శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథకాన్ని పెంచే విజ్ఞాన యాత్రలు

ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020పై ప్రచారం లక్ష్యంగా
విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్న వివిధ సంస్థలు

దేశవ్యాప్తంగా30చోట్ల వాటి నిర్వహణకు ఏర్పాట్లు

Posted On: 14 DEC 2020 2:49PM by PIB Hyderabad

   భారతీయ, అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.)పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించే ప్రచారయాత్రే  విజ్ఞాన యాత్ర.  విజ్ఞానయాత్రలో భాగంగా సంచార విజ్ఞాన ప్రదర్శన వాహనాలు దేశంలోని పలు నగరాలనుంచి యాత్రను ప్రారంభిస్తాయి. శాస్త్రీయ అవగాహనను ప్రోత్సహించడం, సామాన్య ప్రజలలో వైజ్ఞానిక సంస్కృతిని పెంపొందించడం ఈ వైజ్ఞానిక పయనాల ఉద్దేశం. విజ్ఞాన శాస్త్రపరంగా చిన్నారులను, యువకులను ఇది చైతన్యవంతం చేస్తుంది.  వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల, విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఈ సంచార వాహనాలను తిలకించవచ్చు. దీనితో వైజ్ఞానిక శాస్త్రంపై వారిలో ఆసక్తి, ఐ.ఐ.ఎస్.ఎఫ్.పై అవగాహన ఏర్పడుతుంది.  ఐ.ఐ.ఎస్.ఎఫ్. 6వ వేడుకలను ఈ సారి కోవిడ్-19 కారణంగా వర్చువల్ విధానంలో ఆన్.లైన్ ద్వారా నిర్వహించబోతున్నారు. విజ్ఞాన యాత్రల నిర్వహణకు దేశవ్యాప్తంగా  30 ప్రదేశాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జరిగే విజ్ఞాన యాత్రల్లో ప్రతిభావంతులైన వైజ్ఞానిక ప్రచారకర్తలను, సృజనాత్మక నిపుణులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను, పరిశోధనా విద్యార్థులను సముచితంగా సత్కరిస్తారు.

  ఇలాంటి ఒక విజ్ఞాన యాత్రను కోల్‌కతాలోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (ఐ.ఎ.సి.ఎస్.) ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది.  ఐ.ఎ.సి.ఎస్. డైరెక్టర్ ప్రొఫెసర్ శంతనూ భట్టాచార్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఎఫ్.ఆర్.ఎస్.) పద్మవిభూషణ్  ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ,  అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం ప్రాముఖ్యతను, విలక్షణమైన విజ్ఞాన యాత్రల ఆవశ్యకతలను, యాత్రల ఫలితాలను  వివరించారు.  విజ్ఞానభారతి సంస్థ జాతీయ కార్యదర్శి  ప్రవీణ్ రామ్‌దాస్ ప్రారంభోన్యాసం చేశారు.  మొహాళీకి చెందిన ఇన్.స్టిట్యూట్ ఆఫ్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ.ఎన్‌.,ఎస్.టి. ) డైరెక్టర్ ప్రొఫెసర్ అమితావ పాత్రా,  అణు భౌతిక శాస్త్ర అధ్యయన సంస్థకు చెందిన ప్రొఫెసర్ వై. సుధాకర్,  ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి. ప్రొఫెసర్ పార్థా ప్రతీం చక్రవర్తి, ఉపన్యాసాలు చేశారు. ధన్ బాద్ కు చెందిన సి.ఎస్.ఐ.ఆర్.- మైనింగ్, ఫ్యూయెల్ రీసెర్చ్ సెంట్రల్ ఇన్.స్టిట్యూట్ కూడా యూట్యూబ్ వేదిక ద్వారా దేశంలోని తూర్పు ప్రాంతానికి ప్రాతినిధ్యంతో విజ్ఞాన యాత్రను నిర్వహించింది. 

