ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

డిజీ లాకర్‌ ద్వారా డిజిటల్ బీమా పాలసీ పత్రాలు జారీ చేయాలని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచన


క్లెయిముల ప్రక్రియ, నగదు జారీ వేగవంతానికి, సమస్యలు, మోసాల తగ్గింపు ద్వారా చందాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఇది తోడ్పడుతుంది

Posted On: 12 FEB 2021 3:40PM by PIB Hyderabad

డిజీ లాకర్‌ ద్వారా డిజిటల్ రూపంలో బీమా పాలసీ పత్రాలు జారీ చేయాలని, ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ నెల 9వ తేదీన జారీ చేసిన ఒక ప్రకటనలో అన్ని బీమా సంస్థలకు సూచించింది. "బీమా రంగంలో డిజీ లాకర్‌ వినియోగాన్ని ప్రోత్సహించేలా, చందాదారులు బీమా పత్రాలను దాచుకునేందుకు డిజీ లాకర్‌ను ఉపయోగించేలా, అన్ని బీమా సంస్థలు వారి ఐటీ వ్యవస్థలను డిజీ లాకర్‌ సౌకర్యంతో అనుసంధానించుకోవాలి" అని ఆ ప్రకటనలో ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

బీమా సంస్థలు, తమ చందాదారులకు డిజీ లాకర్‌ గురించి తెలిపి, ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించాలని ఆ ప్రకటనలో ఐఆర్‌డీఏఐ సూచించింది. చందాదారులు తమ బీమా పత్రాలను డిజీ లాకర్‌లో దాచుకునేలా చేసే ప్రక్రియను బీమా సంస్థలు ప్రారంభించాలని కూడా పేర్కొంది. కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఈ-గవర్నెన్స్‌ విభాగం, డీజీ లాకర్‌ వినియోగంపై బీమా సంస్థలకు మార్గదర్శనం చేస్తుందని ప్రకటనలో వెల్లడించింది.

డిజిటల్‌ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన సౌకర్యమే డిజీ లాకర్‌. పౌరులు తమ వద్దనున్న పత్రాలన్నింటినీ డిజిటల్‌ రూపంలో ఇందులో దాచుకోవచ్చు. భౌతిక పత్రాల వినియోగాన్ని నివారించేందుకు దీనిని తీసుకొచ్చారు. దీనివల్ల, అవాంతరాలు లేని స్నేహపూర్వక, సమర్థవంతమైన సేవలు ప్రజలకు అందుతాయి.

బీమా రంగంలో ఖర్చులను, భౌతిక పత్రాలు అందలేదన్న ఫిర్యాదులను డిజీ లాకర్‌ తగ్గిస్తుంది. బీమా సేవల సమయంక్లెయిముల ప్రక్రియ, నగదు జారీని సమర్థవంతంగా మారుస్తుంది. వివాదాలు, మోసాలను తగ్గించి, చందాదారుల సంప్రదింపులను మెరుగు పరుస్తుంది. మొత్తంగా చందాదారులకు మంచి అనుభవాన్ని డిజీ లాకర్‌ పంచుతుందని భావిస్తున్నారు.

ప్రజల డిజీ లాకర్‌ ఖాతాలకు డిజిటల్ బీమా పాలసీ పత్రాలను జారీ చేయాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌కు, ఎలక్ట్రానిక్స్&ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లేఖ రాసిన నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. "డిజిటల్‌ బీమా పాలసీలను డిజీ లాకర్‌ ద్వారా చందాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా, వాటిని చెల్లుబాటు  పత్రాలుగా అంగీకరించేలా అన్ని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచించేలా చూడాలి. ఇది చందాదారుల బీమా పాలసీలను సురక్షితంగా ఉంచడంతోపాటు, ప్రామాణిక పద్ధతిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ, విలువైన మార్గంగా మారుతుంది" అని ఆ లేఖలో శ్రీ సంజయ్ ధోత్రే పేర్కొన్నారు.

బీమా పత్రం చందాదారుడికి, అతని కుటుంబానికి చాలా విలువైనది. బీమా పత్రాలను సకాలంలో వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల, డీజీ లాకర్‌ ద్వారా డిజిటల్‌ బీమా పత్రాలను అందించడం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.

***



(Release ID: 1697499) Visitor Counter : 169