నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం 'ఇరెడా'తో ఎస్‌జేవీఎన్ ఎంవోయూ
Posted On:
07 DEC 2020 5:38PM by PIB Hyderabad
భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఇరెడా)తో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. నూతన&పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యం పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ ఇరెడా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం తన సేవలను ఎస్‌జేవీఎన్‌కు అందిస్తుంది. ఎస్‌జేవీఎన్ సీఎండీ శ్రీ నందలాల్ శర్మ, ఇరేడా సీఎండీ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండు సంస్థల అత్యున్నత, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవగాహన ఒప్పందం ప్రకారం, పునరుత్పాదక ఇంధనం, ఇంధన సమర్థత&పరిరక్షణ ప్రాజెక్టుల సాంకేతిక-ఆర్థిక బాధ్యతలను ఎస్‌జేవీఎన్ తరపున ఇరెడా చేపడుతుందని శ్రీ నందలాల్ శర్మ వెల్లడించారు. వచ్చే ఐదేళ్ల వరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన, సముపార్జన కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి కూడా ఎస్‌జేవీఎన్‌కు ఇరెడా సాయం అందిస్తుందన్నారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం సాధించాలన్న ప్రధాని మాటలను వాస్తవరూపంలోకి తేవడానికి ఎస్‌జేవీఎన్ కట్టుబడి ఉందని శ్రీ శర్మ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిన ఎస్‌జేవీఎన్, గుజరాత్‌లో 100 మెగావాట్ల ధొలేరా సౌర విద్యుత్ ప్రాజెక్టును, 100 మెగావాట్ల రఘన్‌సేద సౌర విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఎస్‌జేవీఎన్, ఇరెడా భాగస్వామ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, రెండు సంస్థలకు ఇది లాభదాయకమని శ్రీ శర్మ చెప్పారు.
ప్రధాని విజన్ అయిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా, పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధికి ఇరెడా చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ అవగాహన ఒప్పందం గుర్తు చేస్తుందని శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. "ఇరెడా, ఎస్‌జేవీఎన్ కలిసి పనిచేసేందుకు సంపూర్ణ సమన్వయాన్ని నిర్మించే మంచి అవకాశమిది. దేశ సుస్థిర అభివృద్ధిలో భాగమయ్యేలా; విజ్ఞానం, సాంకేతికత మార్పిడి, సంప్రదింపులు, పరిశోధన సేవలను కూడా ఈ ఒప్పందం అందిస్తుంది. పునరుత్పాదక శక్తి రంగ అభివృద్ధి కోసం ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలకు మా సంప్రదింపు సేవలను విస్తరించాలని యోచిస్తున్నాం" అని శ్రీ దాస్ వెల్లడించారు.
***
(Release ID: 1678965)
Visitor Counter : 223