జల శక్తి మంత్రిత్వ శాఖ

కోవిడ్‌ సంక్షోభం త‌ర‌హాలో ప్ర‌పంచం నేడు జ‌ల సంక్షోభంపై ఏకం కావాలి: జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావ‌త్‌

న‌దుల నిర్వ‌హ‌ణ‌లో న‌గ‌రాల‌కు తోడ్పాటుగా వ్యూహాత్మ‌క చ‌ట్రం
రూపొందించిన ‘ఎన్ఎంసీజీ, ఎన్ఐయూగఏ: ‌హర్దీప్ సింగ్ పూరి

Posted On: 16 DEC 2020 6:17PM by PIB Hyderabad

   కోవిడ్-19పై మహమ్మారిపై సమష్టి యుద్ధం తరహాలోనే జలరంగం సవాళ్ల పరిష్కారంలోనూ ప్రపంచమంతా ఏకం కావాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెఖావత్ అన్నారు. ఈ మేరకు ‘భారత 5వ జలప్రభావ శిఖరాగ్ర సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు. సదస్సు ఆఖరి రోజున ఇవాళ ‘‘నదుల పరిరక్షణ-వరదల నిర్వహణ-సమన్వయ మార్గానుసరణ’’ అంశం ప్రధానంగా చర్చ సాగింది. కాగా, ఈ సదస్సును ‘‘సైద్ధాంతిక మహా సమ్మేళనం’’గా మంత్రి అభివర్ణిస్తూ- దీనివల్ల జలరంగంలోని భాగస్వాములు, పెట్టుబడిదారులతో సంపూర్ణ సంప్రదింపులు సాగిందని పేర్కొన్నారు. జల-నదీ నిర్వహణలో అనేక ఇతర దేశాలకు-భారతదేశానికీ నడుమ అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే దిశగా ఈ చర్చ సాగిందని వివరించారు. ‘‘జాతీయ, అంతర్జాతీయ అనుభవాల నుంచి మేమెంతో నేర్చుకున్నాం.  అనుభవాన్ని, భావనలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మేం హామీ ఇస్తున్నాం. దేశంలో నేడు విద్యారంగ, స్వయం-సహాయక సంస్థల మద్దతుతో కూడిన రాజకీయ సంకల్పం, పట్టుదల ఎన్నడూలేని రీతిలో వర్ధిల్లుతున్నాయని’’ అని ఆయన ప్రకటించారు.

 

   ప్రపంచంలో భూగర్భ జలాలను అత్యంత ఎక్కువగా వాడుతున్నది మనమేనని, ఈ జలాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని- భూగర్భ జలం గురించి మాట్లాడుతూ శ్రీ షెఖావత్ అన్నారు. ఈ మేరకు ‘అటల్ భూజల యోజన’ పేరిట వినూత్న ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో జలవనరులను గుర్తించి, వాటి పునఃపూరణ‌ ద్వారా భూగర్భ జల సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భూరగ్భ జల నిర్వహణ కోసం వ్యవస్థాగత పునాదులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. తదనుగుణంగా దేశంలోని 7 రాష్ట్రాల్లో సుస్థిర భూగర్భజల వనరుల నిర్వహణపై సామాజిక స్థాయిలో ప్రవర్తనాత్మక మార్పులు తేవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ‘‘ఈ పథకం పంచాయతీ-కేంద్రక భూగర్భజల నిర్వహణ, ప్రవర్తనాత్మక మార్పులను డిమాండ్ వైపు నిర్వహణకు ప్రధాన ప్రాధాన్యతతో ప్రోత్సహిస్తుంది" అని ఆయన చెప్పారు. ఈ సదస్సులో జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయం మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా కూడా పాల్గొన్నారు.

