సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
30ఏళ్ల కిందట బోడో తిరుగుబాటుదారులు ధ్వంసం చేసిన అస్సాంలోని అతి పురాతన ఖాదీ సంస్థను పునరుద్ధరించిన కెవిఐసి
Posted On:
28 JAN 2021 3:08PM by PIB Hyderabad
దాదాపు 30 ఏళ్ళ బోడో తిరుగుబాటు కారణంగా గాయపడి, విధ్వంస స్థితిలో మిగిలిన అస్సాంలోని పురాతన ఖాదీ పరిశ్రమలను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) తిరిగి సజీవం చేసింది. అస్సాంలోని బక్సా జిల్లాలోని కవాలీ గ్రామంలోని ఖాదీ వర్క్‌షెడ్‌ను 1989లో బోడో తిరుగుబాటుదారులు అగ్నికి ఆహుతి చేశారు. దీనిని కెవిఐసి సిల్క్ రీలింగ్ కేంద్రంగా పునరుద్ధరించింది. దాదాపు 15 మహిళా చేతిపనివారు,5గురు ఇతర సిబ్బందితో ఫిబ్రవరి రెండవ వారంలో వడకడం, నేత కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.
ఈ వర్క్‌షెడ్‌ను తమూల్‌పూర్ ఆంచలిక్ గ్రామ్‌దాన్ సంఘ్ అనే ఖాదీ సంస్థ నిర్మించింది. చైనా 1962లో దాడి చేసిన అనంతరం ఆ సంస్థ అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు తరలివెళ్ళింది. ఆవ నూనె ఉత్పత్తితో తన ఉత్పత్తిని ప్రారంభించి, 1970 నాటికి, నూలు వడకడం, నేత పని అక్కడి 50 చేతివృత్తుల పనివారి కుటుంబానికి జీవనోపాధిని కల్పించడం ప్రారంభించింది. అయితే, 1989లో అతివాదులు ఈ షెడ్‌ను తగులబెట్టడంతో విషాదం నెలకొంది. అప్పటి నుంచి అది క్రియారహితంగా మిగిలిపోయి ఉంది.
ఖాదీ వర్కషెడ్‌ను పునరుద్ధరించడం చారిత్రిక ప్రాముఖ్యతను సంతరించుకుందని, ఖాదీ కార్యకలాపాలు పునః ప్రారంభం కావడం స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని కెవిఐసి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా చెప్పారు. తొలుత కెవిఐసి, అస్సాంకు చెందిన సొగసైన ఎరి సిల్క్ రీలింగ్ కేంద్రంగా దీనిని అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్తులో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి వంటి ఇతర ఖాదీ కార్యకలాపాల ఉత్పత్తిని ప్రారంభిస్తుందన్నారు. ఈ కేంద్రం స్థానిక చేతిపనివారికి ప్రధానమైన ఉపాధి సృష్టికర్త అవుతుందని సక్సేనా చెప్పారు. ఈ చొరవ గాంధేయ మూల సూత్రమైన గ్రామీణ పునరుజ్జీవనాకి, అదే సమయంలో ప్రధానమంత్రి దార్శనికత అయిన -సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌తో అనుసంధానమై ఉంటుందని సక్సేనా వివరించారు.
ఈ ఖాదీ షెడ్ గువాహతి నుంచి 90కిమీ దూరంలో ఉంది. ఈ వర్క్‌షెడ్‌ను కెవిఐసి అందించిన ఆర్థిక సాయంతో పునరుద్ధరించారు. ఖాదీ చేతిపనివారికి మెరుగైన పని పరిస్థితులను అందించి, అంతిమంగా వారి ఉత్పాదకతను మెరుగుపరచడమే ఈ వర్క్‌షెడ్ పథకం వెనుక ఉద్దేశం. గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిషా, తమిళనాడులో మూలపడి ఉన్న ఖాదీ సంస్థలను ఇటీవలి సంవత్సరాలలో కెవిఐసి పునరుద్ధరించింది.
***
(Release ID: 1693040)
Visitor Counter : 194