ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రారంభ్: స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’లో ప్రధానమత్రి ప్రసంగపాఠం
Posted On:
16 JAN 2021 8:06PM by PIB Hyderabad
యువశక్తి, వారి కలలు ఎంత విశాలమైనవో, ఎంత అపురూపమైనవో అని వివరించేందుకు మీరు సరైన ఉదాహరణలు. మీ అందరి మాటలను చాలా శ్రద్ధగా వింటున్నాను, చూస్తున్నాను. మీలోని ఈ విశ్వాసం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. స్టార్టప్ కంపెనీల విస్తారాన్ని ఓసారి మీరే గమనించండి. ఓ స్టార్టప్ కార్బన్ ఫైబర్ త్రీడీ ప్రింటర్ పై ఉంటే.. మరొకటి శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి చెబుతోంది. ఈ-టాయిలెట్లు, బయోడీగ్రేడబుల్ పీపీఈ కిట్లు, మధుమేహానికి మందు తయారీ నుంచి.. ఇటుకల తయారీ యంత్రం వరకు.. దివ్యాగులకు ఏఆర్ సాంకేతికతను అందించడం ఇలా ఎన్నో అంశాలను.. మీరు మీ ఆలోచనల రూపంలో పంచుకున్నారు. మన భవిష్యత్తును అందంగా మలిచేందుకు మీ వద్ద ఎంతటి శక్తిసామర్థ్యాలున్నాయో అర్థమై చాలా సంతోషం కలుగుతోంది.
మొదట్లో యువత స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే.. చుట్టుపక్కల ఉన్నవాళ్లు.. ఉద్యోగం ఎందుకు చేయవు? ఈ స్టార్టప్ ఎందుకు? అని ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఉద్యోగం మంచిదే కానీ.. నువ్వే ఎందుకు కొత్త స్టార్టప్ ప్రారంభించి పదిమందికి అవకాశాలు ఇవ్వవు? అని అడుగుతున్నారు. మొదట్నుంచీ స్టార్టప్ ల్లో ఉన్నవారిని చూసి.. ‘మీరు మొదట్నుంచీ స్టార్టప్ ల్లో ఉన్నారా?, వాహ్’ అని ప్రశంసిస్తున్నారు. ఈ మార్పు బిమ్స్‌టెక్ (బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్) దేశాలకు బలమైన శక్తిగా మారింది. భారతదేశంలో స్టార్టప్ అయినా.. బిమ్స్‌టెక్ దేశాల్లో స్టార్టప్ లు అయినా.. చక్కటి ప్రగతితో ముందుకు సాగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న మంత్రులు.. బంగ్లాదేశ్ నుంచి శ్రీ జునైద్ అహ్మద్ పలక్ జీ, భూటాన్ నుంచి లిన్పో శ్రీ లోక్‌నాథ్ శర్మ జీ, మయన్మార్ నుంచి ఊ థావుంగ్ తున్ జీ, నేపాల్ నుంచి శ్రీ లేఖ్‌రాజ్ భట్ జీ, శ్రీలంక నుంచి శ్రీ నమల్ రాజపక్సే జీ, బిమ్స్ టెక్ దేశాల సెక్రటరీ జనరల్ శ్రీ టెంజిన్ లెక్‌ఫెల్ జీ, కేంద్ర కేబినెట్‌లో నా సహచరులు శ్రీ పీయూష్ గోయల్ జీ, శ్రీ ప్రకాశ్ జవడేకర్ జీ, శ్రీ హర్దీప్ సింగ్ పురీ జీ, శ్రీ సోమప్రకాశ్ జీ, పరిశ్రమల రంగం నుంచి వచ్చిన, ఫిక్కీ అధ్యక్షుడు శ్రీ ఉదయ్ శంకర్ జీ, శ్రీ ఉదయ్ కోటక్ జీ, శ్రీ సంజీవ్ మెహతా జీ, డాక్టర్ సంగీతారెడ్డి జీ, శ్రీ సుబ్రకాంత్ పాండాజీ, శ్రీ సందీప్ సోమానీ జీ, శ్రీ హర్ష్ మరీవాలాజీ, శ్రీ సింఘానియా జీ ఇతర ప్రముఖుల.. స్టార్టప్ ప్రపంచంలోని నా యువ మిత్రులారా,
