రైల్వే మంత్రిత్వ శాఖ

భారత రైల్వేల జాతీయ రైలు ప్రణాళిక ముసాయిదా జారీ


భవిష్యత్ ప్రగతి ప్రణాళికలకు నమూనా కానున్న జాతీయ రైలు ప్రణాళిక

రైల్వేలు - వాణిజ్యంలో రైలురవాణా వాటా పెంపు వ్యూహాలతోపాటు మౌలిక సదుపాయాల సామర్థ్యం పెంపు లక్ష్యంగా జాతీయ రైలు ప్రణాళిక రూపకల్పన

ఈ ప్రణాళిక లక్ష్యం 2030కల్లా గిరాకీని మించిన సామర్థ్య సృష్టి తద్వారా ఇది 2050 వరకు పెరిగే అవసరాలను తీర్చగలదు

జాతీయ రైలు ప్రణాళికలో భాగంగా 2024కల్లా కొన్ని కీలక ప్రాజెక్టుల సత్వర అమలుకు ‘విజన్-2024’ ప్రారంభం

ట్రాక్ - సిగ్నలింగ్ రెండింటిలోనూ 2024 తర్వాత అమలు కోసం స్పష్టమైన కాల పరిమితితో భవిష్యత్ ప్రాజెక్టుల గుర్తింపు

‘ఈస్ట్ కోస్ట్, ఈస్ట్-వెస్ట్, నార్త్-సౌత్’ పేరిట నిర్దిష్ట కాలపరిమితితో మూడు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల గుర్తింపు... వీటిపై ఇప్పటికే సాగుతున్న ‘పెట్స్’ సర్వే

అనేక కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్ల గుర్తింపు ఢిల్లీ-వారణాసి మార్గంపై ఇప్పటికే సాగుతున్న సర్వే

Posted On: 18 DEC 2020 4:27PM by PIB Hyderabad

 దేశ రైల్వేరంగంలో సామర్థ్య పరిమితుల లోటుపాట్లను అధిగమించడంతోపాటు మొత్తం సరకు రవాణా పర్యావరణ వ్యవస్థలో రైల్వేలపరంగా వాటా మెరుగు దిశగా ‘జాతీయ రైలు ప్రణాళిక’ ముసాయిదాను భారత రైల్వేశాఖ రూపొందించింది. రైలు రవాణాపరంగా వాటా పెంపు వ్యూహాలతోపాటు మౌలిక వసతుల సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ ‘జాతీయ రైలు ప్రణాళిక’గా వ్యవహరించే దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికకు ఊపిరిపోసింది. రైల్వేలకు సంబంధించిన అన్ని భవిష్యత్ మౌలిక వసతులు, వాణిజ్యం, ఆర్థిక ప్రణాళికలకు జాతీయ రైలు ప్రణాళిక ఓ సార్వత్రిక వేదికగా నిలుస్తుంది. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రణాళిక ముసాయిదా పంపబడింది. ఈ ప్రక్రియ ముగిశాక 2021 జనవరికల్లా ప్రణాళికకు సంపూర్ణ రూపమివ్వాలని రైల్వేశాఖ నిర్దేశించుకుంది.

ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు

  • ఈ ప్రణాళిక లక్ష్యం 2030కల్లా గిరాకీని మించిన సామర్థ్య సృష్టి... తద్వారా ఇది 2050 వరకు పెరిగే అవసరాలను తీర్చగలదు; అంతేగాక కర్బన ఉద్గారాల తగ్గింపుపై జాతీయ నిబద్ధతలో భాగంగా 2030 నాటికి రైల్వే రవాణాపరమైన వాటాను ప్రస్తుత 27 శాతం నుంచి 45 శాతానికి పెంచడంతోపాటు అదే స్థాయిని కొనసాగించడం.. తదనుగుణంగా 2030కల్లా కర్బన ఉద్గారాలను నికరశూన్య స్థాయికి తేవడం.
  • రైల్వేలద్వారా సరకు-ప్రయాణిక రంగాలలో వాస్తవ డిమాండ్‌పై అంచనా కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వందకుపైగా ప్రదేశాల్లో అధ్యయన బృందాలు ఏడాదిపాటు సర్వే నిర్వహించాయి.
  • సరకు రవాణా – ప్రయాణిక రాకపోకల వృద్ధిపై 2030దాకా ఏటికేడాది ప్రాతిపదికన... ఆ తర్వాత 2050దాకా దశాబ్ద కాలం ప్రాతిపదికన అంచనాల రూపకల్పన.
  • సరకు రవాణాలో 2030 నాటికి రైల్వేల వాటాను 45 శాతానికి పెంచే దిశగా కార్యాకలాపాల సామర్థ్యం/వాణిజ్య విధాన కార్యక్రమాల ప్రాతిపదికన వ్యూహాల రూపకల్పన.
  • సరకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని ప్రస్తుత 22 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల స్థాయికి పెంచడం... తద్వారా సరకు రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించడం.
  • రైలు రవాణా ఖర్చును మొత్తంమీద దాదాపు 30 శాతందాకా తగ్గించి, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం.
  • భారత రైల్వేల రూట్ మ్యాప్‌లో డిమాండ్ పెరుగుదలను గుర్తించడం... భవిష్యత్ నెట్‌వర్క్ సామర్థ్య ప్రవర్తనాత్మకతను అనుసరించడం.
  • పైన పేర్కొన్న అనుసరణ ఆధారంగా భవిష్యత్ డిమాండ్ పెరుగుదలవల్ల మౌలిక సదుపాయాల్లో తలెత్తే అవరోధాలను గుర్తించడం.
  • ఈ అవరోధాలను వీలైనంత ముందుగానే తగ్గించే దిశగా ట్రాక్/సిగ్నలింగ్ పనులతోపాటు రైళ్లు, వ్యాగన్లు, తదితర వినియోగ సామగ్రి కోసం సముచిత సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ప్రాజెక్టుల ఎంపిక.

