వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సిఐఐ భాగస్వామ్య సదస్సు మినిస్టీరియల్ సెషన్ ను ఉద్దేశించి శ్రీ పీయూష్ గోయెల్ ప్రసంగం; భారత్ ఎప్పుడూ అవసరానికి అనుగుణంగా స్పందించి ఇతర దేశాలకు సహాయం అందించిందని ప్రకటన

Posted On: 16 DEC 2020 8:55PM by PIB Hyderabad

కేంద్ర రైల్వే, వాణిజ్య-పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రభుత్వ పంపిణీ వ్యవహారాల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్  జీవితాలు, జీవనోపాధి, వృద్ధి అనే అంశంపై  సిఐఐ భాగస్వామ్య సదస్సు 2020 మినిస్టీరియల్ సెషన్ లో ప్రసంగించారు. భూటాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి గౌరవ హెచ్ఇ ల్యోపోనో లోక్ నాథ్ శర్మ, మాల్దీవుల ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి  గౌరవ ఉజ్ ఫయ్యాజ్ ఇస్మాయిల్, చిలీ విదేశాంగ వ్యవహారాల మంత్రి గౌరవ ఆండ్రిస్ అల్లామండ్, కైరో ఉప విదేశాంగ మంత్రి గౌరవ డిమిత్రో సెనిక్, బ్రెజిల్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డి బ్యూరోక్రటైజేషన్, మేనేజ్ మెంట్, డిజిటల్ గవర్నెన్స్ విభాగాల ప్రత్యేక కార్యదర్శి (వైస్ మినిస్టర్)  గౌరవ పీస్ డి ఆండ్రాడే  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిత్ర దేశాలు సంఘటితం కావడం వారు కొత్త అవకాశాలు అన్వేషించుకోవడానికి, పరస్పరం మద్దతు ఇచ్చుకోవడానికి, స్నేహబంధం పటిష్ఠం చేసుకోవడానికి, పౌరుల సంక్షేమానికి ప్రయోజనకరమైన చర్యలు చేపట్టడానికి సహాయకారిగా ఉంటుందని శ్రీ గోయెల్ అన్నారు. భాగస్వామ్య దేశాలతో భారత్ కు గల లోతైన సంబంధం గురించి ప్రస్తావిస్తూ ఈ బంధాన్ని మరింత లోతుగా విస్తరించుకోవడానికి భారతదేశం ఎదురు చూస్తున్నదని ఆయన చెప్పారు.ఈ మహమ్మారి కాలంలో భారతదేశం అందించిన మద్దతు గురించి మాట్లాడుతూ అవసరానికి భారత్ ఎప్పుడూ స్పందిస్తూ ఇతర దేశాలకు సహాయకారిగా ఉంటుందన్నారు. కోవిడ్-19 ప్రారంభ దినాల్లో 50 దేశాలకు భారతదేశం గ్రాంట్ రూపంలో ఉచితంగా మందులు సరఫరా చేసిందని, 150కి పైగా దేశాలకు ఔషధాలు అందించిందని శ్రీ గోయెల్ చెప్పారు. సంపన్న దేశాలు భారత ఔషధాల కొనుగోళ్లపై గుత్తాధిపత్యం సాధించడాన్ని నివారించేందుకు భారతదేశం ఆ దేశాలకు ఔషధ ఎగుమతులపై నిషేధం విధించి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు అవి అందుబాటులో ఉండేలా చేసిందని ఆయన అన్నారు. 

ఆత్మనిర్భర్ భారత్ గురించి ప్రస్తావిస్తూ స్వయంసమృద్ధ భారత్ ఎప్పుడూ భాగస్వామ్య దేశాలకు తలుపులు మూయబోదని, ఆ కార్యక్రమం ద్వారా సాధించిన బలంతో ప్రపంచ దేశాలతోమరింత సహకారం సాధిస్తుందని శ్రీ గోయెల్ చెప్పారు. మనందరం పరస్పరం మరింతగా సహకరించుకుందాం, తద్వారా ప్రతీ ఒక్కరి సుసంపన్నతకు కృషి చేద్దాం అని పిలుపు ఇచ్చారు.

ప్రపంచంలోని ఇతర దేశాల పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు ఆర్థికవ్యవస్థను భారతదేశం సరళీకరిస్తున్నదని శ్రీ గోయెల్ చెప్పారు. “మేం  రక్షణ, తయారీ, గనులు, ఫైనాన్స్, కాపిటల్ మార్కెట్లలోని శృంఖలాలను తొలగించి ఆ రంగాలను తెరిచాం. వ్యవసాయ ప్రాసెసింగ్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు మేం వ్యవసాయ చట్టాలను మరింత సరళీకరించాం. రైతులకు మరింతగా ఆదాయం అందించడం కోసం మార్కెట్లను మరింతగా తెరిచాం. మొత్తం మీద భారతదేశంలో వ్యాపార నిర్వహణ సరళం, సులభం, తేలిక చేయడం మా లక్ష్యం” అని ఆయన వివరించారు.  

భారతదేశం భారీ పెట్టుబడి, వస్తుసేవల సమీకరణ అవకాశాలు కల్పిస్తున్నదని శ్రీ గోయెల్ అన్నారు. మిత్రులు, ఇరుగు పొరుగు వారితో మరింతగా సహకరిస్తూ భారతదేశం ప్రపంచ దేశాల్లో తన అస్తిత్వం మరింతగా పెంచుకోవాలని ఎదురు చూస్తున్నదని ఆయన చెప్పారు.  కోవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేందుకు భారత్ కృషి చేస్తున్నదని, 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 7-10 సంవత్సరాల కాలపరిమితిలో 10 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందగలమన్న విశ్వాసంతో ఉన్నదని ఆయన చెప్పారు.
 

****



(Release ID: 1681340) Visitor Counter : 84


Read this release in: English , Urdu , Hindi , Manipuri