వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పి.ఎం.కిసాన్ సమ్మాన్ నిధి కింద 7వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల చేసిన ప్రధాని

తొమ్మిది కోట్ల రైతు కుటుంబాలకు లాభం..
ప్రత్యక్ష బదిలీ ద్వారా రూ.18,000కోట్ల డిపాజిట్.


ప్రపంచ వ్యవసాయ మార్కెట్లలో బ్రాండ్ ఇండియా
స్థిరపడాల్సిన సమయం వచ్చిందన్న ప్రధాని.

ప్రధాని మోదీ నాయకత్వంతో వ్యవసాయ రంగంలో
గొప్ప సంస్కరణలు– నరేంద్ర సింగ్ తోమర్.

Posted On: 25 DEC 2020 6:13PM by PIB Hyderabad

 పి.ఎం. కిసాన సమ్మాన్ నిధి పథకం కింద 7వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. అలాగే,.. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, హర్యానా, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులతో ప్రధాని సంభాషించారు. వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి తాము ఎలాంటి ప్రయోజనం పొందామో  రైతులు ప్రధానమంత్రికి తెలియజేస్తూ తమ అనుభవాలను ఆయనతో పంచుకున్నారు.

   ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,.. ఈ రోజు ఒక బటన్ క్లిక్కుతో  దేశంలోని 9 కోట్ల రైతు కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ .18,000 కోట్లు నేరుగా జమ చేయగలిగినట్టు తెలిపారు.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటివరకూ, లక్షా 10 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు చేరాయన్నారు.

 పశ్చిమ బెంగాల్లోని 70లక్షలమందికిపైగా రైతులు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద పశ్చిమబెంగాల్ కు చెందిన 23లక్షల మందికిపైగా రైతులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో రైతుల ప్రయోజనాలపై మాట్లాడని పార్టీలన్నీ ఢిల్లీకి వచ్చేసి రైతుల గురించి మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల (ఎ.పి.ఎం.సి.ల) మండీలు మాయమవుతాయని ఈ పార్టీలు అంటున్నాయని, కేరళలో ఎ.పి.ఎం.సి. మండీలు లేవన్న సంగతిని అవి పదేపదే మరిచిపోతున్నాయని, కేరళలో వీరు ఎప్పుడూ ఆందోళనే చేయరని ప్రధాని అన్నారు.

  రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన భూసార పరిరక్షణ కార్డు, యూరియాకు వేప పూత పూయడం, సౌరశక్తి పంపుల పంపిణీ వంటి కొన్ని ప్రభుత్వ పథకాలను ప్రధాని ఈ సందర్భంగా ఉదహరించారు. రైతులకు మెరుగైన పంటల బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని,  పి.ఎం. పంటల బీమా పథకంతో ఈ రోజు కోట్లాదిమంది రైతులు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు.

  రైతులు తమ పంటలకు మంచి ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సుల మేరకు,.పెట్టుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మొత్తాన్ని కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.)గా ప్రభుత్వం ఖరారు చేసిందని అన్నారు. ఎం.ఎస్.పి. పథకం వర్తించే పంటల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచిందన్నారు.  రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్కెట్లను ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. లక్షకోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అన్ లైన్ ద్వారా వెయ్యికిపైగా వ్యవసాయ మండీలను అదనంగా ఏర్పాటు చేసిందని అన్నారు. ఒక ప్రాంతంలోని రైతులు సమైక్య శక్తిగా పనిచేసేందుకు వీలుగా, చిన్న రైతుల సమూహాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఇపుడు దేశంలో 10,000కు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్.పి.ఒ.లను) ఏర్పాటు చేసేందుకు, వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్యమం తరహాలో  కృషి జరుగుతోందన్నారు.

 ఈ రోజున రైతు పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, పైపు ద్వారా స్వచ్ఛమైన తాగునీరు పొందగలుగుతున్నాడని అన్నారు.  ఉచిత విద్యుత్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 5లక్షలవరకూ ఉచిత వైద్య చికిత్స వంటి ప్రయోజనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో ఆరోగ్య రక్షణపై రైతులకు బెంగ తీరిపోయిందన్నారు.

  వ్యవసాయ సంస్కరణల ద్వారా రైతులకు మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధాని అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు తమ ఉత్పత్తులను సరైన ధర లభించే చోటనే విక్రయించుకోవచ్చన్నారు. రైతు తన ఉత్పత్తిని ఎం.ఎస్.పి.పై విక్రయించవచ్చు. లేదా ఎగుమతి చేసుకోవచ్చు. లేదా ఎవరైనా వ్యాపారికి కూడా అమ్ముకోవచ్చు లేదా మరో రాష్ట్రంలో విక్రయించుకోవచ్చు అని ప్రధాని చెప్పారు.  రైతు ఉత్పత్తి దారుల సంఘాల్లో అమ్ముకోవడానికి కూడా రైతులకు వీలుంటుందని, బిస్కట్లు, చిప్.లు, జామ్.లు, ఇతర వినియోగ సరుకులు తయారీ సంస్థల వ్యవస్థలో కూడా వారు భాగస్వాములు కూడా కావచ్చని తెలిపారు. ప్రపంచ వ్యవసాయ మార్కెట్లలో బ్రాండ్ ఇండియాగా దేశం స్థిరపడటానికి తగిన సమయం ఆసన్నమైందన్నారు.

   వ్యవసాయ సంస్కరణలకు మద్దతు ఇచ్చి, స్వాగతం పలికిన రైతులందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలను తాను విస్మరించబోన హామీ ఇచ్చారు.  అస్సాం, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో రైతులు ఎంతో చైతన్యంతో వ్యవహరించారని, రైతులను తప్పుదారి పట్టించిన పార్టీలను వారు ఒక విధంగా తిరస్కరించారని ప్రధానమంత్రి చెప్పారు.

  కార్యక్రమ ప్రారంభోన్యాసంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ, సుపరిపాలనకు, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పునాది వేశారని, అవే సంస్కరణలను 2014నుంచి మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయన్నారు. ఎం.ఎస్.పి. పెరిగిందని, పంటల సేకరణ పెరిగిందని, పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని కేంద్రమంత్రి అన్నారు.

  పశ్చిమ బెంగాల్ మినహాయిస్తే, మిగతా రాష్ట్రాలన్నింటిలో పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని పూర్తిగా వర్తింపజేయగలిగినట్టు చెప్పారు. కోవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో కూడా రైతుల ఖాతాలకు డబ్బు చేరిందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. వారి అనుమానాలను, అపార్థాలను, ఆపోహలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారు ప్రభుత్వంతో చర్చలకు రావాలని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆహ్వానించారు.

 

******(Release ID: 1683737) Visitor Counter : 177