జాతీయ రైలు ప్రణాళికలో భాగంగా 2024కల్లా కొన్ని కీలక ప్రాజెక్టుల సత్వర అమలుకు విజన్-2024కు  రైల్వేశాఖ శ్రీ‌కారం చుట్టింది. ఈ మేర‌కు 2024క‌ల్లా 100 శాతం విద్యుదీకరణ, రద్దీ మార్గాల్లో బ‌హుళ రైలుప‌ట్టాల వ్య‌వ‌స్థ‌, ఢిల్లీ-హౌరా; ఢిల్లీ-ముంబై మార్గాల్లో రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచ‌డంతోపాటు స్వ‌ర్ణ చ‌తుర్భుజి-స్వ‌ర్ణ కోణీయ (GQ/GD) మార్గాల‌న్నిటిలోనూ రైళ్ల వేగాన్ని 130 కిలోమీటర్లకు ఉన్న‌తీక‌రించ‌డం, కాప‌లార‌హిత రైలుగేట్లను మొత్తంగా తొల‌గించ‌డం త‌దిత‌రాలు విజ‌న్‌-2024లో భాగంగా ఉన్నాయి.

  • ట్రాక్ - సిగ్నలింగ్ వ్యవస్థలు రెండింటిలోనూ 2024 తర్వాత అమలు కోసం స్పష్టమైన కాల పరిమితితో భవిష్యత్ ప్రాజెక్టుల గుర్తింపు
  • ‘ఈస్ట్ కోస్ట్, ఈస్ట్-వెస్ట్, నార్త్-సౌత్’  పేరిట నిర్దిష్ట కాలపరిమితితో మూడు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల గుర్తింపు... వీటిపై ఇప్పటికే సాగుతున్న ‘పెట్స్’ సర్వే.
  • అనేక కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్ల గుర్తింపు... ఢిల్లీ-వారణాసి హై స్పీడ్ రైలు మార్గంపై ఇప్పటికే సాగుతున్న సర్వే.
  • ప్రయాణిక రవాణా కోసం రైలుపెట్టెల వంటి ఇతర నిత్య వినియోగ సామగ్రితోపాటు సరకు రవాణా కోసం వ్యాగన్లు తదితరాల భవిష్యత్ అవసరాలపై అంచనా.
  • దేశంలో 2023నాటికి వందశాతం విద్యుదీకరణ (హరిత ఇంధనం)తోపాటు 2030 నాటికి, అటుపైన 2050దాకా రాకపోకల పెరుగుదల జంట లక్ష్యాల సాధన దిశగా రైలింజన్ల అవసరంపై అంచనా.
  • నిర్ణీత వ్యవధి విరామాలతో మూలధనం కింద మొత్తం పెట్టుబడి అవసరాలపై అంచనా.
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన సహా ఆర్థిక వనరుల కోసం నవ్య ఆర్థిక మార్గాల గుర్తింపు
  • జాతీయ రైలు ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడం కోసం ప్రైవేటు రంగం, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలుసహా వాస్తవ పరికర ఉత్పత్తిదారులు (OEM)/ పరిశ్రమలతో భాగస్వామ్యంపై రైల్వేశాఖ యోచన.
  • రైల్వే కార్యకలాపాలు, నిత్య వినియోగ సామగ్రి యాజమాన్యం, రవాణా-ప్రయాణిక కూడళ్ల అభివృద్ధి, ట్రాక్ అభివృద్ధి/మౌలిక వసతుల నిర్వహణ కార్యకలాపాలు వగైరాల్లో ప్రైవేటు రంగ సుస్థిర భాగస్వామ్యం.

మొత్తంమీద 2030దాకా డిమాండుకు మించి సామర్థ్యం మెరుగుదల, సరకు రవాణాలో రైల్వేలపరంగా వాటాను 45 శాతానికి పెంచడం కోసం మూలధన పెట్టుబడిలో ప్రారంభ ఉత్తేజాన్ని జాతీయ రైలు ప్రణాళిక నిర్దేశించుకుంది. ఇక 2030 తర్వాత రాగల మిగులు ఆదాయం భవిష్యత్ మూలధన పెట్టుబడులు పెట్టడానికి సరిపోతుంది. అంతేకాకుండా ఇప్పటికే పెట్టుబడి పెట్టిన మూలధన రుణాలపై చెల్లింపుల నిష్పత్తి భారాన్ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల రైల్వే ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు అవసరం ఉండదు.

***



(Release ID: 1681902) Visitor Counter : 249