పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

నిర్మాణం, కూల్చివేతల నిబంధనలు పాటించనందుకు పర్యావరణ పరిహారంగా రూ.1.59 కోట్ల జరిమానా విధింపు

12 ప్రాంతాల్లో పనుల నిలిపివేతకు ఆదేశాలు; ధూళి, సంబంధిత వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పక్షం రోజుల డ్రైవ్‌లు కొనసాగింపు

Posted On: 04 JAN 2021 5:24PM by PIB Hyderabad

నిర్మాణం, కూల్చివేత పనుల కారణంగా ఏర్పడే ధూళి, సంబంధిత వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు; జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో నిర్మాణం&కూల్చివేతల (సీ&డీ) పనులకు సంబంధించిన ప్రాంగణాలు, కార్యకలాపాలు, రవాణాపై నిఘాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుతోపాటు హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలను "దిల్లీ&సరిహద్దు ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌" ఆదేశించింది.

    ఈ సంస్థలు, 227 బృందాలను ఏర్పాటు చేసి 24.12.2020 నుంచి 31.12.2020 వరకు తనిఖీలు చేపట్టాయి. ఈ బృందాలు దాదాపు 3000కుపైగా సీ&డీ ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు చేశాయి. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన సీ&డీ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు/మార్గదర్శకాలు, ధూళి నియంత్రణ చర్యలను 386 ప్రాంతాల్లో పాటించలేదని ఈ బృందాలు గుర్తించాయి. నిబంధనలు పాటించనందుకు పర్యావరణ పరిహారంగా దాదాపు రూ.1.59 కోట్ల జరిమానా విధించాయి. దీంతోపాటు, 12 ప్రాంతాల్లో పనుల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశాయి. 

    సీ&డీ పనుల సామగ్రి తరలింపును కూడా తనిఖీ బృందాలు పరిశీలించాయి. దాదాపు 325 వాహనాలు మార్గదర్శకాలు పాటించలేదని నిర్ధారించి, దాదాపు రూ.1.17 కోట్లను పర్యావరణ పరిహారంగా విధించాయి.

    దిల్లీలో వాయు నాణ్యత తగ్గిపోవడంలో గణనీయ పాత్ర పోషిస్తున్న సీ&డీ రంగ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు, సీ&డీ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, మార్గదర్శకాలను అంతా పాటించేలా చూడడానికి ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగించాలని నిర్ణయించారు.

***


(Release ID: 1686125) Visitor Counter : 211