ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఐసిఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవానికి అధ్యక్షత వహించిన డాక్టర్ హర్ష వర్ధన్

జాతీయ అంటువ్యాధేతర జబ్బుల పర్యవేక్షణ సర్వే; కాన్సర్, మధుమేహం

గుండె సంబంధ వ్యాధులకు టెలిమెడిసిన వాడకం ఆవిష్కరణ

సైన్స్, సైంటిస్టుల సంవత్సరం 2020: కోవిడ్ నియంత్రణలోఐసిఎంఆర్ కు అభినందనలు

శారీరక వ్యాయామంపై అవగాహనతో అంటువ్యాధేతర జబ్బుల నియంత్రణ

Posted On: 25 JAN 2021 2:58PM by PIB Hyderabad

భారత వైద్య పరిశోధనామండలి వ్యవస్థాపక దినోత్సవం, బెంగళూరులోని ఐసిఎంఆర్ – బెంగళూరులోని వ్యాధి సమాచార, పరిశోధన జాతీయకేంద్రం దశాబ్దం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు. అంటువ్యాధేతర జబ్బుల మీద అతిపెద్ద, సమగ్ర సంకలనాన్ని, టెలిమెడిసిన్ సాయంతో కాన్సర్, మధుమేహం, గుండె సంబంధ వ్యాధుల నివారణకు ఒక చట్రం రూపకల్పన ఫలితాలను కూడా విడుదల చేశారు.  

ఈ సందర్భంగా డాక్తర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణలో చేసిన కృషికి గాను మొత్తం దేశం తరఫున ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2020 సంవత్సరం కోవిడ్ కారణంగా నిరాశాపురితమైన జ్ఞాపకాలను మిగిల్చిందని, అదే సమయంలో అది ఆశను కూడా రేకెత్తించిందని అన్నారు. ఇది శాస్త్రవేత్తల, శాస్త్రవిజ్ఞాన సంవత్సరం అని కూడా ఆయన గుర్తు చేశారు. వ్యాధి నిర్థారణ పరీక్షల కిట్స్ కోసం పెరుగుతున్న వత్తిడిని తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో కిట్స్ తయారు చేయటం మాత్రమే కాకుండా, పరిస్థితిని పూర్తిగామార్చివేస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి చేయగలిగే స్థితికి తీసుకువచ్చారన్నారు.  భారత దేశం ఇప్పుడు రెండు వాక్సిన్లు తయారుచేసి అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థితిలో ఉండటం గర్వకారణమన్నారు.   ఈ అద్భుత సాధనకు మొత్తం శాస్త్రజ్ఞులను అభినందించాలని చెప్పారు.  

దేశవ్యాప్తంగా జరిపిన జాతీయ అంటువ్యాధేతర జబ్బుల సర్వే నివేదికతోబాటు కాన్సర్ ఆనవాలు పసిగట్టే మార్గం కూడా కనిపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు. దేశంలో కాన్సర్ వ్యాధి మీద నిఘా పెంచటానికి జాతీయ కాన్సర్ నమోదు కార్యక్రమం చాలా విలువైన పనిముట్టుగా ఆయన అభివర్ణించారు. ఈ సమాచారం ఆధారంగా తీసుకునే చర్యలవలన కాన్సర్ సమస్యను సమర్థంగా పరిష్కరించె వీలు కలుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద  భారీ వ్యాధి నిర్థారణ శిబిరాలు ఏర్పాటు చేసి అసాధారణమైన కాన్సర్ లక్షణాలను కూడా గుర్తించగలుగుతామని చెప్పారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించే క్రమంలో అవసరమైన చట్టపరమైన చర్యలను కూడా గుర్తించాలని ఆరోగ్య పరిశోధన కార్యదర్శిని కోరారు.  

