రైల్వే మంత్రిత్వ శాఖ

గంటకి 130 కిలోమీటర్ల వేగంతో నడవనున్న రైళ్లు

దక్షిణ మధ్య రైల్వేలో 2824 కిలోమీటర్ల మేర సామర్ధ్యం పెంపు

Posted On: 09 JAN 2021 5:53PM by PIB Hyderabad

నూతన సంవత్సరాన్ని భారతీయ రైల్వేలు ఘనంగా ప్రారంభించాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నచతుర్భుజ - సమాంతర రైలు మార్గం లోని 1280 కిలోమీటర్ల మార్గంలో ఇకపై రైళ్లు గంటకి 130 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. చతుర్భుజ (గోల్డెన్ క్వాడ్రిలేటరల్)- సమాంతర రైలు మార్గం(గోల్డెన్ డయాగ్నల్) 1612 కిలోమీటర్ల మేర ఉంది. విజయవాడ-దువ్వాడ మార్గంలో మినహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న చతుర్భుజ - సమాంతర రైలు మార్గం లో రైళ్ల వేగం పెరగనున్నది. విజయవాడ- దువ్వాడ ల మధ్య విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నందున ఈ మార్గంలో రైళ్ల వేగం ప్రస్తుతానికి పెంచడం లేదు.

ఈ మార్గంలో ట్రాక్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా వేగంగా కల్పించి అవాంతరాలను తొలగించడం వల్ల రైళ్ల వేగాన్ని పెంచడానికి అవకాశం కలిగింది. 260 మీటర్ల పొడవు వుండే భారీ పట్టాలను అమర్చడం, మలుపులు, వాలుగా వుండే ప్రాంతాలలో సౌకర్యాలను మెరుగుపరచడం లాంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది.

గత ఏడాది కొవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల రైళ్ల రాకపోకలు తగ్గాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రైల్వేలు మౌలిక సదుపాయాలను మెరుగు పరచుకొనే అంశంపై దృష్టి సారించాయి. సౌకర్యాలు మెరుగుపడిన మార్గంలో ఆర్ డిఎస్ఓ / లక్నో గత ఏడాది జులై నుంచి అక్టోబర్ వరకు 130 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుని నడిచే కన్ఫర్మాటరీ ఓసిల్లోగ్రాఫ్ కార్ రన్ (సిఓసిఆర్) ద్వారా పరీక్షలను నిర్వహించింది. ఈ సమయంలో ఇతర ప్రమాణీకాలతో పాటు సిగ్నలింగ్, ట్రాక్షన్ పంపిణీ పరికరాలు, రైలు ఇంజిన్, పెట్టెల సామర్ధ్యాన్ని కూడా పరీక్షించి నమోదు చేయడం జరిగింది.

ఆ తరువాత ఈ కింది మార్గాలలో రైళ్లను గంటకి అత్యధికంగా 130 కిలోమీటర్ల వేగంతో నడపడానికి దక్షిణ మధ్య రైల్వేకి అనుమతి లభించింది.

  1. గోల్డెన్ డయాగ్నల్ (గ్రాండ్ ట్రంక్) మార్గం: 744 కిలోమీటర్ల మార్గం

    i. బల్లార్షా నుంచి కాజిపెట్ - 234 ఆర్ కిలోమీటర్లు

    ii. కాజిపెట్-విజయావాడ-గుదూరు - 510 ఆర్ కిలోమీటర్లు



    2. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూట్ (చెన్నై -ముంబై విభాగం): 536 ఆర్ కిలోమీటర్లు
    i. రేణిగుంట నుంచి గుత్తి - 281 ఆర్ కిలోమీటర్లు

    ii. వాడి నుంచి గుత్తి - 255 ఆర్ కిలోమీటర్లు

ఇప్పటికే  హై-డెన్సిటీ నెట్ వర్క్ (హెచ్ డిఎన్) ఉన్న సికింద్రాబాద్ - కాజిపెట్ (132 కిలోమీటర్ల దూరం) మధ్య గరిష్ట వేగ పరిమితులు గంటకి 130 కిలోమీటర్లకు పెంచడం జరిగింది.

తాజా నిర్ణయంతో ఈ సెక్షన్ లో ఉన్న 2,824 కిలోమీటర్లు ( 1412 ఆర్ కిలోమీటర్లు) మేర అప్ అండ్ డౌన్ మార్గాలలో రైళ్లు గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ- దువ్వాడ సెక్షన్ మినహా ఉన్న మొత్తం జి క్యూ -జి డి మార్గం మొత్తం ఈ సౌకర్యం కలిగి ఉంటుంది.

కొవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు, నెట్ వర్క్ సామర్థ్యం విస్తరణ, సరుకు రవాణా వైవిధ్యీకరణలో భారత రైల్వేలు అపూర్వమైన వృద్ధిని సాధించాయి. భవిష్యత్ అభివృద్ధికి మరియు ప్రయాణీకులకు తదుపరి స్థాయి ప్రయాణ అనుభవానికి పునాది వేసే అవకాశంగా రైల్వేలు కోవిడ్ సవాలును ఉపయోగించాయి.

***



(Release ID: 1687477) Visitor Counter : 188