రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్‌సీసీ చేపట్టిన "స్వచ్ఛత పఖ్వాడా" కార్యక్రమాన్ని ఇండియా గేట్, రాజ్‌పథ్ వద్ద ప్రారంభించిన రక్షణ శాఖ కార్యదర్శి
Posted On:
18 JAN 2021 4:32PM by PIB Hyderabad
దిల్లీ ఇండియా గేట్ వద్ద ఎన్‌సీసీ నిర్వహించిన "స్వచ్ఛత పఖ్వాడా" కార్యక్రమాన్ని రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ స్వచ్ఛత పఖ్వాడా అంశం "పరిశుభ్ర భారత్, హరిత భారత్, ఇదే నా కలల భారత్".
ఈ సందర్భంగా డా.అజయ్ కుమార్ మాట్లాడారు. "యూనిఫారం ధరించే యువతతో కూడిన ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ఎన్‌సీసీ. ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్, జాతీయ ప్రత్యేక సమగ్రత క్యాంపులు, నాయకత్వం&వ్యక్తిత్వ అభివృద్ధి, స్వచ్ఛత అభియాన్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా జాతి నిర్మాణంలో ఎన్‌సీసీ విశేషంగా పాల్గొంది. "ఎన్‌సీసీ యోగ్‌దన్" ద్వారా, ఎన్‌సీసీ క్యాడెట్లు పోరాటయోధులుగా మారి కరోనా వ్యాప్తిని నియంత్రించారు. నేషనల్ స్వచ్ఛత పఖ్వాడాలో భారీగా పాల్గొనడం ద్వారా, ప్రజలను పరిశుభ్రత వైపు మరల్చడంలో ఎన్‌సీసీ గట్టి ప్రయత్నాలు చేసింది. సామాజిక వృద్ధి, సేవల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు స్వచ్ఛందంగా పాల్గొనడం వెలకట్టలేనిది. వారి సేవాగుణం దేశ ప్రజల్ని ప్రభావితం చేసింది. ప్రస్తుతం చేపట్టిన అంశం అభినందనీయం. ఈ తరహా కార్యక్రమాల ద్వారా దేశం స్థిరంగా వృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పారు.
ఎన్‌సీసీలో ఇచ్చే శిక్షణ ద్వారా అనేకమంది విశిష్ఠ, ప్రముఖ వ్యక్తులు రూపొందారని; ప్రభుత్వం, సాయుధ బలగాలు, వివిధ పౌర సంస్థల్లో వారు పనిచేశారు లేదా పనిచేస్తున్నారని డా.అజయ్ కుమార్ తెలిపారు. దేశాన్ని నడిపించే సత్తా ఉన్న శిక్షణ పొందిన, క్రమశిక్షణతో కూడిన యువతరం నిధిని ఎన్‌సీసీ రూపొందిస్తోందని ప్రశంసించారు.
ఒక క్యాడెట్ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత కొన్ని కవితలు చదివారు. వ్యాధులు, కొవిడ్‌ను దూరంగా ఉంచేందుకు రోజువారీ జీవితంలో పరిశుభ్రతను పాటించాల్సిన ఆవశ్యకతపై మరో క్యాడెట్ తన అనుభవాన్ని పంచుకున్నారు. పరిశుభ్రతను దినచర్యగా మార్చుకోవాల్సిన అవసరాన్ని, మంచి నృత్యాలతో కూడిన వీధి నాటకం ద్వారా క్యాడెట్లు చాటిచెప్పారు. చివరగా "ప్లాగ్ రన్"తో ఈ కార్యక్రమం ముగిసింది.
స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా, బ్యానర్ల ప్రదర్శన, కరపత్రాల పంపిణీ, వీధి నాటకాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, వచ్చే గణతంత్ర దినోత్సవం కోసం రాజ్‌పథ్‌ను పరిశుభ్రంగా ఉంచేలా ఎన్‌సీసీ క్యాడెట్లు కృషి చేస్తారు. 26 క్యాడెట్ల బృందాలు, ఇండియా గేట్ "సి హెక్సాగన్" నుంచి విజయ్ పథ్ వరకు, సోమవారం నుంచి ఈనెల 29 వరకు జ్యోతితో పరుగు చేపడతారు. పరిశుభ్రత ఆవశ్యకతను వివరిస్తూ సాగుతారు.
ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్, రక్షణ శాఖ, ఎన్‌సీసీ అధికారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1689909)
Visitor Counter : 134