రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 50 లక్షల లావాదేవీలతో, ఫాస్టాగ్ ద్వారా రూ.80 కోట్లు దాటిన పన్ను వసూళ్లు
Posted On:
25 DEC 2020 7:17PM by PIB Hyderabad
ఫాస్టాగ్ ద్వారా ఒక్కరోజు పన్ను వసూళ్లు తొలిసారిగా రూ.80 కోట్లు దాటాయి. రికార్డు స్థాయిలో 50 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఈనెల 24వ తేదీన ఇది సాధ్యమైంది. ఇప్పటివరకు 2.2 కోట్ల పైచిలుకు ఫాస్టాగ్‌లు జారీ కాగా, ఈ సాంకేతికతకు మారుతున్న హైవే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడంతో, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేలా ఎన్‌హెచ్‌ఏఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫాస్టాగ్ తీసుకున్న వాహనదారులకు టోల్ కేంద్రాల వద్ద ఆగేపని లేకుండా సమయం, ఇంధనం ఆదా అవుతాయి. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో ఇటీవల చేసిన సవరణతో, ఈ డిజిటల్ లావాదేవీలు తప్పనిసరియ్యాయి.
దేశవ్యాప్తంగా ఉన్న 30 వేల పీవోఎస్‌ల వద్ద, ఎన్‌హెచ్‌ఏఐ టోల్ కేంద్రాల వద్ద ఫాస్టాగ్‌లను సులభంగా పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. 27 బ్యాంకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్), యూపీఐ, ఆన్‌లైన్ చెల్లింపులు, మై ఫాస్టాగ్ మొబైల్ యాప్, పేటీఎం, గూగుల్ పే సహా ఇతర విధానాల ద్వారా ఫాస్టాగ్‌ను సులభంగా రీఛార్జ్ చేయవచ్చు. టోల్ కేంద్రాల వద్ద నగదు ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికతతో ఫాస్టాగ్ పని చేస్తుంది. టోల్ కేంద్రాల వద్ద వాహనం ఆగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఫాస్టాగ్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి డిజిటల్ రూపంలో నగదు మినహాయింపు ఉంటుంది. భౌతికదూరం తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో, టోల్ కేంద్రం సిబ్బందికి, వాహనదారుడికి సంబంధం లేకుండా చేసే ఫాస్టాగ్‌వైపు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. హైవేలపై టోల్ వసూలుకు సమగ్ర సాంకేతిక సాధనమైన ఫాస్టాగ్, మరింత ఆచరణాత్మక, ప్రయోజనకర ఎంపికగా మారింది.
జాతీయ రహదారులపై వాహనదారులు సాఫీగా, అడ్డంకులు లేకుండా ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు తీసుకున్న చర్యల్లో ఫాస్టాగ్ ఆచరణ ఒకటి.
****
(Release ID: 1683927)
Visitor Counter : 199