అంతరిక్ష విభాగం

ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి ప్రైవేట్ రంగంతో ఇస్రో భాగస్వామ్యం దోహదపడుతుంది... డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 04 JAN 2021 5:40PM by PIB Hyderabad

ప్రైవేటురంగంతోకలసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) చేపడుతున్న కార్యక్రమాలు 'ఆత్మ నిర్భర్ భారత్' నిర్మాణ ఆశయానికి దోహదపడతాయని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ మంత్రిత్వ శాఖల (స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రో సాధించిన విజయాలపై ఈరోజు ఇక్కడ మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు సంస్థను విజయపథంలో నడిపిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంవల్ల ప్రైవేట్ రంగంతో కలసి పనిచేయడానికి ఇస్రోకి అవకాశం కలిగిందని అన్నారు. దీనివల్ల అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగం ప్రవేశించడానికి అవకాశం కలిగిందని అన్నారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ స్పేస్) ను నెలకొల్పడం వల్ల అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలు, స్టార్ట్-అప్ లకు తమవంతు పాత్రను పోషించడానికి రంగం సిద్ధం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం, జియోస్పేషియల్ సేవలు, ఉపగ్రహ కూటమి , అప్లికేషన్ ఉత్పత్తులు మొదలైన రంగాలలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించడానికి వీలు కల్పిస్తామని మంత్రి వివరించారు.

అంతరిక్ష రఁగంలో ప్రైవేటు రంగాన్ని అనుమతించే అంశంలో ప్రధానమంత్రి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని అన్న మంత్రి దీనిని దేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు స్వాగతించాయని అన్నారు. ఈ నిర్ణయంవల్ల భారతదేశం ఒక అంతరిక్ష పోటీ మార్కెట్ గా రూపుదిద్దుకుంటుందని ఆయన వివరించారు. ఇంతేకాకుండా అంతరిక్ష ప్రయోగాల ప్రయోజనాలు సామాన్య మానవునికి చేరుతాయని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణ దిశలో భాగంగా దేశాన్ని అన్ని రంగాలలో స్వయం సమృద్ధి చేసి సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యంతో శ్రీ నరేంద్రమోడి నిర్ణయాలను తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. దీనిలో భాగంగానే ప్రైవేటు రంగంతో కలసి పనిచేయాలని ఇస్రో నిర్ణయించిందని మంత్రి అన్నారు.

ప్రైవేటు రంగ భాగస్వామ్యం వల్ల అంతరిక్ష రంగం సామర్థ్యం పెరుగుతుందని వనరుల వినియోగం ఎక్కువ అవుతుందని డాక్టర్ జితేంద్రసింగ్ వివరించారు. ఇంతేకాకుండాఉద్యోగాల కోసం ప్రతిభావంతులైన అంతరిక్ష శాస్త్రవేత్తలు, నిపుణులు విదేశాల వైపు చూడరని అన్నారు. మార్గదర్శకాల ప్రకారం అంతరిక్ష కార్యకలాపాలు చేపట్టడానికి 25 కి పైగా పరిశ్రమలు ఇప్పటికే అంతరిక్ష శాఖను సంప్రదించినట్లు ఆయన తెలియజేశారు.

మోడి ప్రభుత్వ హయాంలో గత ఆరు సంవత్సరాల కాలంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాలను మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన వివిధ రంగాలకు విస్తరించడంతో పాటు సాధారణ పౌరులు సులువుగా జీవించడానికి అవకాశం కలిగించాయని మంత్రి వివరించారు. రైల్వేలు, రహదారి మరియు వంతెనల నిర్మాణం, వ్యవసాయ రంగం, హౌసింగ్, టెలి-మెడిసిన్, విపత్తు నిర్వహణ మరియు ఖచ్చితమైన వాతావరణ సూచనలను జారీ చేయడానికి అంతరిక్ష మరియు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి వివరించారు.

***

 (Release ID: 1686124) Visitor Counter : 18