 ఇదే పద్థతిలోనే గోవాకు చెందిన సి.ఎస్.ఐ.ఆర్.-జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్.ఐ.ఒ.) కూడా కార్యక్రమం నిర్వహించింది. సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఐ.ఒ. డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ సింగ్ ప్రారంభోన్యాసం చేశారు. సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్, విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా శాఖ (డి.ఎస్.ఐ.ఆర్.) కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి. మాండే అధ్యక్షోపన్యాసం చేస్తూ, ఈ సైన్స్ ఉత్సవం సమాజంలోని ప్రతివర్గాన్ని ప్రభావితం చేస్తుందని, ప్రతి వర్గానికి ప్రయోజనం అందిస్తుందని చెప్పారు. విజ్ఞాన భారతి (విభా) జాతీయ నిర్వహణా కార్యదర్శి  జయంత్ సహస్ర బుధే గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 వేడుకలోని ప్రధాన అంశాలను, వాటి ప్రాముఖ్యతను గురించి వివరించారు. “విజ్ఞాన భారతి, ఐ.ఐ.ఎస్.ఎఫ్.” ఇతివృత్తంపై ప్రసంగించారు.

  న్యూఢిల్లీకి చెందిన కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.పి. గౌతమ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. “జీవం ఆవిర్భావం, పరిణామం” అనే ఇతివృత్తం తన అభిప్రాయాలను పంచుకున్నారు. గోవాకు చెందిన విజ్ఞాన్ పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సుభాష్ గాడ్సే వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

మణిపూర్ లోని ఇంఫాల్ కు చెందిన జీవ వనరులు, సుస్థిర అభివృద్ధి అధ్యయన సంస్థ (ఐ.బి.ఎస్.డి.) కూడా విజ్ఞాన యాత్ర పేరిట ఒక కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐ.బి.ఎస్.డి. డైరెక్టర్ ప్రొఫెసర్ పులోక్ కె. ముఖర్జీ స్వాగతోపన్యాసం చేశారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 వేడుకలను క్లుప్తంగా వివరించారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ ప్రారంభోపన్యాసం చేశారు.

    విజ్ఞాన శాస్త్ర ఉత్సవం ధ్యేయం, లక్ష్యాల గురించి, అందులో చేపట్టబోయే వివిధ కార్యక్రమాల గురించి విజ్ఞాన భారతి సంస్థ జాతీయ నిర్వహణా కార్యదర్శి జయంత్ సహస్రబుధే వివరించారు. న్యూఢిల్లీకి చెందిన ఐ.బి.ఎస్.డి. శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ అనామికా గంభీర్, ఇంఫాల్.లోని జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్.ఐ.టి.) డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ సూత్రధార్, కోల్కతా కు చెందిన సి.ఐ.ఎస్.ఆర్. భారతీయ రసాయన జీవశాస్త్ర సంస్థ (ఐ.ఐ.సి.బి.) డైరెక్టర్ డాక్టర్ అరుణ్ బందోపాధ్యాయ, షిల్లాంగ్ (మేఘాలయ) కు చెందిన నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్స్ అండ్ రీసెర్చ్ (నెక్టార్-ఎన్.ఇ.సి.టి.ఎ.ఆర్.) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ, విజ్ఞాన భారతి సంస్థకు చెందిన శ్రీప్రసాద్ ఎం. కుట్టన్  ప్రసంగించారు.

  ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020పేరిట ఆరవ భారతీయ అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవాన్ని ఈ నెల 22నుంచి 25వరకూ వర్చువల్ పద్ధతిలో పెద్దఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవానికి విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) సమన్వయకర్తగా, న్యూఢిల్లీకి చెందిన జాతీయ విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి అధ్యయనాల సంస్థ (సి.ఎస్.ఐ.ఆర్.-నిస్టాడ్స్) నోడల్ సంస్థగా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి.

 

*****



(Release ID: 1680661) Visitor Counter : 172