నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ఇరాన్‌లోని చాబహర్‌ పోర్టులో సరకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచిన భారత్‌

పోర్టులో నిరంతరాయ సరకు నిర్వహణ సేవలకు వీలు కల్పించనున్న, ఇటీవల అందించిన రెండు "మొబైల్‌ హార్బర్‌ క్రేన్లు"

Posted On: 18 JAN 2021 5:33PM by PIB Hyderabad

ఇరాన్‌కు ఆరు  25 మిలియన్‌ డాలర్ల విలువైన "మొబైల్‌ హార్బర్‌ క్రేన్లు" (ఎంహెచ్‌సీ) అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌, ఇటీవల రెండు ఎంహెచ్‌సీలను అందించింది. ఇటలీ మార్ఘెరా పోర్టు నుంచి, సోమవారం చాబహర్‌ పోర్టును ఎంహెచ్‌సీలు చేరుకున్నాయి. ప్రస్తుతం వాటి సామర్థ్య పరీక్ష నడుస్తోంది.

    చాబహర్‌ షాబిద్‌ బెహెస్తి పోర్టులో కంటైనర్లు, భారీ, సాధారణ సరకు సేవలను అంతరాయం లేకుండా అందించేందుకు, 140 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఉన్న మొబైల్ హార్బర్ క్రేన్ల వంటి బహుళార్ధసాధక పరికరాలు, ఉపకరణాలు 'ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్' (ఐపీజీఎల్)కు వీలు కల్పిస్తాయి.

    చాబహర్‌ పోర్టులో మౌలిక సదుపాయాల వృద్ధిలో భారత్‌ నిబద్ధతకు ఇది నిదర్శనం.

 

                   

    ఈ ద్వైపాక్షిక ఒప్పందం 2016 మే 23న రెండు దేశాల మధ్య కుదిరింది. చాబహర్‌ పోర్టు తొలి దశ అభివృద్ధి కింద యాంత్రీకరణ చేపట్టి, కార్యకలాపాలు ప్రారంభించేందుకు కుదిరిన ఈ ఒప్పందం విలువ 85 మిలియన్‌ డాలర్లు. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు, ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ పేరిట, కేంద్ర నౌకారవాణా శాఖ ఆధ్వర్యంలో ఎస్‌పీవీని ఏర్పాటు చేశారు.

    చాబహర్‌ పోర్టును, జాతీయ ప్రాముఖ్యతగల వ్యూహాత్మక పోర్టుగా కేంద్ర నౌకారవాణా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ అభివర్ణించారు. "క్రేన్లు సహా భారీ యంత్రాలను అందించడం, చాబహర్‌ పోర్టు వ్యూహాత్మక అనుసంధాన ప్రాజెక్టులో భారతదేశ నిబద్ధతను సూచిస్తోంది. ఇది మధ్య ఆసియాలోని మార్కెట్లను వినియోగించుకునేందుకు మరింత వీలు కల్పిస్తుంది. భారత్‌, ఇరాన్‌ మధ్య ఆర్థిక, పరస్పర బంధాలను మెరుగుపరుచుకునేందుకు చాబహర్‌ పోర్టు అభివృద్ధి ఒక పునాది. ఇరు దేశాల మధ్య సముద్ర రంగ వర్తకానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది" అని తెలిపారు.

    భారత్‌, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సహా సీఐఎస్‌ దేశాల్లో, ముఖ్యంగా తూర్పు సీఐఎస్‌ దేశాల మధ్య అనుసంధానం, వర్తకం పెంచడంలో, చాబహార్ నౌకాశ్రయం వ్యూహాత్మక ప్రయోజనాన్ని, అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది. 

***


(Release ID: 1689704) Visitor Counter : 212