ఆర్థిక మంత్రిత్వ శాఖ

శుక్రవారం 63వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న డీఆర్‌ఐ


వాణిజ్య ఆధారిత మనీ లాండరింగ్‌పై వర్చువల్ ప్యానెల్ చర్చ

Posted On: 03 DEC 2020 7:31PM by PIB Hyderabad

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), శుక్రవారం 63వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోబోతోంది. కొవిడ్‌ దృష్ట్యా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి, ఈ ఏడాది వేడుకలను వర్చువల్‌ పద్ధతిలో జరపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌, సహాయ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ ఏడాది వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా, 'వాణిజ్య ఆధారిత మనీ లాండరింగ్‌' అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చ జరపనున్నారు. ఆస్ట్రేలియన్‌ బోర్డర్‌ ఫోర్స్‌, హెచ్‌ఎం రెవెన్యూ అండ్‌ కస్టమ్స్‌, కస్టమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ది నెదర్లాండ్స్‌, ఇంటర్‌పోల్‌ ఈ చర్చల్లో పాల్గొంటాయి.

 డీఆర్‌ఐ గురించి

 డీఆర్‌ఐ, ఆరు దశాబ్దాలకు పైగా దేశ, విదేశాల్లో విధులు నిర్వహిస్తోంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, మానసిక ఆరోగ్య సంబంధిత పదార్థాలు, బంగారం, వజ్రాలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణి సంబంధిత వస్తువులు, ప్రమాదకర, పర్యావరణ ప్రభావిత పదార్థాలు, పురాతన వస్తువుల వంటివాటిని అక్రమంగా రవాణా చేసే వ్యవస్థీకృత నేర బృందాలను అడ్డుకుంటోంది. వాణిజ్య, పన్ను సంబంధిత మోసాలు, వాణిజ్య ఆధారిత మనీ లాండరింగ్, నల్లధనం గుట్టు విప్పడంలోనూ డీఆర్‌ఐకి నైపుణ్యముంది. అంతర్జాతీయ కస్టమ్స్ సహకారాల్లో డీఆర్‌ఐ ముందు వరుసలో ఉంది. సమాచార మార్పిడి, ఉత్తమ పద్ధతులను నేర్చుకునేందుకు 60కి పైగా దేశాలతో కస్టమ్స్ పరస్పర సహాయ ఒప్పందాలు చేసుకుంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో డీఆర్‌ఐ తన ఉనికిని గొప్పగా చాటింది. 412 స్మగ్లింగ్ కేసులను గుర్తించడంలో సత్వర చర్యలు తీసుకుంది. దీనివల్ల రూ.1,949 కోట్ల విలువైన నిషేధిత వస్తువులు దొరికాయి. మాదకద్రవ్యాలు, మానసిక వైద్య సంబంధిత వస్తువుల రవాణాను అడ్డుకోవడానికి దేశం చేస్తున్న పోరాటంలో డీఆర్‌ఐ ముందు నిలిచింది. మహారాష్ట్రలో ఎఫెడ్రిన్‌ ఉత్పత్తి చేస్తున్న రెండు కర్మాగారాల గుట్టును రట్టు చేసింది. సహజ ఆవాసాలు, వన్యప్రాణులను కాపాడటానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా జంతువులు, పక్షుల రవాణాను అడ్డుకోవడంతో పాటు ఎర్రచందనం స్మగ్లర్ల వెన్నులోనూ వణుకు పుట్టించింది. 174.5 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రజారోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా, అక్రమంగా చేరవేస్తున్న దాదాపు రూ.77 కోట్ల విలువైన సిగరెట్లను డీఆర్‌ఐ అడ్డుకుని స్వాధీనం చేసుకుంది. అంతేగాక, వక్క గింజలు, ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను కూడా గుర్తించి, నిరోధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో, మాఫియా సామ్రాజ్యాన్ని దెబ్బకొడుతూ 837 మంది ఆర్థిక నేరస్తులను డీఆర్‌ఐ అరెస్టు చేసింది. ద్వంద్వ ప్రయోజన సాంకేతిక వస్తువులను అడ్డుకోవడం ద్వారా జాతీయ భద్రతకు డీఆర్‌ఐ తోడ్పడింది.

ఈ సంవత్సరం కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ డీఆర్‌ఐ అధికారులు అవిశ్రాంతంగా పనిచేసి కొన్ని ముఖ్యమైన స్వాధీనాలు జరిపారు. అక్రమ రవాణాదారులను పట్టుకోవడానికి ప్రాణాలను సైతం లెక్కచేయని తెగువలో డీఆర్‌ఐ సిబ్బంది మొక్కవోని స్ఫూర్తి కనిపిస్తుంది. గత నెలలో రెండు లారీలను పట్టుకున్న డీఆర్‌ఐ, భారత్‌-మయన్మార్‌ సరిహద్దు నుంచి దేశంలోకి తరలిస్తున్న రూ.35 కోట్ల విలువైన 66.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆగస్టులో జరిగిన మరో కేసులో, దిబ్రూఘర్‌ నుంచి దిల్లీకి వచ్చిన 8 మంది విమాన ప్రయాణీకుల నుంచి రూ.42.89 కోట్ల విలువైన 83.62 కిలోల బంగారాన్ని పట్టుకుంది. 'కాలిప్సో' పేరిట జరిపిన మూడు రోజుల ఆపరేషన్‌లో, అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్‌ గుట్టును డీఆర్‌ఐ రట్టు చేసి, 3.3 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకుంది.

*****


(Release ID: 1678158) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Hindi , Tamil