జల శక్తి మంత్రిత్వ శాఖ
గోబర్ధన్ పేరిట సమీకృత వెబ్ పోర్టల్ ఆవిష్కరణ
ఉమ్మడిగా ప్రారంభించిన కేంద్ర మంత్రులు
Posted On:
03 FEB 2021 5:52PM by PIB Hyderabad
గోబర్ధన్ పేరిట రూపొందించిన ఒక సమీకృత వెబ్ పోర్టల్ (యూనిఫైడ్ పోర్టల్) ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్; కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్; కేంద్ర కేంద్ర జలశక్తి, మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఆ శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా కలసి ఈ పోర్టల్ ను ఉమ్మడిగా ప్రారంభించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ పోర్టల్ రూపకల్పనలో వివిధ కీలక భాగస్వామ్య వర్గాలుగా,.. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ, వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ వ్యవహరిస్తున్నాయి. కేంద్ర పశుసంవర్ధక శాఖకు చెందిన జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్‌డిడిబి), తదితర సంస్థల సారూప్య కార్యక్రమాలు. కొత్త ఏకీకృత విధానం ప్రకారం, పలు కార్యక్రమాలను, పథకాలను ఈ మంత్రిత్వ శాఖలు, సంస్థలు సమన్వయంతో చేపడుతున్నాయి. కొత్త జాతీయ బయోగ్యాస్, మెన్యూర్ మేనేజిమెంట్ కార్యక్రమం, బయో ఇంధన, సుస్థిర ప్రత్యామ్నాయ ఇంధన కార్యక్రమం, మరిన్ని సహకార కార్యక్రమాలను ఈ శాఖలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ స్వచ్ఛ భారత్ మిషన్ – గ్రామీణ విభాగం (ఎస్.బి.ఎం.-జి) కింద తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ సమన్వయం చేస్తుంది.
యూనిఫైడ్ పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కోసం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమం జనోద్యమంగా రూపుదాల్చిందని, గ్రామీణ భారతావనిలో పలు ప్రాంతాలను బహిరంగ మలవిసర్జన రహితంగా (ఒ.డి.ఎఫ్.గా) మార్చివేసిందని అన్నారు. అసాధారణమైన ఈ విజయాన్ని మరింత పురోగమనదిశగా తీసుకెళ్తూ, స్వచ్ఛ భారత్ గ్రామీణ కార్యక్రమం రెండవ దశను గత ఏడాది ప్రారంభించినట్టు తెలిపారు. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన రహిత లక్ష్యాలపై సుస్థిర ఫలితాలను సాధించడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేయడం వంటి అంశాలపై రెండవ దశలో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించినట్టు తెలిపారు. గ్రామాల్లో సమగ్ర స్థాయిలో పరిశుభ్రతను సాధించడం, ఒ.డి.ఎఫ్. ప్లస్ స్థాయిని సాధించడం ఈ పథకం లక్ష్యాలన్నారు. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దడంలో ఒ.డి.ఎఫ్. ప్లస్ స్థాయిని సాధించే కార్యక్రమంలో భాగంగా గోబర్ధన్ పేరిట కార్యక్రమాన్ని 2018వ సంవత్సరం తొలినాళ్లలో ప్రారంభించినట్టు కేంద్రమంత్రి తెలిపారు. గ్రామాల్లో పశువ్యర్థాలతోపాటుగా జీవసంబంధమైన వ్యర్థాలను బయోగ్యాస్ గా, సేంద్రియ ఎరువుగా మార్చివేసి, తద్వారా రైతులకు, ఇంటిల్లి పాదికీ ఆర్థిక వనరులు, ఇతర ప్రయోజనాలు అందించి గ్రామీణుల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. గోబర్ధన్ పథకానికి సంబంధించి కొత్తగా చేపట్టిన ఈ సమీకృత వ్యూహం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగస్వామ్య వర్గాలుగా వ్యవహరిస్తున్న వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సన్నిహిత సమన్వయ సంబంధాలు కొనసాగేలా ఈ కొత్త సమీకృత గోబర్ధన్ పోర్టల్ దోహదపడుతుందన్నారు. బయోగ్యాస్ పథకాలు, ఇతర కార్యక్రమాలు సజావుగా అమలయ్యేందుకు ఈ పోర్టల్ ఉపకరరిస్తుందన్నారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ,..గోబర్ధన్ కార్యక్రమానికి సంబంధించిన ‘చెత్తనుంచి సంపద’ అన్న భావనకు ఎంతో ప్రాముఖ్య ఉందన్నారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత పరిమాణంలో జీవసంబంధమైన వ్యర్థాలు ఉత్పన్నతమవుతూ ఉన్నాయని, ఆ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకుంటే మెరుగైన పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చని అన్నారు. జీవసంబంధమైన (బయో) వ్యర్థాలను ప్రత్యేకించి, పశువుల పేడను బయోగ్యాస్.గా, సేంద్రియ ఎరువుగా మార్చేందుకు సరైన పథకాలు, కార్యక్రమాలు అమలు చేసినపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గృహసంబంధమైన వనరుల పొదుపునకు ఇది దోహదపడుతుందన్నారు. తమ శాఖ ద్వారా విజయవంతంగా చేపట్టిన సహకార పథకాల నమూనాలను గిరిరాజ్ సింగ్ ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ పథకాల కింద గోశాలలను, పాల సహకార సంఘాలను బయోగ్యాస్ యూనిట్లతో అనుసంధానించినట్టు చెప్పారు.
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బయోగ్యాస్ పథకాల స్థూల లక్ష్యాలను, ధ్యేయాలను వివరించారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ (సి.బి.జి.)ను ఉత్పత్తికోసం ప్లాంట్ల ఏర్పాటు, యాంత్రిక వినియోగంలో బయో ఇంధనం వినియోగానికి తగిన అనుసంధానం వంటి అంశాల్లో విజయవంతమైన నమూనాలను చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి దేశనవ్యాప్తంగా ప్రయోగాత్మక పథకాలను చేపడుతున్నారని, దీనివల్ల రైతుల ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడటంతోపాటుగా, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని సాధించవచ్చని అన్నారు.
కేంద్ర వ్యవసాయ, రైతుంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, వివిధ రకాల బయోగ్యాస్ పథకాలు, నమూనాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గోవర్ధన్ సమీకృత వెబ్ పోర్టల్ దోహదపడుతుందన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ పథకం రెండవ దశలో ప్రధానంగా పేర్కొన్న ఒ.డి.ఎఫ్. ప్లస్ లక్ష్య సాధనకు, గోబర్ధన్ పథకం విజయవంతం కావడమే కీలకమన్నారు. ఈ పథకం ఘన వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడంతోపాటుగా, గ్రామాల్లో జీవనోపాధి అవకాశాలను పెంపొందిస్తుందని అన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీటి పారిశుద్ధ్య శాఖ (డి.డి.డబ్యు.ఎస్.) కార్యదర్శి పంకజ్ కుమార్ మాట్లాడుతూ, సమీకృత గోబర్ధన్ పోర్టల్, అనుబంధ పథకాల అమలులో భాగస్వామ్యంతో పనిచేస్తున్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను అభినందించారు. ఈ విషయంలో పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామాలు అన్న ఉమ్మడి లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల బృందాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. గోబర్ధన్ పథకం ముఖ్య ప్రయోజనాలను, లక్ష్యాలను, మార్గదర్శ సూత్రాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
గోబర్ధన్ పథకం సమీకృత వెబ్ పోర్టల్ లింక్ http://sbm.gov.in/gbdw20
*****
(Release ID: 1695045)
Visitor Counter : 330