ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కరోనా నేపథ్యంలో భారత మత్స్యరంగ ప్రాధాన్యత మరోసారి రుజువైంది- ఉపరాష్ట్రపతి

మత్స్యసంపద పోషక ప్రయోజనాల గురించి అవగాహన పెరగాలని పిలుపు

భారతదేశ వార్షిక ఉత్పత్తి - డిమాండ్ - సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా కృషి జరగాలని సూచన

మత్స్యరంగానికి రుణాలు, మౌలిక సదుపాయాలు, మార్కెట్ సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు

మత్స్య ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్ష

‘న్యూట్రాస్యూటికల్స్’, ‘ఆర్నమెంటల్ ఫిష్’ వంటి వినూత్న ఉత్పత్తుల ద్వారా భారతీయ సముద్ర జీవసంస్కృతి వైవిధ్యం పెరగాలని పిలుపు

సముద్ర, మంచినీటి కాలుష్యం మరియు యంత్రాల ద్వారా అధిక చేపలు పట్టడం గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

పరిశుభ్రమైన మరియు ఆకర్షణీయమైన చేపల మార్కెట్లను అభివృద్ధి చేయమని మున్సిపల్ సంస్థలకు సూచన

మన ప్రజలకు పోషకారాన్ని అందించి, ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగాలి

విశాఖపట్నంలోని సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ మరియు సి.ఐ.ఎఫ్.టి. సంస్థలను సందర్శించి శాస్త్రవేత్తలు, సిబ్బందితో సంభాషించిన ఉపరాష్ట్రపతి

మత్స్యకారుల శ్రేయస్సే.. పరిశోధనలు, అభివృద్ధి ఫలాల అంతిమలక్ష్యం కావాలని శాస్త్రవేత్తలకు సూచన

Posted On: 07 DEC 2020 5:19PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి భారతీయ మత్స్యరంగ ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పిందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల దిశగా ప్రజలను చైతన్య పరచిందని, కరోనా అనంతరం కూడా ఇదే తరహా పోషకాహార అలవాట్లు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

విశాఖపట్నంలోని  సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ) మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిషరీస్ టెక్నాలజీ (సి.ఐ.ఎఫ్.టి) సంస్థలను సందర్శించిన ఉపరాష్ట్రపతి, అక్కడి శాస్త్రవేత్తలు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. చేపల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా పిల్లల పోషకాహార లోపం నివారణలో ఇవి ఎంతగానో ప్రయోజనకరమని తెలిపారు. ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులకు సూచించారు. చేపల్లో ఒమేగా త్రీ ప్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, ఇవి మన శరీరంతో పాటు గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుస్తాయని, ఈ విషయాన్ని సామాన్యుల వరకూ తీసుకువెళ్ళాల్సిన బాధ్యతను వైద్యులు, ఆహార నిపుణులు తీసుకోవాలని పేర్కొన్నారు. 

సహజసిద్ధమైన హిమనీ నదాల నుంచి 8 వేల కిలో మీటర్ల తీర ప్రాంతం వరకూ భారతదేశంలో విస్తారమైన జల వనరులను కలిగి ఉందన్న ఉపరాష్ట్రపతి, ఈ జలాల్లో అనేక రకాల చేపలు, జంతు సంపదతో అనేక తరాల నుంచి లక్షలాది ప్రజల జీవనోపాధి విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మొత్తం మత్స్య ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్న ఉపరాష్ట్రపతి, లోతట్టు మరియు సముద్ర మత్స్య సంపదను ఉపయోగించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమగా ప్రారంభమై, గత కొన్ని దశాబ్ధాలుగా మత్స్య పరిశ్రమ మన దేశానికి అత్యంత కీలకమైన సామాజిక, ఆర్థిక శక్తిగా ఎదిగిందన్న ఆయన, ప్రస్తుతం భారత తీరం దాదాపు 15 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. మత్స్య సంపద ఎగుమతిలో ప్రపంచంలో నాలుగో స్థానంలో భారతదేశం ఉందని, విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించేందుకు ఈ రంగం మరింత కీలకమైందని, ఈ నేపథ్యంలో మత్స్య సంపద ఎగుమతుల్లో భారతదేశం మొదటి స్థానానికి చేరుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

పెరుగుతున్న జనాభా మరియు జంతు ప్రోటీన్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశయ అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డ ఉపరాష్ట్రపతి, భారతదేశంలో విస్తారమైన చేపల వార్షిక ఉత్పత్తి ద్వారా డిమాండ్ మరియు సరఫరాల్లో అంతరాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. క్యాప్చర్ ఫిషరీస్ మరియు డీప్ సీ ఫిషింగ్ మాత్రమే డిమాండ్ ను తీర్చలేవన్న ఆయన, అభివృద్ధి చెందుతున్న సముద్ర చేపల సంస్కృతి మరింత ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. 8 వేల కిలోమీటర్ల తీర ప్రాంతం ద్వారా అభివృద్ధికి ఆస్కారం ఉందన్న ఉపరాష్ట్రపతి, చేపల ఉత్పత్తిని మరింత పెంచేందుకు మేరీకల్చర్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ. మరియు సి.ఐ.ఎఫ్.టి. చేపడుతున్న కార్యక్రమాలను అభినందించిన ఆయన, ఈ దిశగా మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

చాలా ఏళ్ళ నుంచి నాణ్యమైన చేపల వంగడాల లభ్యత లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, పరిశోధనా సంస్థలు చేస్తున్న కృషి ఈ సమస్యకు గణనీయమైన స్థాయిలో పరిష్కారాన్ని చూపించిందని, అయితే ఈ విషయంలో ఆవిష్కరణలకు మరింత భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పుష్కలమైన ఉత్పత్తితో పాటు మంచి నాణ్యత, మెరుగైన గ్రేడింగ్, నాణ్యత యోగ్యత మరియు ప్యాకేజింగ్ ద్వారా విశ్వసనీయతను కొనసాగస్తూ మన మత్స్య సంపద విలువను మరింత పెంచుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి.. న్యూట్రాస్యూటికల్స్, ఆర్నమెంటల్ ఫిషెష్ వంటి వినూత్న ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత సముద్ర సంస్కృతి వైవిధ్యతను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. శీతల గిడ్డంగుల వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయడం ద్వారా నష్టాలను తగ్గించడంపై దృష్టిపెట్టాలని సూచించిన ఆయన.. స్వచ్ఛమైన మరియు ఆకర్షణీయమైన చేపల మార్కెట్ల రూపొందించడంపై మునిసిపల్ సంస్థలు ప్రత్యేక ఆసక్తిని చూపాలని పిలుపునిచ్చారు. 

వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, దురదృష్టవశాత్తు సముద్ర మట్టాలు పెరగడం, మహా సముద్రాలు వేడెక్కడం, మరియు సముద్ర ఆమ్లీకరణ లాంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా సముద్ర జీవజాతులు, వాటి మీద ఆధారపడిన వారి జీవనాలు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. 

సముద్రజలాలు, మంచినీటి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్యకారకాల వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించి అరికట్టకపోతే సముద్ర జీవజాతితోపాటు మానవ మనుగడకు కూడా పెనుసవాల్ ఎదురుకానుందని తెలిపారు. సముద్రం మధ్యలోకి వెళ్లి యంత్రాల సాయంతో అవసరాన్ని మించి జరుగుతున్న చేపల వేట సరైంది కాదని తద్వారా సముద్ర సంపద దోపిడీ జరుగుతోందన్నారు. దీని ద్వారా చిన్న, మధ్యతరహా మత్స్యకారులపై పెను ప్రభావం పడుతోందని ఉపరాష్ట్రపతి అన్నారు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రాలనుంచి వచ్చే ప్రాథమిక ఉత్పత్తి ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే 6 శాతం తగ్గనుందని, ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది 11 శాతం తగ్గవచ్చన్న అంతర్జాతీయ అంచనాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. 

భారతదేశంలో మత్స్యకార సంబంధింత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. వనరుల సుస్థిర నిర్వహణ, వాతావరణ మార్పుల కారణంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడం.. వసతులను మెరుగుపరచడం ద్వారా మెరుగైన ధరను కల్పించడం, విలువను మరింత పెంచడం తదితర అంశాలపై దృష్టిసారించడం.. మత్స్యపరిశ్రమ ఉత్పత్తిని పెంచేందుకు అక్వాకల్చర్‌లో సాంకేతికతను పెంచుతూ సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటి మూడు పద్ధతులను ఉపరాష్ట్రపతి తెలియజేశారు.

మత్స్యపరిశ్రమను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై), పర్యావరణానుకూల పద్ధతులను ప్రోత్సహించడం, ఆర్థికంగా లాభసాటిగా ఉండటం, సామాజిక సమగ్రత తదితర లక్ష్యాలతో త్వరలో రానున్న జాతీయ మత్స్యపాలసీని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

రుణసదుపాయం కల్పించడం, శీతల గిడ్డంగుల ఏర్పాటు, విదేశాల్లోని మార్కెట్లతో అనుసంధానం, ఉన్నతస్థాయి మౌలికవసతుల కల్పన, నిల్వతోపాటు విలువను పెంచేందుకు అవసరమైన అంశాలపై మరింత దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని సైతం ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. పరిశోధన సంస్థల్లోజరిగే అధ్యయనాలు, ప్రయోగాల మద్దతు.. చేపలు, రొయ్యల చెరువుల్లో ప్రైవేటు పెట్టుబడులు, ఆక్వాకల్చర్ ఎస్టేట్‌లు, ఫీడ్ మిల్లులు, సహాయక పరిశ్రమల ఏర్పాటు వంటివి.. ఈ రంగాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన తెలిపారు.

శాస్త్రవేత్తల పరిశోధనలు మత్స్యకారుల జీవితాలను మెరుగు పరిచేందుకు ఉపయోగపడాలని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి, ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాలని సి.ఎం.ఎఫ్.ఆర్.ఐ మరియు సి.ఐ.ఎఫ్.టి. శాస్త్రవేత్తలకు సూచించారు. కరోనా సమయంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసిన అన్నదాతలను ప్రశంసించిన ఆయన చేపల రైతులతో సహా రైతులందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. 

వినూత్న సముద్ర చేపల ఉత్పత్తి మరియు మెరుగైన విస్తరణ కార్యక్రమాల ద్వారా చిన్న మత్స్యకారులను అధునిక స్థిరమైన పద్ధతులను అవలంబించే దిశగా ప్రోత్సహించే దిశగా దృష్టి కేంద్రీకరించిన పరిశోధనా సంస్థలకు సూచించిన ఉపరాష్ట్రపతి, చేపల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెరుగుతోందని, దీనికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే భవిష్యత్ చేపల పెంపకం మరింత లాభదాయకంగా మారుతుందని, ఫలితంగా ఈ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది మందికి ఆర్థిక దన్ను కల్పించగలమని తెలిపారు. నీలి విప్లవం ప్రధాన ఉద్దేశం అదేనని నొక్కి చెప్పారు. మన పొడవైన తీర ప్రాంతం మన బలహీనత కాదన్న ఆయన, వాటిని సరైన విధంగా వినియోగించుకోవడం ద్వారా మన ప్రజలకు ఆహారాన్ని అందిచటంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. 

శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ముందు విశాఖపట్నంలోని సి.ఎమ్.ఎఫ్.ఆర్.ఐ మరియు సి.ఐ.ఎఫ్.టి. ప్రదర్శనల శాలలను సైతం ఉపరాష్ట్రపతి సందర్శించి, మత్స్యరంగంలో వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కోవిడ్ 19 మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఉపరాష్ట్రపతి ఓ శాస్త్రీయ సంస్థను సందర్శించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన స్నాపర్ సీడ్స్ ను దేశానికి అంకితం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ముత్తం శెట్టి శ్రీనివాసరావు, ఐ.సి.ఏ.ఆర్-సి.ఎమ్.ఎప్.ఆర్.ఐ. సంచాలకు డా. ఏ. గోపాల కృష్ణన్, ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.ఎఫ్.టి. పరిశోధనా సంస్థల ఎస్.ఐ.సి. డా. ఆర్. రఘు ప్రకాష్, మేనేజింగ్ కమిటీ మెంబర్ శ్రీ కె. మురళీధరన్, సంస్థ కార్యనిర్వాహణ అధికారి శ్రీ సుభాదీప్ ఘోష్ సహా పలువురు శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

***


(Release ID: 1678888) Visitor Counter : 214