ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ వజ్రోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 06 FEB 2021 1:39PM by PIB Hyderabad

కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ జీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎమ్ఆర్ షా జీ, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీమాన్ విక్రమ్ నాథ్ జీ, గుజరాత్ ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులు, గుజరాత్ హైకోర్టులోని గౌరవనీయ న్యాయమూర్తులు, భారత సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా జీ, గుజరాత్ అడ్వకేట్ జనరల్ శ్రీ కమల్ త్రివేదీ జీ, బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రియమైన సోదర, సోదరీమణులారా!
గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా మీ అందరికీ హార్దిక అభినందనలు. గత 60 ఏళ్లలో.. చట్టపరమైన అవగాహన, విషయంలో పాండిత్యం, మేధోసంపత్తి కారణంగా గుజరాత్ హైకోర్టు, బార్ కౌన్సిల్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయి. సత్యం, న్యాయాన్ని కాపాడేందుకు కర్తవ్యనిష్ఠతో చేసిన పని, రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వర్తించడంలో గుజరాత్ హైకోర్టు చూపించిన సంసిద్ధత.. భారతీయ న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది. గుజరాత్ హైకోర్టు అవిస్మరణీమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇవాళ ఓ పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థతో అనుసంధానమై ఉన్న ప్రతిఒక్కరికీ, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాజ్యాంగంలో ప్రస్తావించిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు కేటాయించిన గురుతరమైన బాధ్యత.. మన రాజ్యాంగానికి ప్రాణవాయువు లాంటిది. మన న్యాయవ్యవస్థ రాజ్యాంగం అందించిన ప్రాణవాయువును రక్షించే విషయంలో తనకు కల్పించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంపై ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు.
మన న్యాయవ్యవస్థ.. నిరంతరం మన రాజ్యాంగాన్ని నిర్మాణాత్మకంగా సానుకూల వివరిస్తూ.. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేసింది. భారతీయుల హక్కులను కాపాడుతూ వస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తినపుడు, అలాంటి వాతావరణం ఏర్పడినపుడు.. రంగంలోకి దిగి.. వ్యక్తిగత స్వేచ్ఛ హరించడకుండా చూడటం తన ప్రాథమిక బాధ్యతగా భావించి.. వాటిని పరిరక్షించింది. భారతీయ సమాజంలో.. అనాదిగా మన నాగరికత, సామాజిక నిర్మాణం, మన సంస్కృతి ఆధారంగానే న్యాయ ధర్మబద్ధమైన పాలన కొనసాగిందనే విషయం మీ అందరికీ తెలిసిందే. మన ప్రాచీన గ్రంథాల్లో ‘న్యాయమూలం సురాజ్యం స్యాత్’అని చెప్పబడింది. అంటే ధర్మబద్ధమైన పాలనతోనే సురాజ్యం సాధ్యమవుతుందని అర్థం. ఇదే సిద్ధాంతం అనాదిగా మన సంస్కారంలో భాగంగా ఉంది. ఈ మంత్రమే స్వాతంత్ర్య సంగ్రామంలో  మనకు ప్రేరణాత్మకంగా నిలిచింది, నైతిక బలాన్నిచ్చింది. ఈ ఆలోచనకే మన రాజ్యాంగ నిర్మాతలు కూడా రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ప్రాధాన్యతను కల్పించారు. మన రాజ్యాంగ పీఠిక కూడా ధర్మబద్ధమైన పాలన సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.
మన రాజ్యాంగంలోని ఈ భావనను, ఈ విలువలను మన న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త శక్తిని, కొత్త దిశను కల్పించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.  అందుకే మన న్యాయవ్యవస్థ.. ప్రతి సామాన్యుడి మదిలో అచంలచమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తోంది. న్యాయం కోసం పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తోంది. స్వాతంత్ర్యం సాధించిననాటినుంచి నేటి వరకు న్యాయవ్యవస్థ సాధించిన పాత్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇందులో బార్ కౌన్సిల్ పాత్రను కూడా మరిచిపోవద్దు. మన న్యాయవ్యవస్థ నిర్మాణంలో మన బార్ కౌన్సిల్ మూలస్తంభంగా నిలిచిందనడంలో సందేహంలేదు. దశాబ్దాలుగా మన న్యాయవ్యవస్థ, బార్ సంయుక్తంగా రాజ్యాంగ న్యాయసూత్రాలను పూర్తిచేయడంలో కృషిచేస్తున్నాయి. మన రాజ్యాంగం నిర్దేశించిన న్యాయం అనే భావనను,  భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా ఉన్న న్యాయాన్ని పొండం ప్రతి భారతీయుడి హక్కు. అందుకే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని, ప్రపంచ స్థాయి న్యాయ వ్యవస్థను నిలబెట్టేందుకు న్యాయవ్యవస్థ, ప్రభుత్వం సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరముంది. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం జరిగేలా.. అది కూడా సరైన సమయంలో జరిగేలా చొరవతీసుకోవడం న్యాయవ్యవస్థ బాధ్యత. ఇదే పద్ధతిలో సమాజంలోని చివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోంది. మన ప్రజాస్వామ్యం, మన న్యాయవ్యవస్థ కఠినమైన పరిస్థితుల్లోనూ సామాన్యులకు న్యాయం చేస్తూవారికి రక్షణగా నిలబడ్డాయి.
కరోనా మహమ్మారి సమయంలోనూ దీన్ని చూసే అవకాశం మరోసారి మనకు లభించింది. కరోనా ఆపద సమయంలో ఓవైపు దేశమంతా తన సామర్థ్యాన్ని కనబరుస్తుంటే.. మరోవైపు మన న్యాయవ్యవస్థ కూడా తన సమర్పణ భావాన్ని, కర్తవ్యనిష్ఠను కనబరిచింది. కరోనా ప్రారంభసమయంలో గుజరాత్  హైకోర్టు ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసుల విచారణను చేపట్టింది. ఇదే పద్ధతిలో ఎస్ఎంఎస్ కాల్-ఔట్, వ్యాజ్యాల ఈ-ఫైలింగ్, ‘ఈ-మెయిల్ మై కేస్ స్టేటస్’సేవ ప్రారంభం, కోర్టు వ్యవహారాలను యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూపించడం, రోజువారీ తీర్పులను, ఆర్డర్లను వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయడం మొదలైన కార్యక్రమాలు మన న్యాయవ్యవస్థ పరిస్థితులకు అనుగుణంగా ఎలా ముందుకెళ్తుందో వివరించేందుకు, న్యాయం అందించే విషయంలో తన ప్రయత్నాలను విస్తరించడంలో తీసుకున్న చర్యలకు ఉదాహరణగా నిలిచిపోయాయి.
కోర్టు ప్రోసీడింగ్స్‌ను లైవ్‌ స్ట్రీమింగ్ చేసే దిశగా గుజరాత్ హైకోర్టు మరో అడుగు ముందుకేసి ఈ దిశగా ప్రయత్నిస్తున్న తొలి కోర్టుగా నిలుస్తోందనే విషయాన్ని నాకు తెలియజేశారు. ఓపెన్ కోర్టు విషయంలోనూ దీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. దీన్ని కూడా గుజరాత్ హైకోర్టు సాకారం చేసి చూపింది. న్యాయమంత్రిత్వ శాఖ ‘ఈ-కోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్’ ద్వారా డిజిటల్ మౌలికవసతులను రూపొందించడం సంతోషకరమైన విషయం. తక్కువ సమయంలోనే మన కోర్టులను ఈ-కోర్టులుగా రూపాంతరం చేయడంలో జరిగిన కృషి అభినందనీయం. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా మన కోర్టులు, న్యాయవ్యవస్థ వేగంగా ఆధునీకరిచబడుతోంది. నేడు దేశంలో 18వేలకు పైగా కోర్టుల్లో కంప్యూటరీకరణ పూర్తయింది. టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి లభించిన తర్వాత అన్ని కోర్టుల్లో ఈ-ప్రొసీడింగ్స్ వేగవంతమయ్యాయి. మన సుప్రీంకోర్టు స్వయంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ నిర్వహించడం ద్వారా ప్రపంచంలో ఈ విధంగా విచారణలు నిర్వహిస్తున్న కోర్టుగా ఖ్యాతికెక్కడం మనందరికీ గర్వకారణం. మన హైకోర్టులు, జిల్లా కోర్టులు కూడా కరోనా సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులను విచారించడాన్ని ప్రారంభించాయి. కేసుల ‘ఈ-ఫైలింగ్’ సౌకర్యం.. సులభతర న్యాయాన్ని ఓ సరికొత్త కోణంలో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే విధంగా మన కోర్టుల్లో ప్రతి కేసుకు ప్రత్యేకమైన గుర్తింపు కోడ్, క్యూఆర్ కోడ్ కేటాయించబడుతున్నాయి. దీంతో ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్నయినా సులభంగా, వెంటనే తెలుసుకునేందుకు వీలవుతోంది. ఈ విధానం ‘నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్’కు కూడా బలమైన పునాదిని వేసింది. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ద్వారా న్యాయవాదులు, కక్షిదారులు కేవలం ఒక్క క్లిక్‌తో తమ కేసుకు సంబంధించిన ఆర్డర్లను చూడవచ్చు. కేసు విచారణ స్థాయికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలవుతోంది. సులభతర న్యాయం.. మన పౌరులను సులభతర జీవనం వైపు నడిపిస్తోంది. దీని ద్వారా మన దేశంలో సులభతర వాణిజ్యానికి కూడా మార్గం సుగమం అవుతోంది. తద్వారా.. భారతదేశంలో తమ న్యాయపరమైన హక్కులు భద్రంగా ఉంటాయని విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కలుగుతోంది. ప్రపంచబ్యాంకు 2018 సంవత్సరానికి గానూ విడుదల చేసిన ‘డూయింగ్ బిజినెస్ రిపోర్ట్’లోనూ ‘నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్’ను ప్రశంసించింది.
గౌరవనీయులారా,
రానున్న రోజుల్లో భారతదేశంలో సులభతర న్యాయం మరింత వేగంగా అందాలి. ఈ దిశగా సుప్రీంకోర్టు.. ఈ-కమిటీ, ఎన్ఐసీతో కలిసి పనిచేస్తోంది. బలమైన మౌలికవసతుల కల్పనతోపాటు.. క్లౌడ్ ఆధారిత వసతులు మొదలైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కృషి జరుగుతోంది. మన న్యాయవ్యవస్థలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దడంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఈ కృషికి జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృత్రిమ మేధ ద్వారా మన న్యాయవ్యవస్థ సామర్థ్యం మరింత పెరగడంతోపాటు.. న్యాయ విచారణ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఈ ప్రయత్నంలో ఆత్మనిర్భర భారత్ పథకం కీలకపాత్ర పోషించనుంది. ఈ పథకంలో భాగంగా వీడియో కాన్ఫరెన్సింగ్, టెలికాన్ఫరెన్సింగ్ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దేశంలో ఉన్న సాంకేతిక అంతరాన్ని తగ్గించేందుకు హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోనూ ఈ-సేవ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్లో నిర్వహించిన ‘ఈ-లోక్ అదాలత్’.. ఆ తర్వాత ఓ సరికొత్త సాధారణ అంశంగా మారిపోయింది.
యాదృచ్ఛికంగా.. గుజరాత్‌లోనూ 35-40 ఏళ్ల క్రితం జునాగఢ్‌లో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇవాళ ‘ఈ-లోక్ అదాలత్’.. సౌకర్యవంతంగా, సమయానుకూలంగా న్యాయాన్ని అందించేందుకు ఓ వేదికగా మారుతోంది. దేశంలోని 24 రాష్ట్రాల్లో ఇప్పటివరకు వ్యాజ్యాలు ఈ-లోక్ అదాలత్ ద్వారా జరుగుతున్నాయి. వాటి పరిష్కారం కూడా అక్కడే జరుగుతోంది. ఇదే వేగం, ఇదే సౌకర్యం, ఇదే విశ్వాసాన్ని మన న్యాయవ్యవస్థ కోరుతోంది. మరో ముఖ్యమైన అంశంలోనూ గుజరాత్ గర్వకారణంగా నిలుస్తోంది. అదేంటంటే.. ‘ఈవినింగ్ కోర్ట్’లను కూడా గుజరాత్‌లోనే మొదటిసారిగా ప్రారంభించారు. దీంతోపాటుగా పేదలకు లబ్ధి చేకూరేందుకు సరికొత్త కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఏ సమాజంలోనైనా.. నైతికత, నియమ నిబంధనల సార్థకత న్యాయం ఆధారంగానే నిర్వచించబడుతుంది. న్యాయంతోనే పౌరులు నిశ్చింతగా ఉండగలుగుతారు. ఎలాంటి ఆందోళనలు, ఆవేదనలు లేని సమాజమే అభివృద్ధి దిశగా ఆలోచిస్తుంది. ఆ అభివృద్ధి కోసం సరికొత్త సంకల్పంతో ముందుకెళ్తోంది.
మన న్యాయవ్యవస్థ, ఈ వ్యవస్థతో అనుసంధానమైన గౌరవనీయులైన భాగస్వాములంతా.. మన రాజ్యాంగంలోని న్యాయశక్తిని సశక్తం, సుదృఢం చేస్తారనే విశ్వాసం నాకుంది. న్యాయవ్యవస్థకు ఉండే ఈ శక్తే మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఆత్మనిర్భర భారత స్వప్నం.. మనందరి ప్రయత్నం, మన పురుషార్థం, మనందరి సమైక్య శక్తి, మనందరి బలమైన సంకల్ప శక్తితోనే సాధ్యమవుతుంది. ఈ శుభాకాంక్షలతో.. మీ అందరికీ మరోసారి గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
అనేకానేక శుభాకాంక్షలు.
ధన్యవాదములు!

 

***



(Release ID: 1696029) Visitor Counter : 129