   మామి గంగే మిషన్ సృష్టించిన వేగం, దాని ప్రభావం గురించి ఈ సందర్భంగా కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు. గంగా నదీ పరీవాహక ప్రాంతంలోని పట్టణ నదీ ప్రాంతాల నిర్వహణ కోసం ‘‘అర్బన్ రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్’’ పేరిట ‘గంగా ప్రక్షాళనకు జాతీయ కార్యక్రమం’ (ఎన్‌ఎంసిజి)తోపాటు జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్ఐయూఏ) ఇటువంటి తొలి వ్యూహాత్మక చట్రాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ‘‘ఇది నదీ కేంద్రక ప్రణాళిక చట్రం, ఇందులో భాగమైన వ్యవస్థల విధానంతో పట్టణాలు తమ పరిధిలోని నదీ పరీవాహక ప్రాంతాలను నిర్వహించడంలో ఈ చట్రం తోడ్పడుతుంది’’ అని ఆయన చెప్పారు. ఈ సదస్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ- ‘‘ఇప్పుడు కలుషితం చేద్దాం... ఆ తర్వాత పునరుజ్జీవింప చేద్దాం’’ అనే ధోరణిలో మార్పు రావాల్సి ఉంది’’ అన్నారు. ‘‘ఈ సదస్సులో అనేక రకాలైన విభిన్న అంశాలపై చర్చ జరిగింది’’ అని చెప్పారు. పరిరక్షణ-అభివృద్ధి జమిలిగా సాగడం ఎలాగో, సానుకూల ఫలితాల దిశగా ఈ ప్రక్రియలో ప్రజా భాగస్వామ్యానికి ఎలా ప్రయత్నిస్తుందో ఆయన విపులీకరించారు.

   బీహార్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ- నేపాల్ నుంచి ఉత్తరంవైపున, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి దక్షిణ దిశగా తమ రాష్ట్రంలోకి ప్రవేశించే నదులవల్ల తమకు ఎదురవుతున్న గురించి అందరికీ వివరించారు. బీహార్ భౌగోళిక పరిస్థితుల కారణంగా తమ రాష్ట్రానికి వరదల నిర్వహణ సముచిత చర్చనీయాంశమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక జలవనరుల పరిరక్షణకు, వ్యర్థ జలాల నిర్వహణకు బీహార్ చేస్తున్న కృషిని ఆయన సభికులకు వివరించారు. బీహార్‌లో వరద నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ‘సి-గంగా (cGanga), ఎన్‌ఎంసిజి’ వ్యవస్థలను ఆయన అభ్యర్థించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శ్రీ యు.పి.సింగ్ ప్రసంగిస్తూ- గడచిన నాలుగేళ్ల నుంచీ గంగా ప్రక్షాళనపైనే కాకుండా నదీ పునరుజ్జీవనంపైనా నమామి గంగే  మిషన్ ఏ విధంగా శ్రద్ధ వహిస్తున్నదో తెలిపారు. ఆ మేరకు ‘‘నేడు ఈ మిషన్ సమగ్ర రూపం సంతరించుకుంది. ఇందులో కాలుష్య నివారణ మాత్రమేగాక ఇ-ప్రవాహం, జీవవైవిధ్యం, సామాజిక భాగస్వామ్యంసహా చిన్న నదుల పునరుజ్జీవనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది’’ అని ఆయన చెప్పారు.

   ల భద్రత, దేశంలోని స్థానిక జలవనరుల పునరుజ్జీవనం దిశగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల  అన్వేషణ లక్ష్యంగా ‘ఎన్‌ఎంసిజి’, ‘సి-గంగా’ (సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్) ఈ ‘భారత 5వ జలప్రభావ శిఖరాగ్ర సదస్సు’ను నిర్వహించాయి. ‘ఎన్‌ఎంసిజి‘ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రోజీ అగ్రవాల్, ‘సి-గంగా’ వ్యవస్థాపక అధిపతి, ఐఐటీ-కాన్పూర్ ప్రొఫెసర్ వినోద్ తారే కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అలాగే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 3,000 మంది మేధావులు, పరిశోధకులు, జల-పర్యావరణ నిపుణులు, విధాన నిర్ణేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో ‘సి-గంగా’ రూపొందించిన మూడు ప్రధాన నివేదికలు ‘‘విజన్ కాన్హ్- ఎ సస్టెయినబుల్ రెస్టొరేషన్ పాత్ వే, జోరారీ - రివైవల్ అండ్ ప్రొటెక్షన్ అండ్ హిల్సా- బయాలజీ అండ్ ఫిషరీస్ ఆఫ్ హిల్సా షాద్ ఆఫ్ గంగా రివర్ బేసిన్’’లను ఆవిష్కరించారు. వీటితోపాటు ‘ఎన్‌ఎంసిజి’ ఇటీవల మూడు రోజులపాటు నిర్వహించిన ‘గంగా ఉత్సవ్-2020’పై సమగ్ర నివేదికను కూడా విడుదల చేశారు.

 

***


(Release ID: 1681299) Visitor Counter : 92