రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

వాహన తయారీదారులు వాహనాల్లో ప్రాథమిక భద్రతా ఏర్పాట్లను కనీస సరసమైన ధరలకు సమకూర్చాలని గడ్కరీ చెప్పారు; తక్కువ ఖర్చుతో కూడిన రహదారి భద్రతా చర్యల ద్వారా భారీ సంక్షేమ ప్రయోజనాలను సాధించవచ్చని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు నివేదికను ఆయన విడుదల చేశారు


Posted On: 13 FEB 2021 6:52PM by PIB Hyderabad

సామాజిక బాధ్యతను పరిగణనలోకి తీసుకుని, ఆటోమొబైల్ తయారీదారులు వాహనాల్లో కనీస సరసమైన ధరలకు ప్రాథమిక భద్రత ఏర్పాట్లను సమకూర్చాలని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, అన్నారు. ఇటీవలి ఒక అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ, రహదారి ప్రమాదాలలో మరణాలను నివారించడంలో మనం విజయవంతమైతే, మనం ఒక్కొక్క వ్యక్తి పైనా, సుమారు 90 లక్షల రూపాయలు ఆదా చేయవచ్చునని, ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ తయారీదారులు, తాము తయారుచేసే వాహనాల్లో, భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడం చాలా అవసరమని, గడ్కరీ సూచించారు. "ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా గాయాలు మరియు వైకల్యాలు : భారతీయ సమాజంపై భారం", అనే అంశంపై, "సేవ్ లైఫ్ ఫౌండేషన్" అనే స్వచ్చంద సంస్థ సహకారంతో ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఒక నివేదికను మంత్రి ఈ రోజు విడుదల చేశారు.

విస్తృతంగా చెప్పాలంటే, రోడ్డు ప్రమాదాలు సమాజానికి, దేశానికి విపరీతమైన భారం అని నివేదిక పేర్కొంది.

ఆ నివేదిక వెల్లడించిన మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  • రహదారి ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు, గాయాలను తగ్గిస్తే ఆదాయ వృద్ధి మెరుగౌతుంది.
  • తక్కువ ఖర్చుతో చేపట్టే, రహదారి భద్రతా చర్యల ద్వారా, భారీ సంక్షేమ ప్రయోజనాలను సాధించవచ్చు.
  • రహదారి ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు, గాయాలు తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో, చురుకుగా పనిచేసే వయస్సులో ఉండేవారి స్థితిగతులను భారీగా దెబ్బతీస్తాయి.

భారతదేశం వంటి దేశాలలో రోడ్డు ప్రమాదాలు ప్రజారోగ్య సమస్య మరియు సవాలుగా నిలుస్తాయని, గడ్కరీ, పేర్కొన్నారు. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు "4-ఈ" లుగా పరిగణించే - ఇంజనీరింగు, విద్య, అమలు మరియు అత్యవసర సంరక్షణ సేవలను - బలోపేతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి తన మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంటోందని, చెప్పారు. వివిధ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేస్తోందనీ, అందులో - రహదారి ప్రమాదాల సమాచార వ్యవస్థను క్రమబద్ధీకరించే - ఐ.ఆర్.ఏ.డి. - ఒకటని మంత్రి తెలిపారు.

ధనిక కుటుంబాలతో పోలిస్తే, పేద కుటుంబాలలో ప్రమాద మరణాల సంఖ్య రెట్టింపుగా ఉందన్న విషయం ఈ నివేదిక వెల్లడించిన ముఖ్య ఫలితాలలో ఒకటి అని, శ్రీ గడ్కరీ ఎత్తి చూపారు. అయితే, ప్రభుత్వం దృష్టిలో, ప్రతి మరణం - అది పేద కుటుంబం నుండి అయినా లేదా ధనిక కుటుంబం నుండి అయినా, చాలా విలువైనదేనని, ఆయన పేర్కొన్నారు. సంస్థాగత సంస్కరణల అవసరాన్ని గురించి, మంత్రి పేర్కొంటూ, క్రమబద్ధమైన, దృఢమైన, సరళంగా అందుబాటులో ఉండే చట్టపరమైన, బీమా, ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు.

రహదారి వినియోగదారుల భద్రత, నగదు రహిత చికిత్స, పౌర మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల మెరుగుదల, బీమా అవసరం, పరిహార యంత్రాంగం, ప్రమాదం జరిగిన అనంతరం స్పందించవలసిన పర్యావరణ వ్యవస్థతో పాటు, వాటాదారుల ఏకీకరణలపై ఈ నివేదిక లో పేర్కొన్న సిఫార్సులు, మోటారు వాహనాల సవరణ చట్టం-2019 తో పాటు మోటారు వాహన నియమాలను సవరించడానికి - సహాయపడతాయని, మంత్రి అభిప్రాయపడ్డారు.

రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవడానికి ప్రస్తుతం దేశం మొట్టమొదటిసారిగా, “రహదారి భద్రతా మాసం” ని నిర్వహిస్తున్న సమయంలో, ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదలయ్యింది.

 

*****

 



(Release ID: 1697831) Visitor Counter : 209