ఉప రాష్ట్రపతి సచివాలయం
మహిళలకు సరైన గౌరవంతో అన్నింటా సౌభాగ్యం: ఉపరాష్ట్రపతి
- దీర్ఘకాలం పురుషాధిక్య ప్రపంచంగా కొనసాగకూడదు.. అతివలకూ అవకాశం కల్పించాలి
- మద్రాసు హైకోర్టులో 13మంది మహిళా న్యాయమూర్తులుండటంపై హర్షం వ్యక్తం చేసిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
- రాజకీయ నాయకులు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు
- యువత, రాజకీయాల్లోకి రావాలనుకునేవారు మాజీ ప్రధాని శ్రీ ఐకే గుజ్రాల్‌గారిని ఆదర్శంగా తీసుకోవాలి- ఐకే గుజ్రాల్ జయంతి సందర్భంగా స్మారక స్టాంపు విడుదల చేసిన ఉపరాష్ట్రపతి
Posted On:
04 DEC 2020 1:09PM by PIB Hyderabad
అన్నిరంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు కల్పించి గౌరవించుకున్నప్పుడే అన్నిచోట్లా సౌభాగ్యం వెల్లివిరుస్తుందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోనూ మహిళలకు సరైన అవకాశాలు కల్పించి.. విధానపరమైన నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేయాల్సిన తక్షణావసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టులో 13 మంది మహిళా న్యాయమూర్తులు ఉండటంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. ఇది మరింత పెరగడం ద్వారా మహిళలు న్యాయవ్యవస్థలోకి వచ్చేందుకు స్ఫూర్తి కలిగించగలమన్నారు.
మాజీ ప్రధాని శ్రీ ఇంద్రకుమార్ గుజ్రాల్ జయంతి సందర్భంగా.. వారి స్మారక పోస్టల్ స్టాంపును చెన్నై రాజభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వివిధ రంగాల్లో మహిళల నాయకత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరముంది. దేశంలోనే అత్యధికంగా మద్రాస్ హైకోర్టులో 13 మంది మహిళా న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామం. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు’ అని పేర్కొన్నారు. ఈ చొరవతో పాటు సుప్రీంకోర్టులోనూ మహిళాన్యామూర్తుల సంఖ్యను పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా న్యాయ, శాసన వ్యవస్థల్లో మహిళలకు తగినంత అవకాశాలను పెంచే దిశగా అన్ని భాగస్వామ్య పక్షాలు కృషిచేయాలన్నారు.
రాజకీయాలతోపాటు ప్రజాపాలన, కార్పొరేట్ పాలన, పౌర సమాజం సంస్థల్లో భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మహిళల పాత్ర గణనీయంగా పెరగడంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ఈ దిశగా మహిళల సంఖ్య మరింతగా పెరగాలని దీనికై ప్రోత్సహించాలన్నారు. 17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. మొత్తం ఎంపీల సంఖ్యలో ఇది 14శాతం మాత్రమేనన్నారు. స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లను అమలుచేయడం ద్వారా చాలా మంది అతివలు తమ సత్తాచాటుతున్నారని వారి నాయకత్వ ప్రతిభను చాటుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది పురుషాధిక్య ప్రపంచమనే భ్రమల్లోనుంచి బయటకు వచ్చి.. మహిళలకు అవకాశాలివ్వాలన్నారు. లింగ వివక్ష ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు.
మాజీ ప్రధాని శ్రీ ఐకే గుజ్రాల్‌కు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. శ్రీ గుజ్రాల్ మృదు స్వభావి, విద్యావంతుడు, మర్యాదస్తుడైన రాజకీయ వేత్త అని ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన సిద్ధాంతాలను వదలకుండా ముందుకెళ్లిన వ్యక్తి అని తెలిపారు. ‘స్నేహపూర్వకమైన వ్యక్తిత్వం, మర్యాదపూర్వకంగా వ్యవహరించే వారి తత్వంతోపాటు రాజకీయాలకు అతీతంగా అందరితోనూ సత్సంబంధాలు వారిని మరింత ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నిరాడంబరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయితగా వారి జీవిత సందేశాన్ని నేటి యువత చదివి ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో శ్రీ గుజ్రాల్ ప్రతిపాదించిన ‘గుజ్రాల్ సిద్ధాంతం’ను కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నవారంతా ఇతర పార్టీల వారిని ప్రత్యర్థులుగా భావించాలి తప్ప శత్రువులుగా కాదని ఉద్బోధించారు. దేశానికి సంబంధించిన అంశాల్లో వ్యక్తిగత, పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి ‘అన్నింటికంటే దేశమే ముందు’ అనే భావనతో పనిచేయాలని సూచించారు.
ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం ఉండే దక్షిణాసియాను ప్రతిబింబించే సార్క్ దేశాలు సమన్వయంతో పనిచేస్తూ అన్నిరంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్న ఉపరాష్ట్రపతి, ఉగ్రవాదం విషయంలో మాత్రం ఎలాంటి అలసత్వం వహించకూడదని సూచించారు. అభివృద్ధికి శాంతిపూర్వక వాతావరణం అత్యంత ఆవశ్యకమని, పొరుగుదేశాలు స్నేహపూర్వక సంబంధాలను ఏర్పర్చుకోవడం చాలా అవసరమని, దురదృష్టవశాత్తూ మన పొరుగుదేశం కొన్నేళ్లుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా ఐక్యరాజ్యసమితి మరింత చొరవతీసుకుని.. భారతదేశం ప్రతిపాదించిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు’ను నిర్వహణలో ఆలస్యం చేయకూడదని తెలిపారు. దక్షిణాసియా ప్రాంతంలో పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి వంటి సవాళ్లను పరిష్కరించుకుని అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారికి పూర్తిస్థాయిలో టీకా అమల్లోకి వచ్చేంతవరకు అలసత్వం వహించకూడదన్న ఉపరాష్ట్రపతి, ప్రభుత్వం, వైద్యులు సూచించినట్లుగా మాస్కు, సురక్షిత దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు శ్రీ నరేశ్ గుజ్రాల్, మాజీ ఎంపీ శ్రీ తర్లోచన్ సింగ్, తమిళనాడు సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీ బి.సెల్వకుమార్, తమిళనాడు సిటీ రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ శ్రీమతి సుమతి రవిచంద్రన్‌తోపాటు పలువురు ప్రముఖులు, శ్రీ ఐకే గుజ్రాల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
***
(Release ID: 1678477)
Visitor Counter : 179