వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వేసవి కాల వ్యవసాయ ప్రణాళికపై జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శ్రీ పరషోత్తం రూపాల
తక్కువ కాలంలో చేతికి వచ్చే పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలను పండించడం, నూతన వ్యవసాయ పద్దతులను అనుసరించడం ద్వారా రైతుల ఆదాయం పెరిగేలా చూడడానికి ప్రాధాన్యత

సదస్సులో పాల్గొన్న రాష్ట్రాల వ్యవ్యసాయశాఖ ముఖ్య కార్యదర్శులు, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు

Posted On: 22 JAN 2021 5:59PM by PIB Hyderabad

వేసవి కాలంలో సాగే వ్యవసాయ కార్యక్రమాల్లో పంటల దిగుబడిని అధికం చేసి రైతులకు మరింత ఆదాయాన్ని సమకూర్చడానికి అనుసరించవలసిన ప్రణాళికపై శుక్రవారం ( జనవరి 22) జాతీయ సదస్సును నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీ పరషోత్తం రూపాల పాల్గొన్నారు. గత పంట కాల కార్యక్రమాలను సమీక్షించి రానున్న పంట కాలంలో సాధించవలసి ఉన్న లక్ష్యాలను ఈ సదస్సులో చర్చించి ప్రణాళికను రూపొందిస్తారు. తక్కువకాలంలో చేతికి వచ్చే పంటలను పండించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తక్కువ కాలంలో చేతికి వచ్చే పప్పుధాన్యాలు, నూనెగింజలను ఆధునిక వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ సాగు చేసి రైతుల ఆదాయాన్ని మరింత పెంచడానికి అమలు చేయవలసిన కార్యక్రమాన్ని సదస్సులో ఖరారు చేయనున్నారు. రాష్ట్రాలకు పూర్తి సహాయసహకారాలను అందిస్తూ, వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలను ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సదస్సులో రాష్ట్రాల వ్యవ్యసాయశాఖ ముఖ్య కార్యదర్శులు, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

వేసవి పంట కాలంలో 51 లక్షల పప్పుధాన్యాలు, నూనెగింజలు, పౌష్ఠిక విలువలు కలిగిన చిరు ధాన్యాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2019-20లో రికార్డు స్థాయిలో 296.65 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు, 319.57 మిలియన్ టన్నుల ఉద్యాన పంటల దిగుబడి ఉంటుందని ముందస్తు అంచనాల ద్వారా వెల్లడయింది. 23.15 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు, 33.42 మిలియన్ టన్నుల నూనెగింజలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు. 354.91 లక్షల పట్టి బేళ్ల దిగుబడిని సాధించి ప్రపంచంలో ఈ రంగంలో అగ్రస్థానం సాధించేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఉత్పత్తి దిగుబడుల అంశంలో ఈ ఏడాది సంప్రదాయ ఆహార ధాన్యాల రంగంతో పోల్చి చూస్తే ఉద్యానవన రంగంలో దిగుబడులు ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఏడాది భారతదేశ వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించింది. రైతులు పడిన శ్రమకు ప్రభుత్వ సహకారం తోడవడంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు పంటల దిగుబడి పెరిగింది. 2020-21లో వ్యవసాయ రంగానికి కేంద్రం భారీగా నిధులను కేటాయించడంతో నిధుల కొరత ఎదురవలేదు. రానున్న కాలంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పటిష్ట ప్రణాలికను అమలు చేయాలని నిర్ణయించారు. వేసవిలో పంటల దిగుబడిని ఎక్కువ చేయడం వల్ల దేశ అవసరాలకు అవసరమైన ఆహారధాన్యాలు లభించడంతో పాటు పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా చూడడమే కాకుండా రైతుల ఆదాయం గణనీయంగా పెరగడానికి ఆస్కారం కలుగుతుంది.

వ్యవసాయరంగం స్వయంసమృద్ధి సాధించేలా చూడడానికి అవసరమైన ప్రణాళికలను అమలు చేసి, పంటల దిగుబడిని ఎక్కువ చేయడానికి దోహద పడే వ్యవసాయ సాంకేతికతను అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం వ్యవసాయ దిగుబడులను ఎక్కువ చేయడానికి మాత్రమే కాకుండా వాటికి మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించి ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. వేసవి పంటకాలానికి ప్రాధాన్యత ఇస్తూ అదనపు సీజన్ లో అదనపు దిగుబడి, రైతుకు అదనపు ఆదాయం అన్న నినాదంతో కేంద్రం ప్రణాళికను అమలు చేస్తుందని ఆయన అన్నారు.

 

****(Release ID: 1691348) Visitor Counter : 42