2017-18 మధ్య జరిగిన అధ్యయనంలో వెల్లడైన కీలకమైన అంశాలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. విశ్వసనీయమైన ప్రాథమిక సమాచారం సేకరించటం ద్వారా కార్యాచరణ పథకాన్ని రూపొందించటం దీని లక్ష్యం. ప్రామాణిక నమూనాలను వాడుకుంటూ ఇలాంటి సమగ్ర సర్వే జరపటం ఇదే మొదటి సారి. 15-69 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలను, పురుషులను, పట్టణ ప్రాంత, గ్రామీణ వాసులను ఎంచుకొని 28 రాష్ట్రాలలో 348 జిల్లాలలో  600 మంది చొప్పున ప్రాథమిక శాంపిల్ గా ఎంచుకొని ప్రతిష్ఠాత్మక సంస్థల సాయంతోఈ సర్వే చేశారు.  

ఈ సర్వే వలన అంటువ్యాధులు కాని  జబ్బులు రావటానికి ఉన్న అవకాశాలను తెలుసుకోవటానికి  వీలవుతుందని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. దీనివలన ఈ జబ్బుల నియంత్రణకు, చికిత్సకు వీలవుతుందని గుర్తు చేశారు. క్రమం తప్పకుండా నిఘా కొనసాగించటం ద్వారా వ్యాధి నివారణకు సకాలంలో చర్యలు తీసుకోవచ్చునని అన్నారు.  కాన్సర్, మధుమేహం, గుండె సంబంధ వ్యాధుల నియంత్రణలో టెలీ మెడిసిన్ వినియోగం ద్వారా టెలీ సంప్రదింపులు, టెలీ పర్యవేక్షణ  జరుపుకోవచ్చునన్నారు. దీని ఆధారంగా బహుముఖ వ్యూహం అనుసరించి వ్యాధులను సకాలంలో నియంత్రించగలుగుతామన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువెళ్లటానికి ఇది సరైన మార్గమని దాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు.  

ఉమ్మడి చర్యలు మరింత బలంగా చేపట్టాల్సిన అవసరముందని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఎయిమ్స్ జజ్జర్ కాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారైంది.  వైద్యుల మధ్య, పరిశోధకుల మధ్య సహకారం పెంచుకోవటానికి వీడియో కాన్ఫరెన్స్ లాంటి పద్ధతులు వాడుకొవాలి. కోవిడ్ సమయంలో విజయవంతంగా సాగిన ఈ ప్రక్రియను గరిష్ఠంగా వాడుకోవాలి. “ అన్నారు.

ఆరోగ్యమంత్రి తన ప్రసంగాన్ని ఒఅక్ హెచ్చరికతో ముగించారు. “ కొన్నేళ్ల కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ  చేసిన సర్వె ప్రకారం అంటువ్యాధి కాని 45% జబ్బులకు కారణం శారీరక వ్యాయామం లేకపోవటమే.  ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రజలలో ఈ విషయంలో ఏ చేయాలో అవగాహన పెంచగలిగాం. దీన్ని మరింత ఉద్ధృతం చెయ్యాలి. మరిన్ని జిమ్ లు, వ్యాయామ కేంద్రాలు పెట్టటం వలన ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం తగ్గుతుంది. “ అన్నారు.

ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్, ఆరోగ్య పరిశోధనా విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ బలరామ్ భార్గవ, ఆరోగ్య పరిశోధనావిభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనూ నాగర్, ఐసిఎంఆర్ లో అంటురోగాలు కాని వ్యాధుల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఎస్ ధలీవాల్, ఇసిడి విభాగం దైరెక్టర్  డాక్టర్ సమీరన్ పాండా, ఆర్ ఎం పిసిసి డైరెక్టర్ డాక్టర్ రజనీకాంత్ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసిఎంఆర్- ఎన్ సి డి ఐ ఆర్ డైరెక్టర్ దాక్టర్ ప్రశాంత్ మాథుర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

****



(Release ID: 1692263) Visitor Counter : 210