గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కొత్త పోర్టల్, మొబైల్ యాప్ ‘ఈ-సంపద’!
సుపరిపాలనా దినోత్సవం రోజున ఆవిష్కరించిన కేంద్రమంత్రి
కొత్త పోర్టల్,..యాప్.ల పరిధిలోకి హాలిడే హోమ్స్, పంక్షన్ హాల్స్,
లక్షకు పైగా ప్రభుత్వ నివాస సదుపాయాల బుకింగ్.
4 వెబ్ సైట్లు, 2 మొబైల్ యాప్.ల కలయికతో రూపుదాల్చిన ‘ఈ-సంపద’
Posted On:
25 DEC 2020 4:22PM by PIB Hyderabad
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజైన డిసెంబర్ 25 న మనం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పౌరులకు సౌకర్యవంతమైన జీవనం అందించడంలో జవాబ్దారీ తనాన్ని, పారదర్శకతను పాటించాలన్న లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలోని ఎస్టేట్స్ డైరెక్టరేట్ విభాగం ఈ-సంపద (e-Sampada) పేరిట ఒక కొత్త వెబ్ పోర్టల్.ను, మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్)ను జాతికి అంకితం చేసింది. పలు రకాల సేవలందించేందుకు ఈ యాప్ సింగిల్ విండో సదుపాయంగా పనిచేస్తుంది. ప్రభుత్వ అధీనంలోని లక్షకుపైగా నివాస సదుపాయాలను, 28 నగరాల్లోని 45కార్యాలయ సముదాయాల్లో ప్రభుత్వ సంస్థలకు ఆఫీసు స్థలాలను కేటాయించడానికి, 1,176 హాలిడే హోమ్.లలో గదుల నమోదు, ఉత్సవాలకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు 5 అశోకా రోడ్ వంటి పంక్షన్ హాళ్ల కేటాయించడానికి, ఇతర సేవలన్నింటికీ ఈ కొత్త యాప్ ఉపకరిస్తుంది.
‘ఒక దేశం..ఒకే వ్యవస్థ’ అన్న నినాదం స్ఫూర్తితో, గతంలో ఎస్టేట్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నడిచిన 4 వెబ్ సైట్లను, రెండు మొబైల్ యాప్.లను కలిపేసి సింగిల్ విండో పద్ధతిలో కొత్తగా ఈ-సంపద వెబ్ సైట్.ను, యాప్ ను రూపొందించారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సేవలన్నింటినీ ఒకే వేదిక కిందకు తెస్తూ, గతంలోన ఉన్న gpra.nic.in, eawas.nic.in, estates.gov.in, holidayhomes.nic.in అనే వెబ్ సైట్లను, m-Awas, m-Ashoka5 అనే మొబైల్ యాప్.లను కలిపేశారు. ఈ కొత్త వెబ్ సైట్.ను, మొబైల్ యాప్.ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ (ఇన్చార్జి) మంత్రి హర్ దీప్ ఎస్. పూరి,. వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్ దీప్ ఎస్. పూరి మాట్లాడుతూ, సుపరిపాలనా ప్రక్రియకు ప్రోత్సాహం అందించడంలో ఇది గణనీయమైన ముందడుగని అన్నారు. వసతుల కేటాయింపు, క్రమబద్ధీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీ వంటి ఎస్టేట్ సంబంధమైన సేవలను అందించడంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
దేశవ్యాప్తంగా ఒకే రకమైన సరళతరమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ-సంపద యాప్ ను రూపొందించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు సౌకర్యంగా ఉండేలా తగిన సేవలందించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. అప్లికేషన్లను అధికారులు ఎప్పటికప్పుడు నేరుగా ట్రాక్ చేసుకునేందుకు ఏక గవాక్ష సదుపాయంగా ఇది ఉపయోగపడుతుందన్నారు. దీనితో వనరులను గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుంటుందని, మానవ ప్రమేయం ఎక్కువగా లేనందున ఇది మరింత పారదర్శకతకు కూడా దోహదపడుతుందని అన్నారు.
మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ,..వినియోగదారుల సదుపాయంకోసం అనేక ప్రత్యేక ఆకర్షణలు, సదుపాయాలతో ఈ-సంపద యాప్ రూపొందిందన్నారు. పర్సనలైజ్డ్ డ్యాష్ బోర్డు, సర్వీసు యూసేజ్ ఆర్కివ్, లైసెన్స్ ఫీజు, బకాయిలు వంటి అంశాలపై వాస్తవ పరిస్థితిని తెలియజెప్పే సదుపాయం కలిగి ఉండటం ఈ యాప్ ప్రత్యేకతలని అన్నారు. ఇది వినియోగదారులకు ఎంతో అనువుగా ఉంటుంది, తమకు అందే సేవలను ప్రత్యక్షంగా చూసే సదుపాయం, తమ స్పందనను కూడా తెలియజేసే సదుపాయం కూడా ఉంటుందన్నారు.
ఫిర్యాదులు దాఖలుకు, పత్రాలు సమర్పణకు, వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరు కావడానికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆన్ లైన్ సదుపాయంగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఏ సేవకైనా ఎస్టేట్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఎక్కువసార్లు వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అసరం లేకుండా ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చు. దీనితో పరిపాలనా వ్యయం, కాలహరణం తగ్గుతుంది. వనరులు కూడా ఆదా అవుతాయి. మొబైల్ యాప్, చాట్ సదుపాయం యూజర్స్ కు మంచి అనుభవాన్ని మిగుల్చుతుంది.
దేశవ్యాప్తంగా పలురకాల సేవల ప్రయోజనాలను ఈ-సంపద అందిస్తుంది.:
అది కూడా ఆన్.లైన్ ద్వారా, కాగిత రహితంగా, నగదు రహితంగా
- 40 ప్రాంతాల్లో ప్రభుత్వ అధీనంలోని 1,09,474 నివాసాల్లో వసతి
- 28 ప్రాంతాల్లోని 45 కాంప్లెక్స్.లలో కోటీ 25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల కార్యాలయ స్థలం కేటాయింపు
- 62 ప్రాంతాల్లోని 1,176 హాలిడే హోమ్ గదులు/ సూట్ల కేటాయింపు
- విజ్ఞాన్ భవన్ బుకింగ్
- సామూహిక ఉత్సవాలు, పంక్షన్లు, తదితర కార్యక్రమాల కోసం వేదికల బుకింగ్
ఈ కొత్త వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌లను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) రూపొందించింది. ఆండ్రాయిడ్, ఐ.ఒ.ఎస్. ప్లాట్‌ఫాంలపై ఈ మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుంది. www.esampada.mohua.gov.in అనే వెబ్ చిరునామాపై పోర్టల్ ను చూడవచ్చు. మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ /యాపిల్ యాప్ స్టోర్ ద్వారా చేసుకోవచ్చు.
*****
(Release ID: 1683672)
Visitor Counter : 209