ఆర్థిక మంత్రిత్వ శాఖ
పట్టణ స్థానిక సంస్థల సంస్కరణల్లో ఎ.పి., ఎం.పి. ముందంజ
బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా రూ. 4,898కోట్ల
అదనపు ఆర్థిక వనరుల సమీకరణకు అనుమతి
Posted On:
23 DEC 2020 11:11AM by PIB Hyderabad
పట్టణ స్థానిక సంస్థల్లో (యు.ఎల్.బి.లలో) సంస్కరణలను చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. యు.ఎల్.బి.ల పనితీరులో సంస్కరణల అమలు ప్రక్రియను పూర్తిచేయడంలో ఈ రెండు రాష్ట్రాలు విజయవంతమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం పేర్కొంది. పౌర ప్రయోజన ప్రాధాన్య రంగాల్లో సంస్కరణలను చేపట్టేలా రాష్ట్రాలను ప్రోత్సహించడానికి, అదనంగా రుణాలు సమీకరించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. సంస్కరణలను పూర్తి చేయాలన్న షరతుతో ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఈ మేరకు అనుమతి ఇచ్చింది.
కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తితో తలెత్తిన సవాళ్లను ఎదుర్కోవటానికి రాష్ట్రాలకు ఏర్పడిన వనరుల ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం 2020 మే 17న రాష్ట్రాల రుణ పరిమితిని పెంచింది. ఈ పరిమితిని రాష్ట్రాల స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెండుశాతానికి సమాన స్థాయిలో పెంచింది. పెంచిన మొత్తంలో సగభాగాన్ని పౌర ప్రయోజన ప్రాధాన్య రంగాలతో కూడిన సంస్కరణలకు వినియోగించాలన్న షరతుతో ఈ చర్య తీసుకున్నారు. ప్రతి రంగంలో సంస్కరణలు పూర్తిచేయడం ప్రాతిపదికగా తీసుకుని జి.ఎస్.డి.పి.లో 0.25 శాతానికి సమానంగా అదనపు నిధులను సేకరించడానికి రాష్ట్రాలకు అనుమతి లభించింది. సంస్కరణల అమలుకోసం గుర్తించిన 4 పౌర ప్రయోజన ప్రాధాన్య రంగాలు,..(ఎ) ఒకే దేశం ఒకే రేషన్ కార్డు వ్యవస్థ అమలు చేయడం, (బి) సులభతర వాణిజ్య నిర్వహణలో సంస్కరణలు, (సి) పట్టణ స్థానిక సంస్థ / వినియోగ కార్యకలాపాల్లో సంస్కరణలు (డి) విద్యుత్ రంగ సంస్కరణలు.
పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా రూ. 4,898కోట్ల మేర అదనపు ఆర్థిక వనరులను సమీకరించేందుకు అనుమతి లభించింది. ఇందులో రూ. 2,525కోట్లు సమీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ కు, రూ.2,373 కోట్ల సమీకరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అనుమతి లభించింది.
పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలను, పట్టణ వినియోగ కార్యకలాపాల్లో సంస్కరణలను రాష్ట్రంలోని సదరు సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టనున్నారు. అలాగే, ప్రజలకు మెరుగైన ప్రజారోగ్య, పారిశుద్ధ్య కార్యక్రమాలు అందించేలా పట్టణ స్థానిక సంస్థలను తీర్చిదిద్దేందుకు కూడా ఈ సంస్కరణలు చేపట్టబోన్నారు. ఆర్థికంగా పరిపుష్టమైన పట్టణ స్థానిక సంస్థలు మాత్రమే పౌరులకు మంచి మౌలిక సదుపాయాలను అందించగలుగుతాయి. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన సంస్కరణలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- రాష్టం నోటిఫై చేసే అంశాలు (a) పట్టణ స్థానిక సంస్థల్లో అమలులో ఉన్న సర్కిల్ రేట్ల (ఆస్తి లావాదేవీల మార్గదర్శక రేట్లు) ప్రాతిపదికగా ఆస్తి పన్ను ఫ్లోర్ రేట్లను నోటిఫై చేస్తుంది. (b) నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి వినియోగ చార్జీల ఫ్లోర్ రేట్లను నోటిఫై చేస్తుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న ధరలు, గతకాలపు ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ రేట్లను ఖరారు చేస్తారు
- ధరల పెరుగులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెరిగే ఆస్తిపన్ను, వినయోగ చార్జీల ఫ్లోర్ రేట్లకు సంబంధించి రాష్ట్రం ఒక క్రమబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
సంస్కరణలను అమలు చేయడానికి “2020వ సంవత్సరపు మధ్యప్రదేశ్ నగర పాలిక్ విధి (ద్వితీ సంశోధన్) అధ్యాదేశ్” అనే నోటిఫికేషన్ తో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే, సంస్కరణల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంది. 1995వ సంవత్సరపు నగరపాలక సంస్థ చట్టం, 1965,..ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం, 1979,.. విశాఖపట్నం నగర పాలక సంస్థ చట్టం, 1981.. విజయవాడ నగర పాలక సంస్థ చట్టం, 1994..ఆంధ్రప్రదేశ్ నగర పాలక సంస్థ చట్టాలను సవరించేందుకు ఒక ఆర్టినెన్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది.
రుణాల ద్వారా అదనపు వనరుల సమీకరణకు లభించిన పరిమితులతో పాటుగా, నాలుగు సంస్కరణల్లో మూడింటిని పూర్తి చేసే రాష్ట్రాలకు అదనంగా ఆర్థిక సహాయం అందుకునే అర్హత లభిస్తుంది. “మూలధన వ్యయంకోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయ పథకం” కింద వివిధ రాష్ట్రాలకు ఈ అదనపు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి 2020 అక్టోబరు 12న ఈ పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో పన్నుల వసూళ్లు తగ్గిపోయి ఈ సంవత్సరం ఆర్థికంగా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం ప్రకటించారు. ఈ పథకం కింద నిర్దేశిత పౌర ప్రయోజనాల సంస్కరణలు చేపట్టే రాష్ట్రాలకు రూ. 2వేల కోట్లను రివార్డుగా కేటాయిస్తారు.
స్థానిక పట్టణ సంస్థల సంస్కరణలను చేపట్టిన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా, ఇప్పటివరకూ మరో పది రాష్ట్రాలు ఒక దేశం ఒకే రేషన్ కార్డు వ్యవస్థను అమలు చేశాయి. మరో ఆరు రాష్ట్రాలు సులభతర వాణిజ్య నిర్వహణా సంస్కరణలను అమలు చేశాయి.
మరిన్ని రాష్ట్రాలు సంస్కరణలు అమలుచేసేలా, అదనపు రుణాలు పొందేలా, మూలధన వ్యయంకోసం ఆర్థిక సహాయం పొందేలా తగిన సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం కొన్ని చర్యలు తీసుకుంది. వివిధ రంగాల్లో పౌర ప్రయోజన కేంద్రీకృతమైన సంస్కరణల అమలుకు ఇచ్చిన గడువును ఇటీవల పొడిగించింది. ఇపుడు, సంస్కరణల అమలుకు సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ సిఫార్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా అందిన పక్షంలో సంస్కరణలతో ముడివడిన ప్రయోజనాలు పొందేందుకు కూడా ఆయా రాష్ట్రాలకు అర్హత లభిస్తుంది.
****
(Release ID: 1683006)
Visitor Counter : 241