కడి జైళ్ళ లో మగ్గుతున్న అనేక మంది భారతీయుల ను కరుణాపూరితమైన హృదయం తో విడుదల చేశాయి. అటువంటి వ్యక్తుల విషయం లో ప్రభుత్వం ఎప్పటికీ గళమెత్తుతూనే ఉంటుంది. ఈ అంశం లో గల్ఫ్ ప్రాంతం లోని వివిధ దేశాలు వాటి పెద్ద మనస్సు ను చాటుకొన్నందుకు ఆయా దేశాల ప్రభుత్వాల కు నేను ధన్యవాదాలు తెలియజేయదలచుకొన్నాను. నేను స్వయం గా చేసిన వినతుల పట్ల గల్ఫ్ రాజ్యాలు స్పందించి, మన సముదాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొన్నాయి. అవి భారతీయులు తిరుగుపయనం కావడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. ఈ ప్రక్రియ కు మార్గాన్ని సుగమం చేయడానికి ‘ఎయర్ బబుల్స్’ ను మేము ఏర్పాటు చేశాం. గల్ఫ్ లో పని చేస్తున్న భారతీయులు నా ప్రభుత్వం వారి సంక్షేమం విషయం లో పూర్తి సమర్ధన ను అందిస్తోందనే విషయాన్ని గమనించాలి.
మిత్రులారా,
ఇవాళ మనం ఒక చరిత్రాత్మకమైన మలుపు దగ్గర కు చేరుకొన్నాం. ఈ రోజు న మనం చేసే పనులు రాబోయే సంవత్సరాల లో మన వృద్ధి గతి ని నిర్దేశిస్తాయి. పరిస్థితి కి తగ్గట్లుగా ప్రతిస్పందించగలిగిన, ప్రపంచ హితానికి తన వంతు తోడ్పాటు ను అందించగలిగిన సత్తా భారతదేశాని కి ఉంది. సరి అయిన అవకాశం వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాల ను అందించగలమని మన వాళ్ళు నిరూపించారు. ఆ కోవ కు చెందిన అవకాశాల ను అందిపుచ్చుకోవడానికి మనమంతా శ్రమిస్తూ ముందుకు పోదాం. కలసికట్టు గా, మనం అందరమూ ఒక ‘ఆత్మనిర్భర్ భారత్’ ను నిర్మిద్దాం. మరొక్క సారి, ఇవాళ ప్రారంభించుకొన్న అభివృద్ధి పనుల కు గాను కేరళ ప్రజల ను నేను అభినందిస్తున్నాను.
మీకు ధన్యవాదాలు, అనేకానేక ధన్యవాదాలు
ఒరాయిరమ్ నండ్రి
****
(Release ID: 1698151)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam