ఆర్థిక మంత్రిత్వ శాఖ

భారతదేశ వృద్ధి పునరుద్ధరణలో ప్రైవేట్ రంగానికి కీలక పాత్ర ఉంది; ప్రభుత్వం మంచి ఫెసిలిటేటర్‌గా ఉంటుంది : కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

పారదర్శకత మరియు పన్ను స్థిరత్వం : ఈ ఏడాది బడ్జెట్టు కు కీలక మార్గదర్శక సూత్రాలు

Posted On: 05 FEB 2021 6:13PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, మాట్లాడుతూ,  మెరుగైన మూలధన వ్యయం కోసం, ప్రభుత్వం, కేంద్ర బడ్జెట్ 2021-22 ను, అందిస్తోందనీ, ఇది ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తుందనీ, పేర్కొన్నారు.  కేంద్ర బడ్జెట్ 2021-22 పై అవగాహన కోసం భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ), ఈరోజు ఇక్కడ  దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో, ప్రముఖ కంపెనీల  సి.ఈ.ఓ. లను ఉద్దేశించి, శ్రీమతి సీతారామన్  ప్రసంగించారు.

ప్రతిపాదిత అభివృద్ధి ఆర్థిక సంస్థ (డి.ఎఫ్.‌ఐ) కోసం ప్రభుత్వం కొంత మూలధనాన్ని అందించినప్పటికీ, డి.ఎఫ్.ఐ. కూడా మార్కెట్ నుండి మూలధనాన్ని సేకరిస్తుందని, ఆర్థిక మంత్రి వివరించారు.  దీనికి అదనంగా, డి.ఎఫ్.‌ఐ. బిల్లు ప్రైవేట్ డి.ఎఫ్.‌ఐ. లకు శాసనపరంగా సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా, నిరర్ధక ఆస్తుల (ఎన్.‌పి.ఎ) నిర్వహణ కోసం ఆస్తి పునర్నిర్మాణ సంస్థ (ఎ.ఆర్.‌సి)ను బ్యాంకులే స్వంతంగా, ప్రభుత్వ సహకారంతో, హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేస్తాయి.

బడ్జెట్ కోసం రూపొందించుకున్న,  కీలక మార్గదర్శక సూత్రాల గురించి, ఆర్ధికమంత్రి వివరిస్తూ, పారదర్శకతపై, ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు. కోవిడ్-19 పన్ను యొక్క అంచనాలకు విరుద్ధంగా, పెరిగిన పన్నుల కంటే అధిక రుణాలు తీసుకోవడం ద్వారా బడ్జెట్ ఉద్దీపనకు నిధులు సమకూర్చాలని, ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

ప్రైవేటు రంగానికి మౌలిక సౌకర్యాలు కల్పించే విద్యుత్తు, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి అధిక అవకాశాలు ఉన్న ప్రాంతాలపై ఒత్తిడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా,  ఆరోగ్య సంరక్షణ మరియు వ్యవసాయం ఇతర ప్రాధాన్యతలుగా ఉన్నాయని, ఆమె పేర్కొన్నారు.

ఈ విషయాలపై నిరంతర సంభాషణలు కొనసాగాలని, శ్రీమతి సీతారామన్ విజ్ఞప్తి చేస్తూ, ‘విధాన రూపకల్పనలో సమకాలీన ఆలోచన’ లను తీసుకురావడానికి, సి.ఐ.ఐ. తో తాను జరిపిన చర్చలు సహాయపడ్డాయని, పేర్కొన్నారు.  బడ్జెట్ ప్రతిపాదనలను ‘నిజాయితీగా అమలు’ చేస్తామని, కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు.

సి.ఐ.ఐ. అధ్యక్షుడు శ్రీ ఉదయ్ కోటక్, ఈ సందర్భంగా, బడ్జెట్ ప్రతిపాదనలపై పరిశ్రమ వర్గాల ప్రతి స్పందన గురించి తెలియజేస్తూ,  ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలను తీర్చగల అత్యుత్తమ విధాన పత్రానికి ఈ బడ్జెట్టు ఒక ఉదాహరణ, అని అభివర్ణించారు.  ఈ బడ్జెట్టును ధైర్యంగా ప్రకటించడాన్నీ, వృద్ధి, పారదర్శకతపై దృష్టి పెట్టడాన్నీ, ఆయన ప్రశంసించారు.  ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలనే మనస్తత్వాన్ని కలిగిన బడ్జెట్టు రూపకల్పన బృందాన్ని ఆయన అభినందించారు. అదేవిధంగా, మార్కెట్లను గౌరవించే విధంగా, బడ్జెట్టు ప్రతిపాదనలను రూపొందించినందుకు కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా,  శ్రీ కోటక్ మాట్లాడుతూ, నిజమైన గొప్ప భారతదేశాన్ని నిర్మించాలనే ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వంతో పాటు భారతదేశాన్ని మార్చడానికి ప్రైవేటు రంగం సహాయపడుతుందని, ఆర్థిక మంత్రికి భరోసా ఇచ్చారు.

ఈ చర్చా కార్యక్రమంలో - కేంద్ర ఆర్థిక, రెవెన్యూ శాఖ కార్యదర్శి, డాక్టర్ అజయ్ భూషణ్ పాండే;  కేంద్ర వ్యయ శాఖ కార్యదర్శి, శ్రీ టి. వి. సోమనాథన్;  కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్ తో పాటు,  దేశవ్యాప్తంగా 180 మందికి పైగా పరిశ్రమల అధిపతులు పాల్గొన్నారు.

****



(Release ID: 1695795) Visitor Counter : 118