మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
దేశంలో ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Posted On:
06 JAN 2021 6:16PM by PIB Hyderabad
కొన్ని రాష్ట్రాల్లో వలస పక్షులు, కాకులు, పౌల్ట్రీ పక్షుల్లో ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా బయటపడిన నేపథ్యంలో, ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. పశు సంవర్దక శాఖ నేతృత్వంలో, దిల్లీ కృషిభవన్‌లోని రూమ్ నం.190-ఎ (ఫోన్ నం.011-23382354)లో దీనిని ఏర్పాటు చేశారు. "యాక్షన్ ప్లాన్ ఆన్ ప్రిపేర్డ్‌నెస్, కంట్రోల్, కంటైన్‌మెంట్ ఆఫ్ ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా-2015"లో సూచించిన విధంగా, వ్యాప్తి నిర్వహణ, వ్యాధి నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యూహాలు పంచుకోవడానికి, సాయం అందించడానికి ఈ కంట్రోల్ రూమ్ తోడ్పడుతుంది.
ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా (ఏఐ), శతాబ్దాలుగా ప్రపంచాన్ని పీడిస్తోంది. గత శతాబ్దంలో నాలుగుసార్లు భీకరంగా విరుచుకుపడింది. 2006లో, భారత్‌లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఇది జంతు సంబంధ వ్యాధి అయినప్పటికీ, మనదేశంలో మనుషులకు ఇంకా వ్యాప్తి చెందలేదు. కలుషిత పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుందనడానికి ప్రత్యక్ష రుజువులు లేవు. జీవ భద్రత సూత్రాలు, వ్యక్తిగత & పరిసరాల పరిశుభ్రత, వంట & శుద్ధి ప్రమాణాలను పాటించడం వంటి నిర్వహణ పద్ధతులు ఏఐ వైరస్ వ్యాప్తి నిరోధానికి సమర్థవంత సాధనాలు.
సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఫిబ్రవరి-మార్చి మధ్య వలస వస్తున్న పక్షుల వలనే మనదేశంలో ఎవియన్ ఇన్‌ఫ్లుయెంజా ప్రధానంగా వ్యాప్తి చెందుతోంది. మానవ పద్ధతుల ద్వారా (వ్యాధిని వ్యాప్తి చేసే వస్తువుల ద్వారా) వ్యాపిస్తోందన్న అంశాన్ని కూడా కొట్టిపారేయలేము.
***
(Release ID: 1686678)
Visitor Counter : 226