సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

3,078మంది దివ్యాంగులకు, 321మందివయోజనులకు సహాయక ఉపకరణాల పంపిణీ

వర్చువల్ ఎ.డి.ఐ.పి. శిబిరాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి తవర్.చంద్ గెహ్లోట్

Posted On: 10 DEC 2020 5:40PM by PIB Hyderabad

దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేందుకు అస్సాంలోని దర్రంగ్ నగరంలో ఈ రోజు చేపట్టిన బ్లాక్ స్థాయి పంపిణీ శిబిరాన్నికేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తవర్ చంద్ గెహ్లోట్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోని ఎ.డి.ఐ.పి. పథకం, వయోజనులపట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) కింద భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ (ఐ.ఆర్.ఎఫ్.సి.) గుర్తించిన దివ్యాంగులకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వం అమలు జరిపే రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  అస్సాం, మంగళ్.దోయ్ పార్లమెంటు సభ్యుడు దిలీప్ సైకియా అధ్యక్షత వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లోట్ మాట్లాడుతూ,  వివిధ రకాల పథకాలు, కార్యక్రమాల అమలు ద్వారా దేశంలోని దివ్యాంగుల సంక్షేమానికి,  అభ్యన్నతికి తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ఎ.డి.ఐ.పి. పంపిణీ శిబిరాలను వర్చువల్ పద్ధతిలో ఆన్.లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణతో దేశవ్యాప్తంగా  ఇప్పటివరకూ 10 గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులను సృష్టించినట్టు చెప్పారు. దివ్యాంగ విద్యార్థులు స్వావలంబనతో ఎదిగేందుకు వీలుగా వారికి ఉపకార వేతనాలను అందించేందుకు అనేక పథకాలను చేపట్టినట్టు చెప్పారు. దివ్యాంగలకు బాసటగా నిలిచే అనేక ముఖ్యమైన పథకాలను ఆయన వివరించారు. మధ్యప్రదేశ్ లోని సెహోర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ మానిసిక ఆరోగ్య, పునరావాస సంస్థ, మానసిక రుగ్మతా సమస్యల పరిష్కారం కోసం నెలకొల్పిన కిరణ్ మానసిక ఆరోగ్య, పునరావాస హెల్ప్ లైన్, గ్వాలియర్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడా కేంద్రం తదితర అంశాలను కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  అస్సాంలోని దర్రంగ్ జిల్లాలోని 3,399మంది దివ్యాంగ లబ్ధిదారులకు రూ. 228.36లక్షల విలువైన రకరకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. మొత్తం 6,482 ఉపకరణాలను పంపిణీ చేశారు. బ్లాక్ స్థాయిలో పలు రకాల పంపిణీ శిబిరాల ద్వారా వీటిని లబ్ధిదారులకు అందించారు.  ఎ.డి.ఐ.పి. పథకం కింద మొత్తం 2,724మంది దివ్యాంగులు, 321మంది వయోవృద్ధులకు సంబంధించి ఇదివరకే గుర్తింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను నిర్వహించారు. గత ఏడాది జూలై ఆగస్టు నెలల్లో భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (అలిమ్కో-ఎ.ఎల్.ఐ.ఎం.సి.ఒ.) ఈ శిబిరాలను నిర్వహించింది.

       దీనికి తోడు,.. భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ, తన కార్పొరేట్ సామాజిక బాధ్యతా చర్యల్లో భాగంగా,  745 కేటగిరీల కింద పలు ఉపకరణాల పంపిణీకి దర్రంగ్ జిల్లాకు చెందిన మరో 354మంది దివ్యాంగులను ఎంపిక చేశారు. రూ. 44.70 లక్షల విలువైన ఉపకరణాలను అందంచేందుకు నిర్ణయించారు. అంగవికలులకోసం 93 యాంత్రిక సైకిళ్లు, 3 యాంత్రిక వీల్ చైర్లు, దృష్టిలోపం కలిగిన వారికి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ కేన్లు, డైసీ ప్లేయర్లు, టాబులు, వినికిడి పరకరాలు, ఇతర సహాయక పరికరాలు వారికి పంపిణీ చేయనున్నారు.

  వివిధ బ్లాకుల్లో దివ్యాంగులకు పంపిణీ చేయబోయే ఉపకరణాలు ఈ విధంగా ఉన్నాయి. 699 టైసైకిళ్లు, 569 వీల్ చైర్లు, 121 సి.పి. చైర్లు, 2,137 ఊతకర్రలు, 472 వాకింగ్ స్టిక్కులు, 80 రోలేటర్లు, 140 స్మార్ట్ కేన్లు, 57 ఫోల్డబుల్ కేన్లు, 2 స్మార్ట్ ఫోన్లు, 2 ట్యాబులు, 4 డైసీ ప్లేయర్లు, 24 బ్రెయిలీ కిట్లు, 1,174 వినికిడి ఉపకరణాలు, మానసికంగా ఎదుగుదలలేని వారికి 376 ఎం.ఎస్.ఐ.డి. కిట్లు, 227 టెట్రాప్యాడ్లు/ట్రైప్యాడ్లు, వయోజనులకోసం 305 వాకర్లను ఆయా కార్యక్రమాల్లో పంపిణీ చేస్తారు.

 

  కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిర్వహణా నియమాలకు అనుగుణంగా ఈ శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నవారంతా మాస్కుల ధరించి, భౌతిక దూరం పాటించారు.  స్థానిక ప్రజాప్రతినిధులు, సాధికారత శాఖకు చెందిన సీనియర్ అధికారులు, దివ్యాంగులు, కేంద్ర ప్రభుత్వం, దర్రాంగ్ జిల్లా యంత్రాంగానికి, అస్సాం సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.

   కేంద్ర అంగవికలుల సాధికారతా శాఖ ఆధ్వర్యంలోని కాన్పూరుకు చెందిన భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (అలిమ్కో) ఈ శిబిరాన్ని నిర్వహించింది. అస్సాం సాంఘిక సంక్షేమ శాఖ, దర్రంగ్ జిల్లా పరిపాలనా యంత్రాంగం సహకారంతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది. 

 

*****

 

 

 



(Release ID: 1679872) Visitor Counter : 97