మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వ్యవస్థాపక దినోత్సవం:

కేంద్రమంత్రి సంజయ్ ధోత్రే వర్చువల్ ప్రసంగం

Posted On: 15 DEC 2020 5:16PM by PIB Hyderabad

    కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కె.వి.ఎస్.) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగిన వేడుకలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. వ్యవస్థాపక దినోత్సవం ఆన్‌లైన్ పద్ధతిలో జరిగింది. కేంద్ర పాఠశాలవిద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి అమితా కర్వాల్, కె.వి.ఎస్. కమిషనర్ నిధి పాండే, విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాలు భారతదేశం అసలు సిసలు  చిత్రాన్ని అర్థవంతమైన రీతిలో ప్రదర్శిస్తాయని, ఎందుకంటే, విభిన్నమైన నేపథ్యం కలిగిన విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్జనకు వస్తారని అన్నారు.  గ్రామీణుల, పట్టణవాసులు, ధనికులు, పేదలు...ఇలా అన్ని వర్గాల విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల్లో ఉంటారన్నారు.  విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవకాశాలు ఉన్నందున కేంద్రీయ విద్యాలయాలు ఇతర పాఠశాలలకు విభిన్నంగా ఉంటాయన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ రోజు ప్రతి రంగంలో కీలకపాత్ర లభించిందన్నారు. పరిపాలనరంగం, క్రీడారంగం, వైజ్ఞానిక రంగం,  ఇలా ప్రతిరంగంలో వారు నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. .

  సత్ప్రవర్తన కలిగిన, అవగాహన కలిగిన పౌరులుగా భావి తరాలను తీర్చిదిద్దడంపైనే నూతన జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి.) దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పారు.  జాతీయ విద్యావిధానాన్ని పటిష్టంగా అమలు జరపడంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పర్యావరణ రక్షణ, ఏక్ భారత్ శ్రేష్ణ భారత్,..ఇలా సామాజిక రంగానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా కేంద్రీయ విద్యాలయాలదే ప్రధాన పాత్రగా ఉంటుందన్నారు. స్వావలంబనతో కూడిన భారతదేశ నిర్మాణంలో కేంద్రీయ విద్యాలయాలు తప్పకుండా నాయకత్వ పాత్ర పోషిస్తాయన్నారు.

కె.వి.ఎస్. కమిషనర్ నిధి పాండే స్వాగతోపన్యాసం చేస్తూ,..1963లో కేవలం 20 ప్రాంతీయ పాఠశాలలతో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇపుడు 1,245 విద్యాలయాలతో విస్తృత విద్యా వ్యవస్థగా రూపుదాల్చిందని, దేశవ్యాప్తంగా 13లక్షలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోందని అన్నారు.  కె.వి.ఎస్. విద్యార్థులు విద్యార్జనలో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పుతూ, ఇతర విద్యాసంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. 2020లో జరిగిన సి.బి.ఎస్.ఇ. పరీక్షల్లో కె.వి.ఎస్. అత్యుత్తమ ప్రతిభను చూపిందని, 12వ తరగతి పరీక్షల్లో 98.62 శాతం ఉత్తీర్ణతను సాధించిందని తెలిపారు.

   విద్యార్థుల బహుముఖ అభివృద్ధిలో భాగంగా,  క్రీడలు, ఇతర వ్యాయామ కార్యకలాపాల్లో కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రతిభను చూపిందని చెప్పారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, జిజ్ఞాస, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, విజ్ఞాన శాస్త్ర అవగాహన వంటి అంశాలపై కూడా కె.వి.ఎస్. పూర్తస్థాయిలో దృష్టిని కేంద్రీకరించిందన్నారు.

   కోవిడ్ సంక్షోభ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు అంకిత భావంతో, చిత్తశుద్ధితో విద్యాబోధన కొనసాగించారన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా వారు డిజిటల్/ఆన్.లైన్ మార్గాలను అనుసరించారన్నారు. జాతీయ విద్యావిధానాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు కె.వి.ఎస్. పూర్తిస్థాయి సేవలందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

*****



(Release ID: 1680929) Visitor Counter : 132