హోం మంత్రిత్వ శాఖ

సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 56 వ వ్యవస్థాపక దినోత్సవం

సరిహద్దు భద్రతా దళాల వ్యవస్థాపక దినోత్సవం పరేడ్ -2020 లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ గౌరవ వందనం స్వీకరించారు.

కఠినమైన వాతావరణం , ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బీఎస్ఎఫ్ ధైర్య సిబ్బంది దేశ సరిహద్దులను సమర్థంగా రక్షిస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రతా దళాలపై నమ్మకం ఉంది. హోంమంత్రి అమిత్ షాకు మీపై విశ్వాసం ఉంది. మీరు దానిని వమ్ముచేయలేదు. బీఎస్ఎఫ్ దేశానికి గర్వకారణం” అని కవాతులో పాల్గొన్న మహిళా బృందాన్ని ప్రశంసించిన రాయ్, దేశ భద్రతలో మహిళా శక్తి పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

Posted On: 01 DEC 2020 5:34PM by PIB Hyderabad

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఈ రోజు తన 56 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  నిత్యానంద్ రాయ్ ఈ రోజు ఇక్కడి చావ్లా క్యాంప్‌లో జరిగిన బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం పరేడ్ -2020లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్  రాకేశ్ అస్తానా,  కేంద్ర సాయుధ పోలీసు బలగాల సీనియర్ అధికారులు, పోలీసులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

బీఎస్ఎఫ్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బీఎస్ఎఫ్  అమరవీరులకు మంత్రి నిత్యానంద్ రాయ్ నివాళులర్పించారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి 'పోలీస్‌ మెడల్‌ ఆఫ్‌ గ్యాలంట్రీ, 'ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ ఆఫ్‌ డిస్టింగ్విష్డ్ సర్వీస్‌' అవార్డులను అందజేశారు.  నిత్యానంద్ రాయ్ బీఎస్ఎఫ్  వార్షిక ఇ-మ్యాగజైన్ "బోర్డర్ మెన్" ను కూడా విడుదల చేశారు.

బీఎస్ఎఫ్  ధైర్య సిబ్బంది కఠినమైన భూభాగం , ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ సరిహద్దులను సమర్థంగా కాపాడుతున్నారని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో బీఎస్ఎఫ్ జవాన్ల అత్యున్నత త్యాగనిరతి, సాహసాలకు నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ సేవల వల్ల దేశంలోని ప్రతి పౌరుడు భయం లేకుండా జాతీయ అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీకి భద్రతా దళాలపై నమ్మకం ఉందని, కేంద్ర హోంమంత్రి  అమిత్ షాకు బీఎస్ఎఫ్పై విశ్వాసం కలిగి ఉన్నారని, దానిని బీఎస్ఎఫ్ సైనికులు నిలబెట్టారని అన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచారని శ్లాఘించారు.

స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న బీఎస్ఎఫ్  ఆర్టిలరీ వింగ్ తన అద్భుతమైన చరిత్రను ముందుకు తీసుకెళ్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం ఉందని రాయ్ అన్నారు. కవాతులో పాల్గొన్న మహిళా బృందాన్ని ప్రశంసించిన  రాయ్, దేశ భద్రతలో మహిళా శక్తి పెరగడంపై హర్షం ప్రకటించారు. మహిళా సైనికులు ప్రధానమంత్రి నిబద్ధతను గ్రహిస్తున్నారని అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు , మాదక ద్రవ్యాల రవాణా ద్వారా దేశానికి హాని కలిగించే కుట్రలను సరైన స్పందనతో బీఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి కాలంలో సరిహద్దు భద్రతా దళం చేసిన కృషిని అభినందిస్తూ, ఈ కాలంలో బీఎస్ఎఫ్ సిబ్బందికి కూడా వైరస్ సోకిందని, అయినా తమ స్థైర్యాన్ని కోల్పోలేదని మంత్రి చెప్పారు. సరిహద్దు భద్రతా దళం ఎదుర్కొంటున్న ప్రతి సవాలు , దాని పరిష్కారం ప్రభుత్యానికి అత్యంత ముఖ్యమని  రాయ్ అన్నారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి  అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జవాన్లు , వారి కుటుంబాలను అన్ని సదుపాయాలనూ కల్పించడానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. దేశం మొత్తం మీతో నిలుస్తుందని బీఎస్ఎఫ్కు ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్  రాకేశ్ అస్తానా బీఎస్ఎఫ్ సాధించిన విజయాలు, కొత్త కార్యక్రమాలు , భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవటానికి సన్నాహాల గురించి వివరించారు. దేశ సరిహద్దుల భద్రత , సమగ్రత గురించి భరోసా ఇచ్చారు. పాకిస్తాన్ , బంగ్లాదేశ్లతో 6,386.36 కిలోమీటర్ల పొడవున్న అంతర్జాతీయ సరిహద్దులను సంరక్షించే బీఎస్ఎఫ్.. ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు కాపలా దళమని చెప్పారు.   దేశం పట్ల తన నిబద్ధతను , దాని నినాదం ‘జీవితకాల విధి’ని పునరుద్ఘాటిస్తున్నట్టు బీఎస్ఎఫ్ ఈ సందర్భంగా ప్రకటించింది. 

***


(Release ID: 1677696) Visitor Counter : 309