ఈరోజు మనందరికీ ఒకటి కాదు పలు ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రారంభదినం. ఇవాళ బిమ్స్ టెక్ దేశాల తొలి స్టార్టప్ సదస్సు నిర్వహించబడుతోంది. ఇవాళ స్టార్టప్ ఇండియా ఉద్యమం ప్రారంభమై ఐదేళ్లు పూర్తవుతోంది. ఇవాళే కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చారిత్రక.. అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంది. మన శాస్త్రవేత్తలు, మన యువత, మన పారిశ్రామికవేత్తల సామర్థ్యం.. మన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, వైద్యరంగంలోని వారి కఠోరమైన శ్రమ, సేవాభావానికి ఈరోజు ప్రతీకగా నిలిచిపోతుంది. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో టీకా రూపొందించే వరకు మనకు ఎదురైన అనుభవాలు.. ఆ అనుభవాలతోపాటు ఇవాళ బిమ్స్ టెక్ దేశాల మన యువత, పారిశ్రామిక వేత్తలు ఈనాటి సమావేశంలో భాగస్వాములయ్యారు. అందుకే ఈ సదస్సు చాలా కీలకమైనదిగా నిలిచిపోతుంది. రెండ్రోజులుగా ఈ వేదిక ద్వారా కీలకమైన చర్చలు జరగడంతోపాటు పలువురు తమ స్టార్టప్ విజయగాథలు వివరించడం, పరస్పర సహకారంతో సరికొత్త అవకాశాలు పుట్టురావడం వాటిని సద్వినియోగం చేసుకోవడం వంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఏ 12 రంగాల్లోనైతే స్టార్టప్ అవార్డులను భారతదేశం ప్రారంభించిందో.. ఆయా స్టార్టప్ ల విజేతలను కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు
మిత్రులారా,
డిజిటల్ విప్లవం, నవ్యమైన సృజనాత్మకతను ప్రతిబింబించే శకం ఇది. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దంగా చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే సమయానికి అనుగణంగా అవసరమైన సాంకేతికతను.. మన ఆసియా పరిశోధన శాలలనుంచి ప్రపంచానికి పరిచయం చేయాలి. భవిష్యత్ ఎంటర్ ప్రెన్యూర్స్ ను ఇక్కడినుంచే రూపొందించాలి. ఇందుకోసం ఆసియాలోని ఈ దేశాలన్నీ ముందుకు వచ్చి పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన బాధ్యతను తీసుకోవాలి. ఎవరి వద్ద వనరులు ఉంటాయో.. వారి వద్ద సేవాభావం కూడా ఉండాలి. అందుకే మన బిమ్స్ టెక్ దేశాల వద్ద ఈ బాధ్యత సహజంగానే ఉంటుంది. శతాబ్దాల పురాతనమైన సంబంధాలు, మన సంస్కృతి, సభ్యత వంటివి మనల్ని నిరంతరం కలుపుతూనే ఉన్నాయి. మనం మన ఆలోచనలను పంచుకోగలం కాబట్టే.. మనమంతా ఇక్కడ కలిశాం. ఒకరికొకరు పరస్పర సహకారంలోనే మనందరి శ్రేయస్సు ఉంటుంది. ప్రపంచ జనాభాలో 20శాతం కోసం పనిచేస్తున్నాం. మన వద్ద 3.8 ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఉంది. మన యువతలో కావాల్సినంత శక్తి ఉంది. తమ భవిష్యత్తును స్వయంగా లిఖించుకునే సత్తా ఉంది. అంతేకాదు.. యావత్ ప్రపంచ శ్రేయస్సుకోసం పనిచేసే శక్తి సామర్థ్యాలను నేను చూస్తున్నాను.
***
(Release ID: 1689558)
Visitor Counter : 104
Read this release in:
Marathi
,
Manipuri
,
Punjabi
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam