ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీ తొలి గ్రాండ్ ఫైనల్ ప్రారంభం

కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరణతో మొదలు
ఆరోగ్య మంత్రిత్వశాఖ, “నాకో” నిర్వహణలో కార్యక్రమం

“ఉత్పాదక యువ కార్మికశక్తి కావాలంటే
మంచి ఆరోగ్యం అత్యంత ఆవశ్యకం”

Posted On: 12 JAN 2021 6:39PM by PIB Hyderabad

   ఎయిడ్స్/హెచ్.ఐ.వి.పై అవగాహన లక్ష్యంగా రూపొందించిన రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీ గ్రాండ్ ఫైనల్.ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2021 జనవరి 12న ప్రారంభించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో-ఎన్.ఎ.సి.ఒ.), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.    

https://ci4.googleusercontent.com/proxy/ci5foVPz_FiTTO7vZ6AQ7Ne8XzXyCtyIJ2s4Fkx2ZDXnoc9dRRc0dfpcmVETIv-gdQFhEfvp8FiI8zZ5TVGYyqpFJmXL1UmRiECy_kh4QZDGuIe0I3e1qBUQUw=s0-d-e1-ft#http://static.pib.gov.in//WriteReadData/userfiles/image/image001TOYS.jpg

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం లభించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువత విజయాలకు గుర్తింపుగా ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. భారతదేశం యువతకు స్వామి వివేకానంద ఆశయాలు స్ఫూర్తిదాయంగా నిలిచాయన్నారు. “వయోవృద్ధుల జనాభా ప్రాబల్యం ఉన్న ప్రపంచంలో,. భారతదేశాన్ని యువ జనాభా ప్రాబల్య దేశాల్లో ఒకటిగా పరగణిస్తున్నారు. గతంలో ఎప్పుడూ దేశంలో ఈ స్థాయిలో యువత జనాభా లేదు. భవిష్యత్తులో ఇలాంటి సందర్భం రాకపోవచ్చు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతికి ఈ అంశమే దోహదపడాలి. యువజన జనాభా అవసరాలను, ఆశయాలను నెరవేర్చడాన్నిబట్టి ఈ లక్ష్యసాధనలో మన విజయం ఆధారపడి ఉంటుంది.” అని హర్షవర్ధన్ అన్నారు.

, “యువశక్తితో సాధించగలిగే ప్రయోజనాలను పెంచుకోవడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని, పనిచేసే యువ జనాభాకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇతర ఆదాయ మార్గాలను కల్పించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. మంచి ఆరోగ్యం, మంచి విద్య, జీవనోపాధి అవకాశాలు, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఎక్కువ ప్రమేయం కల్పించడం వంటి అంశాల ద్వారా దేశంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు అవకాశం ఉంటుంది. దేశం కూడా యువశక్తి ద్వారా ప్రయోజనాలు పొందేందుకు వీలు ఉంటుంది.” అని అన్నారు.

 ఎయిడ్స్.పై అవగాహన, హెచ్.ఐ.వి. బాధితులకు మద్దతు లక్ష్యంగా తొలిసారిగా రెడ్ రిబ్బన్ క్లబ్ క్విజ్ పోటీని నాకో సంస్థ నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో క్విజ్ పోటీలు నిర్వహించినందుకు ఆయా రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సంఘాలను కూడా తాను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 500కుపైగా కళాశాలలు పాలుపంచుకున్నాయని తెలిపారు. యువతలో అవగాహనకోసం ఇలాంటి క్విజ్ పోటీలు చాలా ఆవశ్యకమన్నారు.

  దాదాపు 50వేలకు పైగా పాఠశాలల్లో కిశోర బాలల విద్యా పథకాన్ని నాకో సంస్థ 2005నుంచి అమలు చేస్తూ వస్తోందని, జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) సహకారంతో ఈ పథకం అమలు జరుగుతోందని అన్నారు. కళాశాలలకు వెళ్లే యువతకు అవగాహన కల్పించడానికి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 12,500 రెడ్ రిబ్బన్ క్లబ్బులను ఏర్పాటు చేసిందన్నారు.  ప్రధానంగా హెచ్.ఐ.వి. నిరోధం, బాధితులకు చికిత్స, మద్దతు, అపవాదులు, అపోహలు తగ్గించడం, స్వచ్ఛంద రక్తదానానికి ప్రోత్సాహం తదితర లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన 300 రెడ్ రిబ్బన్ క్లబ్బులను సత్కరించే సదవకాశం గత ఏడాది ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా తనకు లభించిందని హర్షవర్ధన్ తెలిపారు.

  కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యం, పరిశుభ్రత, పౌష్టికాహారం, సానుకూల మానసిక పరిస్థితి, మానసిక సంక్షేమం వంటివి మరింత పెంపొందించుకోవలసిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. మనకు తెలిసిన వారందరికీ అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని, అప్పుడే ఆటంకాలన్నింటినీ అధిగమించగలమని అన్నారు.

  ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఉత్సాహంతో కూడిన యువ కార్మిక శక్తి కావాలంటే అందుకు మంచి ఆరోగ్యం చాలా ఆవశ్యకమని అన్నారు. హెచ్.ఐ.వి. /ఎయిడ్స్ తదిత ఆరోగ్య సంబంధమైన అంశాలపై సమాచారాన్ని అందరూ పంచుకోవలసిన అవసరం ఉందని, అందుకు నాంది పలకడానికి ఈ రోజే సదవకాశమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

   జాతీయ విద్యా విధానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, నవ భారతం, మెరుగైన దేశం అనే లక్ష్యాల దిశగా అనేక పరివర్తనా పూర్వక విధానాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, పాఠశాల ఆరోగ్య కార్యక్రమంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలంటూ 2017వ సంవత్సరపు జాతీయ ఆరోగ్య విధానం కూడా సూచిస్తోందని అన్నారు. ఆరోగ్యం, పరిశుభ్రత పాటించడం పాఠశాల పాఠ్యాంశాల్లో ఒక భాగంగా పొందుపరిచారన్నారు. కిశోర ప్రాయంలోని బాలలకు ఎదురయ్యే ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొనడానికి ఆరోగ్య విధానం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, వారి ఆరోగ్య రక్షణకోసం పెట్టుబడులు పెట్టాలని కూడా సూచిస్తోందని అన్నారు. భారతదేశాన్ని విజ్ఞానపరంగా  ప్రపంచ స్థాయి అగ్రదేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఇటీవలి జాతీయ విద్యావిధానం ఇందుకు దోహదపడుతుందని, దేశంలోని యువత సామాజిక, భౌతిక ప్రతిస్పందనకు విద్యావిధానం వీలు కల్పిస్తుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/lHEZ5OXmcJM2eEX-XOT0xFfajMzkzeVwnvldJ5PLJ4QA6IPPQV4Fl1JJ2qvBMURRhjL4puXjyt7_hButLhKC0UZdnr1U7C9gh1KBdZbtFeCsAcFa7bX5Xdf4qg=s0-d-e1-ft#http://static.pib.gov.in//WriteReadData/userfiles/image/image002QNGV.jpg

  కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా దేశంలోని యువత పనిచేస్తూ ఉండటం హర్షదాయకమన్నారు. “కోవిడ్ మహ్మరి వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో పలువురు యువకులు తమ నైపుణ్యాలకు పదునుబెడుతూ, ఎన్నో ఆవిష్కరణలతో ముందుకు వచ్చారు. ఈ నాటి యువత రేపటి మన దేశ భవిష్యత్తుకు ఆధారం. సృజనాత్మకత నైపుణ్యాలకు, సామర్థ్యాల నిర్మాణానికి మన ప్రధానమంత్రి కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.” అని ఆయన అన్నారు.

  కార్యక్రమం చివరగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, “యువతే భవిష్యత్తుకు ఆధారం. యువజనులందరికీ అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. యువజనులు దేశ భవితకు ఆవిష్కర్తలు, సృష్టికర్తలు, నిర్మాణశిల్పులు, నాయకులు కావాలన్నదే ప్రభుత్వం ధ్యేయం.” అని  అన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/sCzi7JonRiIf8rGSS7ddVZv7eU9MGLeiSo6G4KIFCjd2v-QA-x6tfn5IYmaBeC016_UdiIaOYraPtKizWVet9YCd56vpNjwRVEpBstZdrNVCSnRuSBD9Uv7UtQ=s0-d-e1-ft#http://static.pib.gov.in//WriteReadData/userfiles/image/image003MQRS.jpg

కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ సక్సేనా, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

******



(Release ID: 1688140) Visitor Counter : 144