వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా రోమ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఉద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించిన - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


2019-20లో ప్రపంచంలోని మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 23.62 శాతం : శ్రీ తోమర్

గత 5 సంవత్సరాలలో 100 కంటే ఎక్కువ మెరుగైన, అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యాలు అభివృద్ధి చెందాయి

భారత జాతీయ ఆహార భద్రతా మిషన్ మరియు ఇతర కార్యక్రమాలలో ప్రధాన పంటగా, పప్పుధాన్యాలు చోటు దక్కించుకుంటున్నాయి : శ్రీ తోమర్

Posted On: 13 FEB 2021 5:05PM by PIB Hyderabad

ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, వినియోగాల్లో భారతదేశం అతిపెద్ద దేశంగా నిలవడంతో పాటు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందని, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్, పేర్కొన్నారు. గత ఐదారు సంవత్సరాల్లో, భారతదేశంలో, పప్పుధాన్యాల ఉత్పత్తి, 140 లక్షల టన్నుల నుండి 240 లక్షల టన్నులకు పెరిగింది. 2019-20 సంవత్సరంలో, భారతదేశం 23.15 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలను ఉత్పత్తి చేసింది, ఇది ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో 23.62 శాతం. ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా రోమ్‌లో జరిగిన, అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఉద్దేశించి, కేంద్ర మంత్రి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.

పప్పుధాన్యాల ప్రాముఖ్యత గురించి శ్రీ తోమర్ వివరిస్తూ, పప్పుధాన్యాలలో పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉన్నందున, అవి ఆహార పదార్ధాలలో చాలా ముఖ్యమైనవి, ప్రధానంగా భారతదేశం లాంటి శాఖాహార దేశాలకు చాలా ముఖ్యమైనవి. తక్కువ నీటి వినియోగంతో, పొడిగా ఉండే ప్రదేశాల్లోనూ, వర్షాలు కురిసే ప్రదేశాలలోనూ, పప్పుధాన్యాలు, పండించవచ్చు. ఇవి, నేలలో నత్రజనిని సంరక్షిస్తాయి, ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి, అదేవిధంగా, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూసారాన్ని మెరుగుపరుస్తాయి.

పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి భారత ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న కృషి, డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నమని శ్రీ తోమర్ చెప్పారు. పప్పుధాన్యాలు పెద్ద మొత్తంలో భారతీయుల ప్రోటీన్ అవసరాన్ని నెరవేరుస్తాయి కాబట్టి, ఇది భారతీయ వ్యవసాయంలో ప్రధాన భాగంగా కొనసాగుతున్నాయి. ఆయన ఇంకా మాట్లాడుతూ, "పప్పుధాన్యాలు, మన జాతీయ ఆహార భద్రతా మిషన్ మరియు ఇతర కార్యక్రమాలలో ప్రధాన పంటగా చోటు సంపాదించి, కొనసాగుతుంది. వరి సాగుకు అనుకూలంగా లేని బీడు భూములను లక్ష్యంగా చేసుకుని, వినూత్న సాంకేతిక కార్యకలాపాలను కలపడంతో పాటు, అవసరమైన వ్యవసాయ ఇన్పుట్లను అందించడం ద్వారా పప్పుధాన్యాల ఉత్పత్తి పెద్ద ఎత్తున పెరిగింది.” అని చెప్పారు.

వ్యవసాయ కార్యక్రమాల గురించి, శ్రీ తోమర్ మాట్లాడుతూ, భారతదేశంలో 86 శాతం చిన్న, మధ్యతరహా రైతులు ఉన్నారని తెలియజేశారు. వారికి అన్ని రకాల సహాయం అందించడం కోసం ఎఫ్.‌పి.ఓ. లను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. భారత ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో 6,850 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 10,000 కొత్త ఎఫ్.‌పి.ఓ. లను నిర్మించనుంది. ఈ చర్య వల్ల, రైతులకు విత్తనోత్పత్తి, కొనుగోలు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చొరవతో "ఒక్కొక్క నీటి బిందువుతో అధిక పంట" విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా భూసారంతో పాటు, వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్) చేసిన కృషిని, కేంద్ర మంత్రి ప్రశంసిస్తూ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల ద్వారా, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో ఐ.సి.ఏ.ఆర్. ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పారు. పప్పుధాన్యాల పంటల పరిశోధన కొత్త దిశను పొందింది, కొత్త, మెరుగైన జాతుల అభివృద్ధికి అపూర్వమైన కృషి జరిగింది. గత ఐదేళ్లలో, 100 కంటే ఎక్కువ మెరుగైన, అధిక దిగుబడినిచ్చే జాతులు అభివృద్ధి చేయడం జరిగింది. రకరకాల విత్తనాలను మెరుగుపరచడం, పప్పుధాన్యాల సాగు, మార్కెట్ కింద కొత్త ప్రాంతాలను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది, ఇది రైతుల లాభాలను పెంచడానికి సహాయపడుతోంది.

పప్పుధాన్యాల ప్రాముఖ్యత గురించి, శ్రీ తోమర్, నొక్కి చెబుతూ, భారతదేశంలో, జాతీయ పోషకాహార మిషన్ క్రింద సుమారు 1.25 కోట్ల అంగన్ వాడి కేంద్రాలలో, పప్పుధాన్యాల పంపిణీ జరుగుతోంది. లాక్లా-డౌన్ సమయంలో, 80 కోట్ల మందికి ప్రభుత్వం, పప్పులను, పప్పుధాన్యాలను సరఫరా చేసింది. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రపంచంలో - అంతర్జాతీయ స్థాయి ఆహార ప్రదార్ధాల ఎగుమతిదారు / సరఫరాదారుగా భారతదేశం అవతరించిందని, కేంద్ర మంత్రి చెప్పారు. ఇంతకుముందు సంవత్సరం, ఇదే కాలంతో పోల్చి చూస్తే, 2020, ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు, భారతదేశంలో, పప్పు ధాన్యాలతో సహా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గణనీయంగా నమోదుకాగా, వీటిలో, కేవలం పప్పు ధాన్యాల ఉత్పత్తి 26 శాతం పెరిగింది. ఆయుర్వేదం వైద్యంలో రోగనిరోధక శక్తిని పెంచేవిగా భావించే అల్లం, నల్ల మిరియాలు, ఏలకులు, పసుపు వంటి ఔషధ మొక్కల ఎగుమతిలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యింది. ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అందువల్ల, దేశ వ్యవసాయ బడ్జెట్టు ‌ను 5 రెట్లు పెంచారు, ఇది ఇప్పుడు సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.

వ్యవసాయ రంగ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని, కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 10.5 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు 1.15 లక్షల కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద, లక్ష కోట్ల రూపాయలతో, రైతులకు గిడ్డంగి, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త బడ్జెట్ నిబంధన ప్రకారం ఈ నిధి రాష్ట్రాల్లోని ఎ.పి.ఎం.సి. లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

2016 నాటి ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో - క్యూ.యు. డోంగ్యూ, ఎఫ్.ఏ.ఓ-యు.ఎన్. డైరెక్టర్ జనరల్, పోప్ ఫ్రాన్సిస్; చైనా, వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి, శ్రీ టాంగ్ రెంజియాన్; ఫ్రాన్స్, వ్యవసాయ, ఆహార శాఖ మంత్రి, శ్రీ జూలియన్ డెనోర్మాండీ; అర్జెంటీనా, వ్యవసాయ మంత్రి, ఆహార విధానాల సదస్సు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి, డాక్టర్ ఆగ్నెస్ కలిబాటా తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

*****

 


(Release ID: 1697841) Visitor Counter : 311