ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

*పన్ను ప్రోత్సాహకాల ద్వారా హరిత భవనాల నిర్మాణాల ఆవశ్యకతపై చైతన్యం పెంచాలి*

• ఆర్థిక సంఘాలు, స్థానిక సంస్థలకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

• ఏక గవాక్ష విధానంతో హరిత భవనాలకు త్వరితగతిన అనుమతులు అందించాలి

• భవిష్యత్తులో నిర్మాణాలు హరిత సాంకేతికతతో కొనసాగేలా మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగాలి

• ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలకు సమ ప్రాధాన్యమివ్వడం మనందరి బాధ్యత

• 12వ ‘గృహ’ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపు

Posted On: 15 DEC 2020 1:11PM by PIB Hyderabad

భవిష్యత్తులో జరిగే భవనాల నిర్మాణాన్నీ హరిత సాంకేతికతతోనే జరిగేలా ప్రజల్లో చైతన్యం కలిగించడంకోసం పన్ను ప్రోత్సాహకాలు అందించడంలో ఆర్థిక సంఘాలు, స్థానిక సంస్థలు ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఆన్‌లైన్ పోర్టళ్ళను ఏర్పాటుచేసి ఏకగవాక్ష పద్ధతిలో హరిత భవనాలకు అనుమతులు అందించాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి అంతర్జాల వేదిక ద్వారా 12వ గృహ (గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హబిటాట్ అసెస్‌మెంట్) సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత భవన నిర్మాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఇందుకోసం ఈ రకమైన నిర్మాణాలను ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగం కూడా ప్రోత్సహించాలన్నారు. హరిత భవనాలపై అవగాహన పెంచడం, వీటి ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అందించడంలో మీడియా చురుకైన పాత్రను పోషించాలని ఆయన సూచించారు.

ప్రపంచ హరిత భవన మండలి విడుదల చేసిన వివరాలను ఉటంకిస్తూ.. భవనాల నిర్మాణాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 39శాతం కర్బన వాయువుల ఉద్గారం జరుగుతోందని.. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్బన ఉద్గార రహిత విధానాలను అలవర్చుకుని పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాల్సిన సరైన తరుణం ఇదేనన్నారు.  ‘ఆత్మనిర్భర భారత్’ నిర్మాణ లక్ష్యంతో దూసుకెళ్తున్న భారతదేశంలో.. సుస్థిరాభివృద్ధితోపాటు ప్రకృతి సంరక్షణను ప్రోత్సహించేందుకు పర్యావరణహిత భవనాల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. మన భవనాల నిర్మాణాల్లో వాడుతున్న వస్తువులు కూడా సుస్థిరమైనవిగా ఉండాలని, భవిష్యత్ తరాల అవసరాలను అనుగుణంగా ఉండాలన తెలిపారు.

హరిత భవనాల నిర్మాణాలను ప్రోత్సహించేలా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. భవిష్యత్తులో జరిగే ప్రతి భవన నిర్మాణం హరిత సాంకేతికతతోనే జరగాలన్నారు. భవనాలు మాత్రమే కాదని.. ప్రతి నిర్మాణం హరిత సాంకేతికతతో, పర్యావరణహితమైన పద్ధతిలో జరగాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని మన ప్రాచీన నాగరిక విలువలు, సంస్కృతి-సంప్రదాయాలు మనకు బోధిస్తున్నాయని.. అలాంటి విలువలను తిరిగి ఆచరణలోకి తీసుకొస్తూ మన పూర్వీకులు పాటించిన ప్రకృతి అనుకూల నిర్మాణశైలిని మనం కూడా అమల్లోకి తీసుకురావాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మన ఆధునిక కట్టడాల కారణంగా పిచ్చుకలు కూడా మన ఇళ్లలో ఓ చిన్న గూడును నిర్మించుకోలేకపోతున్నాయన్న ఆయన, ఇది దురదృష్టకరమని, ఇది మన సంప్రదాయం కాదని తెలిపారు. వాతావరణ మార్పులు పెను సవాల్‌గా మారాయన్న ఉపరాష్ట్రపతి.. ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని మన ప్రాథమిక కర్తవ్యంగా ముందుకుతీసుకెళ్లాలన్నారు. మనం ప్రకృతిని గౌరవించుకుంటున్నప్పుడే ఎకానమీ (ఆర్థిక), ఎకోలజీ (పర్యావరణ) సమతూకం సాధ్యమౌతుందని పేర్కొన్నారు. 

