ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ సమావేశం

‘‘కోవిడ్ టీకాలు కనుగొన్న ఏడాది 2020; ప్రపంచంలో అత్యవసరమైన వారికి దీన్నందించే సవాలును ఎదుర్కోవాల్సిన సంవత్సరం 2021’’;

‘డ‌బ్ల్యూహెచ్‌వో’లో భాగస్వామిగా కొనసాగాలన్న అమెరికా నిర్ణయంపై హర్షం; రోగనిరోధకత కల్పన కార్యక్రమం-2030కి ఏకగ్రీవ ఆమోదం

Posted On: 27 JAN 2021 11:00AM by PIB Hyderabad

   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) కార్యవర్గ 148వ సమావేశం నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ డిజిటల్ మార్గంలో అధ్యక్షత వహించారు. ఈ సమావేశం చివరన ఆయన తుది పలుకులివి:

మాననీయులు, విశిష్ట ప్రతినిధులు, సహ-ఉపాధ్యక్షులు, మాధ్యమాల పాత్రికేయులు, డైరెక్టర్ జనరల్, ప్రాంతీయ డైరెక్టర్లు, గౌరవనీయ భాగస్వాములు తదితరులకు అభివాదం!

   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) కార్యవర్గ 148వ సమావేశం విజయవంతం కావడంలో ఎంతో నిబద్ధతతో, ఉత్సాహంతో పాల్గొన్న మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నా ప్రసంగం ప్రారంభిస్తున్నాను. ప్రత్యక్షంగా కాకుండా వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా సాగిన ఈ సమావేశంలో వివిధ కాల మండలాలకు చెందిన దేశాల ప్రతినిధులు పాల్గొనడం హర్షదాయకం. అలాగే భారీ భవిష్యత్ కార్యక్రమ నిర్వహణలో అడ్డంకులు అధిగమించేందుకు సంసిద్ధత తెలపడమేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతు పలకడంపై సభ్యదేశాలన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

   అంతర్జాతీయంగా ఎన్నో స‌మ‌స్య‌లు, స‌వాళ్లు ఉన్నప్పటికీ మ‌నం అద్భుతంగా పురోగమిస్తున్నాం. అదే స‌మ‌యంలో మాన‌వాళి చ‌రిత్ర‌లో తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్న నేప‌థ్యంలో రాబోయే రెండు ద‌శాబ్దాల్లో మ‌నం కొన్ని అత్య‌వ‌స‌ర ఆరోగ్య స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఏడాది కింద‌ట‌ కోవిడ్‌-19ను మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించాక దీనిపై మ‌నం సాహసోపేతంగా పోరాడాం. దీన్ని నిరోధించే సామూహిక‌ ప్ర‌య‌త్నాల్లో విస్తృత అస‌మాన‌త‌లున్నా ముందస్తు, చురుకైన, సహకారాత్మ‌క వ్యూహంతో మ‌న‌మిప్పుడు మహమ్మారి నిర్మూలన దిశగా ముందంజ వేస్తున్న నేపథ్యంలో సభ్య దేశాలన్నిటికీ మరోసారి కృతజ్ఞతలు.

   హమ్మారిపై యుద్ధంలో భాగంగా వ్యాధి పీడితుల ప్రాణరక్షణ కోసం ఎంతో సాహసంతో తమ జీవితాలను ఎదురొడ్డిన ముందువరుస యోధుల త్యాగాలను గౌరవిస్తూ వారిని మరోసారి స్మరించడం మన కర్తవ్యం. మరోవైపు మహమ్మారి విజృంభణసహా దాని ఫలితంగా కమ్ముకున్న చీకట్లను చీలుస్తూ శాస్త్రవేత్తలు విజ్ఞానజ్యోతిని ప్ర‌కాశింప‌జేసిన సంవ‌త్స‌రంగానూ 2020ని మ‌నం గుర్తుంచుకోవాలి. ఈ దిశగా ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, వితరణశీల సంస్థలు వారికి వనరులు సమకూర్చడంలో సంపూర్ణ సహకారం అందించడం గర్వకారణం. ఆ మేరకు శాస్త్రవిజ్ఞాన ప్రగతి మాత్రమేగాక అంతర్జాతీయంగా వెల్లివిరిసిన అపూర్వ సహకార స్ఫూర్తి విస్తృత ప్రయోజనాలను అందించింది. అయితే, ఈ సహకార ఫలాలు ప్రపంచ ప్రజలందరికీ సమానంగా అందాలన్నది నా అభిప్రాయం.

   డచిన 2020 కోవిడ్ టీకాలను కనుగొన్న ఏడాది కాగా, ప్రపంచంలో ఇది అత్యవసరంగా ఇవ్వాల్సినవారికి అందించే సవాలును ఎదుర్కోవాల్సిన సంవత్సరంగా 2021ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ కృషిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ముఖ్యంగా టీకాలపై వదంతులను తిప్పికొట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి.. ముఖ్యంగా యువతను ఉత్తేజితం చేయగల బహుళరంగ భాగస్వాములను ప్రోత్సహించాలి. మొత్తంమీద గత వారం చర్చా కార్యక్రమంలో అనేక విస్తృత అంశాలపై మనం చర్చించాం. వీటిలో కొన్ని ముఖ్యమైనవాటిని ప్రస్తావిస్తాను... ‘‘అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య అంశాల పరిష్కారం’’ ఎంతో ప్రయోజనకరం.

   నం తీసుకున్న చర్యలనుంచి నేర్చుకున్న పాఠాలు- దశ, దిశల  దిద్దుబాట్లకు, కీలక సామర్థ్యాల విస్తరణసహా ఆరోగ్య సమాచార వ్యవస్థలతోపాటు నివేదన యంత్రాంగాల బలోపేతానికి ఉపయోగపడతాయని మన ఫలవంతమైన చర్చల్లో స్పష్టమైంది. అలాగే డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర కార్యక్రమం అమలుకు సంబంధించి క్షేత్ర, దేశ, ప్రాంతీయ,  ప్రధాన కార్యాలయ స్థాయులలో స్పష్టమైన బాధ్యతలతో మరింత జవాబుదారీ భద్రత వ్యవస్థ ఏర్పాటుపై మీ సిఫారసులను అభినందిస్తున్నాను. దీంతోపాటు మరింత విస్తృత, సరళ, అంచనాలకు అనుగుణ నిధుల సమీకరణకూ అత్యంత ప్రాధాన్యం ఉందని స్పష్టం చేస్తున్నాను. ‘‘ముప్పుగల ప్రపంచం’’ నుంచి ‘‘అస్వస్థ ప్రపంచం’’దాకా సంసిద్ధత లోపించిన ఈ ప్రపంచంలో వ్యవస్థలతోపాటు ఆర్థిక తోడ్పాటు దిశగా అసమతౌల్యాన్ని అంతర్జాతీయ సంసిద్ధత పర్యవేక్షక సంస్థలు స్పష్టం చేశాయి. అందువల్ల అత్యవసర ఆరోగ్య సంసిద్ధత-ప్రతిస్పందన వ్యవస్థకు అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం, జాతీయ-రాష్ట్ర స్థాయులలో పరస్పర సహకారం కేంద్రబిందువు కావాలన్నది నా అభిప్రాయం.

   ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్కరణ, బలోపేతం దిశగా అంచనాలు, ఆర్థిక వనరులకు సంబంధించి సహజంగానే సభ్యదేశాలు నాయకత్వం వహించాలి. ఇక లైంగిక దోపిడీ- దుర్వినియోగం నివారణపైనా శక్తిమంతమైన చర్చ సాగింది. ఆ మేరకు డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్య సమితి అంతర సంస్థల అమలు భాగస్వాములతో సంయుక్తంగా పనిచేస్తూ, సంబంధిత విధానాలను మెరుగుపరచాలని నిర్ణయించబడింది. డబ్ల్యూహెచ్ఓపై అంచనాలు, దాని సేవాప్రదాన సామర్థ్యాల మధ్య అంతరం గురించి మీలో కొందరు ప్రముఖంగా ప్రస్తావించడాన్ని అభినందిస్తున్నాను. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ప్రభావం పరివర్తనాత్మక చర్యలకు సంబంధించి కార్యక్రమ బడ్జెట్, ఫలితాల నివేదన చట్రం ప్రక్రియ తదితరాలపై స్పష్టమైన మార్గ ప్రణాళిక ఉండాలని ఈ సమావేశానికి అభ్యర్థన అందింది.

   రోవైపు బైడెన్-హ్యారిస్ పాలన యంత్రాంగం తరఫున అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఈ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా ఇకపైనా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాకుండా తన ఆర్థిక బాధ్యతలను నెరవేరుస్తుందని, సహకార వ్యవస్థలుసహా అన్ని స్థాయులలో నిరంతర సాంకేతిక సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కార్యవర్గ అధ్యక్ష హోదాలో భారత ప్రతినిధిగా అమెరికా తరఫున డాక్టర్ ఫౌసీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాను. సంస్థనుంచి నిష్క్రమించే ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం నిలిపివేయడంపై హర్షం ప్రకటిస్తున్నాను. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ చెప్పినట్లు ‘‘ఈ సంస్థ సభ్యదేశాలతో కూడిన ఓ కుటుంబం... ఇది మనుగడ కొనసాగించాలంటే అన్నిదేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరం.’’

   సాంక్రమిక వ్యాధుల నివారణకు నిధుల నిరంతర కొరత నేపథ్యంలో దీనిపైనా దృష్టి సారించాలని సభ్యదేశాలు పిలుపునివ్వడం సమంజసమే. ఆ మేరకు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల విషయంలోనేగాక అంతర్జాతీయంగానూ ముందడుగు వేయడానికి ఆవిష్కరణలు, మేధోహక్కులను సామూహికంగా సమన్వయం చేసుకోవడం నిస్సందేహంగా అవసరం. ఆరోగ్య సంరక్షణ రంగంలో శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణల్లో అధికశాతం ధనిక దేశాలకే పరిమితం కావడం కూడా కఠిన వాస్తవం. ఈ పరిస్థితుల నడుమ ఆరోగ్యం-సామాజిక నిర్ణయాత్మకతలపై సభ్య దేశాలు నివేదిక సమర్పించడం, ముసాయిదా తీర్మానానికి మద్దతివ్వడం, అందరికీ ఆరోగ్యం ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పడంపై నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను.

   ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరిస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య వ్యూహాలు, ప్రణాళికలకు మరో ఏడాదికల్లా కాలం తీరనున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలనకు కార్యవర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ ప్రజారోగ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన ‘‘రోగ నిరోధక కార్యక్రమం-2030’’కిగల పోషించగల పాత్రను గుర్తిస్తూ సభ్యదేశాలు ఏకగ్రీవంగా దానికి ఆమోదం తెలపడాన్ని కార్యవర్గం స్వాగతించింది. అదే సమయంలో కోవిడ్-19 టీకాలు అందరికీ త్వరగా, సమానంగా అందేవిధంగా చూడాలని కూడా సభ్యదేశాలు విజ్ఞప్తి చేశాయి. ఇక 1994లో పోలియోరహిత భారతం గురించి నేను ఎన్నో కలలు కన్నాను. ప్రపంచ పోలియో బాధితులలో 60 శాతం అప్పట్లో మా దేశంలోనే ఉండేవారు. అయితే, అనేక స్వచ్ఛంద సంస్థలతోపాటు, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తోడ్పాటుతో 1994 అక్టోబరు 2న న్యూఢిల్లీలో పోలియోరహిత భారతంవైపు పయనం ప్రారంభించగా నేడు పోలియోను పూర్తిగా నిర్మూలించాం. దేశంలో చివరి కేసు 2011 జనవరిలో నమోదు కావడం ఇందుకు నిదర్శనం.

   ప్రస్తుత అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా ‘‘సమాజం మొత్తానికీ ఊపిరి పోయడం’’లో ఎంతగానో సహకరించిన ప్రపంచ పౌరులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రశంసలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషికి మార్గనిర్దేశం చేయడంలో ప్రతినిధులు, పాల్గొన్న భాగస్వాముల సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. నేడు ప్రతి సందర్భం, ప్రతి ప్రదేశం సురక్షితం అయ్యేదాకా ఏదీ సురక్షితం కాదు! ఈ వారంలో మేం పునరుద్ఘాటించిన కార్యక్రమాల ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ విజయం సాధించేలా వాటి నిర్వహణను, భవిష్యత్తును బలోపేతం చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఈ మాటలతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తూ ఈ కార్యవర్గ 148వ సమావేశం పూర్తయినట్లు ప్రకటిస్తున్నాను.

 

ధన్యవాదాలు – అందరికీ నమస్కారం!

 

****



(Release ID: 1692721) Visitor Counter : 159