సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఓటిటి, టీవీ ఛానళ్ల పోటీని తట్టుకుని చలనచిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుంది : జిపి విజయకుమార్

ప్రపంచవ్యాపితంగా ప్రేక్షకులను పొందటానికి సగటు మరియు చిన్న బడ్జెట్ చిత్రాలకు ఓటిటి సహకరిస్తుంది '

వృత్తిపరమైన అంకితభావంతో సినిమాలు తీయడానికి ఎక్కువ మంది నిర్మాతలుముందుకు రావాలి ”

ఓటిటి, టీవీ ఛానళ్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని చలనచిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుందని ప్రముఖ నిర్మాత మళయాళ చిత్రాల పంపిణీదారుడు జి పి విజయకుమార్ స్పష్టం చేశారు. గోవాలో జరుగుతున్న 51వ అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనలో భాగంగా ' భారత చలన చిత్ర నిర్మాణంలో వస్తున్న మార్పులు' అనే అంశంపై ఆయన ఈ రోజు ( జనవరి 20) ప్రసంగించారు.

 

"ఓటిటి తొలిసారిగా వచ్చినప్పుడు దానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓటిటి వల్ల సినిమా థియేటర్లలో సినిమాలు విడుదల కావని చలనచిత్ర వ్యాపారాలు మూతపడతాయని భావించారు. అయితే ఓటిటి, టీవీ ఛానళ్లు ప్రతి ప్రాంతంలో ఉన్నప్పటికీ సాంప్రదాయ చిత్ర పరిశ్రమ, థియేటర్లు మరియు బ్లాక్ బస్టర్ సినిమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఓటిటి, టీవీ ఛానళ్లు సినిమాకు ఆర్ధికంగా తోడ్పడతాయి. దీనితో ఇది మరింత లాభదాయకంగా మారుతుంది. ఓటిటిలో వీక్షకుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ 20 శాతం మించడం లేదు. ఓటిటిలో సగటు మరియు చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరవచ్చును. ఈ సౌకర్యం లేనప్పుడు ఇవి విడుదల కాకుండా డబ్బాలకు పరిమితమవుతాయి. అదే సమయంలో సృజనాత్మక చిత్రాలను నిర్మించేవారు తమ సినిమాలను థియేటర్లలో ప్రేక్షకులుచూడాలని కోరుకుంటారు. అని విజయకుమార్ వ్యాఖ్యానించారు.

ఓటిటి ఇకపై కూడా ఉంటుందని స్పష్టం చేసిన విజయకుమార్ కోవిడ్ కష్టకాలంలో ఇది సినిమాలు విడుదల అయ్యేలా చూసి నిర్మాతలకు ఎంతో కొంత ఆదాయం లభించేలా చూసిందని అన్నారు.ఇటీవల కాలంలో సినిమాల విడుదల మరియు ప్రచార ఖర్చులు పెరిగాయి. ఉపగ్రహ మార్కెట్ పుంజుకోవడంతో ఉత్పత్తి వ్యయం 90 వ దశకంలో గణనీయంగా పెరిగింది, మల్టీప్లెక్సులు పెరిగాయి. ఇవన్నీ 2010 లో పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి అని అన్నారు.

ప్రేక్షకుల చలనచిత్ర వీక్షణ ప్రాధాన్యతలను ప్రస్తావించిన విజయకుమార్సినిమా చూసేవారి అభిరుచులు, ఎంపికలు గణనీయంగా మారాయి. వారు ఎంపిక చేసుకున్న వాటిని మాత్రమే చూస్తున్నారు. ప్రజలు వెబ్ సిరీస్ లను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యువతను చలనచిత్ర పరిశ్రమ లక్ష్యంగా చేసుకున్నది. తిరగడానికి ఇష్టపడే యువత యాప్ ల ద్వారాకొత్తగా విడుదల అయినవాటిలో తమకు నచ్చిన వాటిని చూస్తున్నారు. దీనికి భిన్నంగా ఇంటికి చేరిన తరువాత వృద్దులు టీవీలలో వచ్చే కార్యక్రమాలు సీరియళ్లను చూడడానికి ఇష్టపడుతున్నారు.' అని అన్నారు.

 

దేశ చలనచిత్ర రంగంలో నాణ్యత సాంకేతికతలకు ఎలాంటి కొదవ లేదని అన్న విజయకుమార్ ప్రతి చిత్రం విజయవంతం కావాలంటే వృత్తిపరమైన నిబద్ధత అవసరమని అన్నారు. సినిమాలు తీయడానికి అయ్యే ఖర్చు తిరిగి రావాలని అన్నారు.

కోవిడ్ కష్టకాలంలో సినిమాల పెట్టుబడులపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విజయకుమార్ ' పేరు, డబ్బు సంపాదించడానికి మాత్రమే వచ్చే ప్రతిపాదనలపట్ల నిర్మాతలు అప్రమత్తంగా ఉంటూ వృత్తిపరమైన విలువలు కలిగిన నాణ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. కొంతమంది నిర్మాతలు గుర్తింపు, అవార్డుల కోసం సినిమాలను నిర్మిస్తున్నారని అన్నారు.

 

ఆర్ధికంగా వెసలుబాటుగా ఉన్నంత కాలం మాత్రమే సినిమా వ్యాపారం కొనసాగుతుందని విజయకుమార్ పేర్కొన్నారు. ' మనుగడ సాగించడానికి, తనపై ఆధారపడిన వారిని దృష్టిలో ఉంచుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ పరిశ్రమ జాగ్రత్తగా ముందుకు సాగవలసి ఉంటుంది. పేరు,ప్రతిష్టలు పొందడానికి మాత్రమే కాకుండా అనుభవం సంపాదించడానికి కూడా నిధులను దుర్వినియోగం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. సరైన ప్రణాళిక, కథ, ఆర్ధిక వనరులు లేకుండా ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికి సినిమాలు తీయడం మంచిది కాదు ' అని ఆయన వివరించారు.

సినిమాలపై నిర్మాతలకు సలహాలు సూచనలు ఇచ్చిన విజయకుమార్ ' కేవలం దర్శకుడు, సాంకేతిక నిపుణులు సంగీతంపై ఆధారపడి సినిమాను నిర్మిస్తే నిర్మాతకు ఎలాంటి ప్రయోజనం కలగదు. సరైన ప్రణాళిక, కథ నటులు,సంగీతం సమకూర్చుకుని వ్యాపార దృక్పధంతో మాత్రమే విజయవంతమైన సినిమాలను నిర్మించడానికి అవకాశం కలుగుతుంది. సినిమా ప్రారంభం అయి విడుదల అయ్యే వరకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి' అని అన్నారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సినిమా పరిశ్రమ మనుగడకు ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

***

 

 

 

 

 


(Release ID: 1690473) Visitor Counter : 245