ఈ ఏడాది కరోనా సృష్టించిన సమస్యలు, అదే సమయంలో వరదలు, కరువుకాటకాలు, ఉత్కృష్ట వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో సమస్యలను మనం చూశామన్న ఉపరాష్ట్రపతి.. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను వీలైనంతగా నివారించేందుకు ఇవాళ మనం చేసే పనులు మన తర్వాతి తరాలకు మేలు చేసేవిగా ఉండేలా మన ఆలోచనావిధానాన్ని పున:సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 50శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తుందన్న ఆయన, ఇందుకు తగినట్లుగా గృహనిర్మాణ రంగంలో హరిత సాంకేతికత వినియోగాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంటిపైకప్పును చల్లబరిచడంపైనా దృష్టిపెట్టాలన్న ఉపరాష్ట్రపతి.. భారతదేశంలో దాదాపు 60శాతం పైకప్పులు లోహాలు, ఆస్బెస్టాస్, కాంక్రీట్‌లతో నిర్మితమైనవన్నారు. దీని ద్వారా పట్టణప్రాంతాల్లో వేడి మరింత పెరుగుతోందన్న విషయాన్ని గమనించాలన్నారు. చల్లని పైకప్పుల నిర్మాణం ద్వారా ఈ ఉష్ణోగ్రతను 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గించుకోవచ్చన్నారు. వీటికోసం అయ్యే ఖర్చుకూడా చాలా తక్కువేనన్నారు. తక్కువ ఆదాయవర్గాలు కూడా ఈ ఖర్చును భరించేంతగానే ఉంటుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఏసీల వినియోగం కారణంగా భూతాపం పెరుగుతోందన్న అంతర్జాతీయ నివేదికలను ప్రస్తావిస్తూ.. కూల్ రూఫ్స్ (చల్లని పైకప్పు) ద్వారా ఏసీలపై ఆధారపడే అవసరాన్ని కొంతమేరనైనా తగ్గించుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రకృతి సిద్ధమైన కొన్ని రకాల పెయింట్ల ద్వారా కూడా ఈ అవకాశం ఉందని తెలిపారు.

ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)ని అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. దేశమంతా ఒకేవిధంగా ఈ పద్ధతులు అమలు కావడం లేదన్నారు. ఈ నిబంధలను అమలుచేయడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకుంటున్న చొరవను ఉపరాష్ట్రపతి అభినందించారు. నిర్మాణరంగ నిపుణులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులు, నిర్మాణరంగంలోనివారు తదితరులకు క్షేత్రస్థాయిలో హరిత భవనాల నిర్మాణాల విషయంలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

గృహ విభాగం ఏర్పాటైనప్పటినుంచి హరితాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి, ఈ విషయంలో మరింత పురోగతిని కాంక్షిస్తూ.. రూపొందించిన రేటింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే ‘గృహ వర్షన్ -2019’ను ఆవిష్కరించారు. కరోనా సమయంలోనూ గృహ మండలి సుస్థిరాభివృద్ధి అజెండాను అమలు చేయడంలో నిరాటంకంగా కృషిచేయడంతోపాటు బిల్డింగ్ ఫిట్‌నెస్ ఇండికేటర్ (బీఎఫ్ఐ)ను రూపొందించి నిర్మాణసంస్థలు, నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలను కరోనా నుంచి దూరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి, గృహ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ మాథుర్, గృహ కౌన్సిల్ డైరెక్టర్ సీఈవో శ్రీ సంజయ్ సేథ్‌తోపాటు నిర్మాణరంగ ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1680784) Visitor Counter : 174