రైల్వే మంత్రిత్వ శాఖ

పార్సిల్ వాణిజ్య వృద్ధికి ప్రాధాన్యం

సమీక్షలో రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ పిలుపు,
పార్సిల్ వ్యాపారంలో సత్వర అభివృద్ధికి సృజనాత్మక చర్యలు

ఎల్.హెచ్.పి. వ్యాన్ల పెంపునకు, ఇ-పేమెంట్, డిజిటల్ పేమెంట్ సదుపాయాలకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం

Posted On: 22 DEC 2020 5:41PM by PIB Hyderabad

రైల్వేల పార్సిల్ వాణిజ్యంపై చర్చించేందుకు రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సమీక్ష నిర్వహించారు. ఈ  సమీక్షకు రైల్వే బోర్డు సభ్యులు, సీనియర్ అధికారులు, రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సి.ఆర్.ఐ.ఎస్.) అధికారులు హాజరయ్యారు.

 పార్సిల్ సేవలకు సంబంధించి మరింత ఎక్కువ వాణిజ్యం లక్ష్యంగా రైల్వే శాఖ గత కొన్ని నెలల్లో అనేక చర్యలు తీసుకుంది. రైల్వేశాఖ తీసుకున్న చర్యల్లో కొన్ని:

a) వ్యవసాయ, రైతుల ఉత్పాదనల రవాణాకు సానుకూలంగా కిసాన్ రైళ్లు నడపడం;

b) పార్సిల్ వ్యాన్లు, పార్సిల్ రైళ్లు ఖాళీగా తిరిగి వస్తున్న రంగాలకు డిస్కౌంట్లు మంజూరు చేయడం;

c) ఒకే రైలులోకి 24 పార్సిల్ వ్యాన్లనుంచి జరిగే అన్ లోడింగ్.పై డిస్కౌంట్ ఇవ్వడం;

d) సరకుల షెడ్లన్నింటినీ తెరవడం;

e) పార్సిల్ వాహనాల రాకపోకలకోసం ప్రైవేట్ సరకు రవాణా టెర్మినళ్లు, ప్రైవేటు సైడింగ్స్ ఏర్పాటు;

f) బంగ్లాదేశ్ కు ఎగుమతి వాహనాల రాకపోకలకోసం పార్సిల్ రైలును ప్రారంభించడం.

   వివిధ సంస్థలు, వ్యక్తులకోసం పార్సిల్ సేవలను సులభతరం చేసేందుకు ప్రత్యేక పార్సిల్ టెర్మినళ్లు కొన్నింటిని ఏర్పాటు చేయాలని కూడా భారతీయ రైల్వే శాఖ సంకల్పించింది. మధ్య రైల్వే  పరిధిలోని సంగోలాలో, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాచిగూడలో, దక్షిణ రైల్వే పరిధిలోని కోయంబత్తూరులో, పశ్చిమ రైల్వే పరిధిలోని కాంకరియాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ఈ టెర్మినళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం స్థలాలను కూడా ఇప్పటికే గుర్తించారు.

 కిసాన్ రైళ్ల నిర్వహణ కోసం రైల్వేశాఖ తీసుకున్న చొరవను రైల్వే మంత్రి ప్రశంసించారు. పార్సిల్ సేవలను చిన్న చిన్న వ్యాపారులు ఎక్కువగా వినియోగించుకుంటున్నందున పార్సిల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం చాలా అవసరమన్నారు. పార్సిల్ సేవలను చిన్న వ్యాపారులకు ప్రయోజనకరంగా రూపుదిద్దడంవల్ల చిరు వ్యాపార రంగానికి నేరుగా లాభం కలుగుతుందని అన్నారు.  పార్సిల్ వ్యాపారంలో సత్వర అభివృద్ధిని రైల్వేలు లక్ష్యంగా చేసుకోవాలని, లక్ష్య సాధనకోసం మరింత కృషి, సృజనాత్మక ఆలోచనలు అవసరమని అన్నారు.    

   అత్యధిక రవాణా సామర్థ్యం, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన లింకె హాఫ్మన్ బుష్ (ఎల్.హెచ్.బి.) పార్సిల్ వ్యాన్ల సంఖ్యను పెంచడానికి, ఇ-పేమెంట్, డిజిటల్ పేమెంట్ సదుపాయాలను ప్రవేశపెట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఆదేశించారు. ఈశాన్య ప్రాంతం, పర్వత ప్రాంత రాష్ట్రాలనుంచి సరకు రవాణా వాహనాల రాకపోకలను పెంచేందుకు, ఓడరేవుల దిశగా వెళ్లే ఎగుమతి వాహనాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. పార్సిల్ ప్రత్యేక రైళ్లు సమయపాలన పాటించి తీరాలని, అప్పుడే ఈ పార్సెల్ సేవలపై వినియోగదారులకు నమ్మకం పెరుగుతుందని మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.

 

*****



(Release ID: 1682792) Visitor Counter : 89