మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పరిస్థితి

Posted On: 18 JAN 2021 7:27PM by PIB Hyderabad

2021 జనవరి, 18వ తేదీ వరకు, 5 రాష్ట్రాలలో పౌల్ట్రీ పక్షులలో, 9 రాష్ట్రాల్లో కాకులు / వలస పక్షులు / అడవి పక్షుల్లో  ఏవియన్  ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి చెందినట్లు, నిర్ధారించడం జరిగింది.

ఇంకా, న్యూఢిల్లీ లోని తీస్ హజారిలో మృతి చెందిన  హెరాన్ అనే పక్షి నమూనాలలో, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో కాకుల్లో కూడా  ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలను నిర్ధారించి,  ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోడానికి వీలుగా ఢిల్లీకి అవసరమైన సూచనలు జారీ చేయడం జరిగింది. 

మహారాష్ట్రలోని అన్ని ప్రభావిత కేంద్రాల్లో, ఆర్.ఆర్.టి. లను మోహరించారు, పౌల్ట్రీ పక్షులను ఏరివేసి, నిర్మూలించే పని కొనసాగుతోంది.  కాగా, ముంబైలోని సి.పి.డి.ఓ.లో ప్రభావిత పక్షులను ఏరివేసి, నిర్మూలించే కార్యకలాపాలు పూర్తయ్యాయి, ప్రభావిత కేంద్రాలను శుభ్రపరచడం, క్రిమిసంహారక మందులు చల్లడం వంటి ప్రక్రియ కొనసాగుతోంది.  అదేవిధంగా, లాతూర్ జిల్లాలోని, కేంద్రేవాడి గ్రామం, అహ్మద్ పూర్, సుకానీ గ్రామం; ఉద్గిర్ తాలూకా, తొండర్ గ్రామం (వజ్రవాడి); ఆశా తాలూకా కుర్ద్ వాడి గ్రామం వంటి ప్రభావిత ప్రాంతాలలో, పక్షులను ఏరివేసి, నిర్మూలించే ప్రక్రియతో పాటు, పారిశుధ్య కార్యకలాపాలు కూడా పూర్తయ్యాయి.

ఇంకా, మధ్యప్రదేశ్‌ (హర్దా మరియు మాండ్‌సౌర్ జిల్లాలు); ఛత్తీస్ గఢ్ (బలోడ్ జిల్లా) లలోని ప్రభావిత కోళ్ళ ఫారాల చుట్టూ, ఒక కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న పౌల్ట్రీ పక్షులను ఏరివేసి, నిర్మూలించడం కోసం, ఆర్.ఆర్.టి. లను నియమించారు.  కాగా, హర్యానా (పంచకుల జిల్లా) లోని ప్రభావిత కేంద్రాలలో పౌల్ట్రీలలో పక్షులను ఏరివేసి, నిర్మూలించే ప్రక్రియ కొనసాగుతోంది.  

దేశంలోని ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కేంద్ర బృందం బాధిత ప్రాంతాలను సందర్శిస్తోంది. ఏ.ఐ. వ్యాప్తి కేంద్రీకృతమై ఉన్న కేంద్రాలను పర్యవేక్షించడానికీ, సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనాలను నిర్వహించడానికీ, ఈ బృందం మహారాష్ట్రను సందర్శించింది. అంతకు ముందు ఈ బృందం కేరళ సందర్శన ముగించింది. 

ట్విట్టర్, ఫేస్‌ బుక్ హ్యాండిల్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికలతో సహా, వివిధ వేదికల ద్వారా ఏవియన్ గురించి అవగాహన కల్పించడానికి ఈ విభాగం నిర్విరామంగా కృషి చేస్తోంది. 

ఏ.పి.ఎస్./ఎమ్.జి.

 

*****(Release ID: 1689911) Visitor Counter : 112