సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

స్థానిక ఉపాధి కల్పించడానికి, ఖద్దరు చేతివృత్తులవారు, గిరిజన జనాభాను బలోపేతం చేసేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖతో కేవీఐసీ అవగాహన ఒప్పందాలు

Posted On: 19 JAN 2021 4:42PM by PIB Hyderabad

"ఖద్దరు, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌" (కేవీఐసీ), కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. గిరిజన విద్యార్థుల కోసం ఖద్దరు వస్త్రాల కొనుగోలు, "ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం" (పీఎంఈజీపీ) అమలు సంస్థగా మంత్రిత్వ శాఖను కేవీఐసీ భాగస్వామిగా చేసుకోవడం ఈ ఒప్పందాల ఉద్దేశం. ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్‌ ముండా ఆధ్వర్యంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

    మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న "ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలల" విద్యార్థుల కోసం, 2020-21లో, గిరిజన వ్యవహారాల శాఖ రూ.14.77 కోట్ల విలువైన 6 లక్షల మీటర్ల ఖద్దరును కొనుగోలు చేస్తుందని శ్రీ నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఏటా పెంచే ఏకలవ్య పాఠశాలల సంఖ్యతోపాటే వస్త్రం కొనుగోలు కూడా పెరుగుతుందని వివరించారు. 

    గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన "జాతీయ షెడ్యూల్డ్‌ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ" (ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ), దేశంలోని గిరిజనుల ఆర్థికాభివృద్ధికి బాధ్యత వహించే సంస్థని, పీఎంఈజీపీ అమల్లో ఇది కూడా తోడ్పడుతుందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో వ్యవస్థాపక ప్రాజెక్టులకు రాయితీతో కూడిన రుణాలను ఎన్‌ఎస్‌టీపీఎఫ్‌డీసీ ఇస్తుంది. వివిధ ఉత్పాదక కార్యక్రమాల్లో గిరిజనులు పాల్గొనేలా చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ ఒప్పందంతో లబ్ధి చేకూరుతుంది. పీఎంఈజీపీ గిరిజనుల్లోకి మరింతగా చొచ్చుకుపోయేలా ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ, కేవీఐసీ కలయిక పనిచేస్తుంది.
    
    దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు, ఖద్దరు కళాకారులను బలోపేతం చేయడం ద్వారా స్థానిక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా, ప్రస్తుత అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

***(Release ID: 1690095) Visitor Counter : 150