ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

వ్యవసాయ మేధోవలసను ఆపడం ద్వారా వ్యవసాయంవైపు యువతను ప్రోత్సహించాలి: ఉపరాష్ట్రపతి

• భారత పర్యావరణ, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, నాగరికతకు వ్యవసాయమే మూలాధారం

• వ్యవసాయానికి భవ్యమైన భవిష్యత్తును కల్పించడం మనందరి బాధ్యత అన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• ఆహారభద్రత నుంచి పౌష్టికాహార భద్రతవైపు మన దృష్టిని మళ్లించాల్సిన అవసరముంది

• సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచన

• ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి పరిశోధనల ఫలాలు చేరవేయడం ద్వారా వ్యవసాయదారులను వ్యవసాయ వ్యాపారవేత్తలుగా రూపుదిద్దాలని సూచన

• ‘ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030’ జాతీయ చర్చావేదికను అంతర్జాలం ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Posted On: 19 JAN 2021 5:41PM by PIB Hyderabad

భారతదేశం నుంచి వ్యవసాయ మేధోవలసను తగ్గించడం ద్వారా యువతను వ్యవసాయంవైపు మళ్లించి.. ఓ గౌరవప్రదమైన వృత్తిగా వ్యవసాయాన్ని స్వీకరించేలా ప్రోత్సహించాల్సిన తక్షణావసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే వ్యవసాయదారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు.

భారతీయ వ్యవసాయం 2030: రైతుల ఆదాయాన్ని పెంచడం, పౌష్టికాహార భద్రత, సుస్థిర ఆహార వ్యవస్థ’ ఇతివృత్తంతో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ చర్చను మంగళవారం, హైదరాబాద్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. 

వ్యవసాయరంగంపై యువతలో ఆసక్తి తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. సామాజిక-ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు, వ్యవసాయ ఉత్పాదక ధరల్లో పెరుగుదల, పెట్టుబడికి తగిన ఆదాయం లేకపోవడం తదితర కారణాల వల్లే యువత ఈ రంగానికి దూరమవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి.. పరిశోధనల ఫలం క్షేత్రస్థాయికి చేరేలా చొరవతీసుకోవడం, వ్యవసాయం-పరిశ్రమ మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా వ్యవసాయదారులను వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా మార్చే దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 

వ్యవసాయాన్ని భారతదేశ ఆత్మగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. వ్యవసాయం దేశ ఆహారభద్రతకు, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. వ్యవసాయాన్ని భారతదేశ పర్యావరణ వ్యవస్థకు, సంస్కృతి, నాగరికతకు మూలాధారంగా ఆయన  పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారి వంటి విపత్కర సమయంలోనూ 2019-20 సంవత్సరానికి గానూ రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి పెంచిన విషయాన్ని గుర్తుచేస్తూ భారతదేశ రైతులను అభినందించారు. ఈ సందర్భంగా భారతదశ వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న నాలుగు సవాళ్లను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారభద్రతతోపాటు పౌష్టికాహార భద్రతను పెంచే దిశగా ప్రత్యేకమైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. భూమి, నీరు, అటవీభూమి, వంటి సహజ వనరులను సద్వినినియోగం చేసుకుంటూ.. జలవనరులను సద్వినియోగం చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయాన్ని పెద్దమొత్తంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులను మూడో సవాలుగా వివరించిన ఉపరాష్ట్రపతి.. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి వ్యవసాయరంగాన్ని కాపాడుకునే దిశగా మరిన్ని పరిశోధనలను జరగాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతోపాటు రైతు కూలీలు వ్యవసాయ క్షేత్రానికి కీలకమైన వ్యక్తులని.. అలాంటి వారికి భవ్యమైన భవిష్యత్తును ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని సుస్థిరం చేసేందుకు.. ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలను వ్యవసాయానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వ్యవసాయాన్ని మరింత విస్తృతమైన కోణంలో చూడాలన్నారు. అటవీవిస్తీర్ణం పెంచడం, చేపలు, పాడిపశువులతోపాటు వాటి పరస్పర ఆధారిత వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. మహిళా రైతుల సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇటీవలి కాలంలో వచ్చిన మిడతల దండు దాడులు, కరోనా మహమ్మారి, బర్డ్ ఫ్లూ తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. విపత్తులనుంచి రైతన్నను రక్షించేందుకు అవసరమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, వైద్యం, పౌష్టికాహారం అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

వ్యవసాయాధారిత రంగాలైన పౌల్ట్రీ, పాడి, చేపల పెంపకం, ఉద్యాన పంటలు తదితర వ్యవస్థలను ప్రోత్సహిస్తూ.. ఆహార భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనల ఫలితాలను రైతులకు అందజేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

వరదలు, కరువు-కాటకాలు, మహమ్మారులు ఎన్నొచ్చినా.. దేశంలో ఆహారభద్రతకు లోటురాకుండా అన్నదాతలు మనందరి బాగోగులు చూసుకుంటున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అందుకే రైతన్నల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ‘టీమ్ ఇండియా’గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నాయకులు (పొలిటికల్ పార్టీలు), విధాన నిర్ణేతలు (పాలసీ మేకర్స్), మీడియా (ప్రెస్).. రైతుల గొంతుకను వినిపించాలని ఆయన సూచించారు. 

రుణమాఫీ, రాయితీలు వంటివి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కావన్న ఉపరాష్ట్రపతి.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దీర్ఘకాల, స్వల్పకాల విధానాలను రూపొందించేలా ముందడుగు పడాలన్నారు. ఈ-మార్కెటింగ్, శీతల గిడ్డంగులు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, సరైన సమయానికి, సరిపడా రుణాలు అందించడం వంటివి అన్నదాత స్థైర్యాన్ని, ఆహార ఉత్పత్తితోపాటు వ్యవసాయ రంగంపై యువత ఆసక్తి పెంచుకునే దిశగా ప్రోత్సహిస్తాయన్నారు. 

వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పౌరసమాజం ప్రతినిధులు, అన్నదాతలు పాల్గొనే.. ఈ మూడు రోజుల సదస్సులో భారత వ్యవసాయ రంగ పురోగతిపై కీలకమైన, సానుకూల చర్చ జరుగుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ పరుషోత్తం రూపాలా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్ చంద్, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్, ఎఫ్ఏవో అసిస్టెంట్ డైరెక్టర్, శ్రీ జోంగ్ జిన్ కిమ్, వ్యవసాయ శాఖ సీనియర్ సలహాదారు డాక్టర్ నీలం పటేల్, నీతి ఆయోగ్ సభ్యులు, వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు, రైతులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

****



(Release ID: 1690098) Visitor Counter : 216